ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజనలో భాగంగా ఉచిత రేషన్ అందించే కార్యక్రమాన్ని ఈ నెల 30 తర్వాత పొడిగించే ప్రతిపాదనేది లేదని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. కరోనా సంక్షోభం నుంచి ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడం వల్ల ప్రతిపాదన చేయలేదని ఆహార, ప్రజాపంపిణీ విభాగం కార్యదర్శి సుదర్శన్ పాండే వెల్లడించారు.
గతేడాది లాక్డౌన్ దృష్ట్యా గరీబ్ కల్యాణ్ అన్న యోజన ద్వారా పేదలకు తొలుత 8 నెలలు ఉచిత రేషన్ అందించారు. 2020 ఏప్రిల్‌లో ఈ కార్యక్రమం మొదలైంది. కరోనా సెకండ్ వేవ్‌లో ఈ ఏడాది మే, జూన్ వరకు అమలు చేశారు. కరోనా పరిస్థితుల్లో పేదలు ఇబ్బంది పడకుండా.. జూన్‌లో మరో ఐదు నెలలు పొడిగించారు. దేశవ్యాప్తంగా ఎన్ఎఫ్ఎస్ఏ(జాతీయ ఆహార భద్రత చట్టం) కింద గుర్తింపు పొందిన రేషన్ కార్డుహోల్డర్లకు ఉచిత రేషన్‌ను అందిస్తోంది కేంద్రం. 80కోట్ల మంది ఈ కార్యక్రమంతో లబ్ధిపొందినట్టు ప్రభుత్వం గతంలో వెల్లడించింది.
పామ్ ఆయుల్ కూడా..
ముడి పామ్ ఆయిల్, ముడి సోయాబీన్ ఆయిల్, ముడి సన్‌ఫ్లవర్ ఆయిల్‌పై కనీస సుంకాన్ని 2.5శాతం నుంచి సున్నాకు తగ్గించినట్టు కేంద్రం వెల్లడించింది. ఏడాదిగా పెరుగుతున్న వంట నూనె ధరలకు చెక్ పెట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేసింది. అదే సమయంలో క్రూడ్ పామ్ ఆయిల్‌పై ఉన్న వ్యవసాయ సెస్‌ను కూడా 20శాతం తగ్గించి.. 7.5శాతానికి తెచ్చినట్టు తెలిపింది. క్రూడ్ సోయాబీన్ ఆయిల్, క్రూడ్ సన్‌ఫ్లవర్ ఆయిల్‌పై 5శాతం అగ్రీసెస్ను తగ్గించినట్టు పేర్కొంది.
ఇదీ చూడండి:- గుడ్ న్యూస్.. మరింత తగ్గనున్న వంట నూనె ధర!