సబ్సిడియేతర ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ రెట్లను పెంచుతూ ఇంధన కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. దేశ రాజధాని దిల్లీలో 14.2 కేజీల సిలిండర్‌కు రూ.11.50 పెంచినట్లు తెలిపాయి. దీని ప్రకారం సిలిండర్ ధర రూ.593కు చేరింది. ఈ ధరలు సోమవారం నుంచే అమల్లోకి వచ్చాయి.
కోల్‌కతా, ముంబయి, చెన్నై నగరాల్లో ప్రస్తుత ధర రూ. 584.50, రూ 579, రూ. 569.50గా ఉండగా.. వాటిని రూ. 616, రూ. 590.50, రూ. 606.50 లకు పెంచాయి. ఒక్క చెన్నైలోనే గరిష్ఠ స్థాయిలో ధర రూ.37 పెరిగింది.
దిల్లీలో మే నెలలో రూ. 744 ఉన్న సిలిండర్ ధరను, రూ. 581.50కు తగ్గించిన విషయం తెలిసిందే. కానీ అంతర్జాతీయ మార్కెట్లలో ధరలు పెరిగిన కారణంగా ఈసారి రేట్లను పెంచినట్టు కంపెనీలు ప్రకటించాయి. అయితే ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం కింద ఉన్న లబ్ధిదారులపై ఈ నిర్ణయం ఎటువంటి ప్రభావం చూపదని వెల్లడించాయి. జూన్ 30 వరకు ఉచిత సిలిండర్లు అందుబాటులో ఉన్నట్లు పేర్కొన్నాయి.
ఇండియన్ ఆయిల్ కార్ప్ ప్రకారం దిల్లీలో ఏటీఎఫ్ ధరను రూ. 11,030.62 పెంచాయి. ఫలితంగా ధర రూ. 33,575.48కు చేరింది. అలాగే కోల్‌కతాలో రూ. 38,543.48, ముంబయిలో రూ. 3,070.56, చెన్నైలో రూ. 34,569.30లుగా నిర్ణయించాయి.
ఇదీ చూడండి:'స్పేస్ ఎక్స్'కు ఇస్రో అభినందనలు