దిగుమతులపై ఆధారపడొద్దని భారత వాహన, విడిభాగాల పరిశ్రమకు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సూచించారు. విదేశాల నుంచి కొనే ఉత్పత్తులకు ప్రత్యామ్నాయంగా వాటిని స్థానికంగానే అభివృద్ధి చేయాలన్నారు. దేశ ఆటో రంగం గొప్ప ప్రపంచ తయారీ హబ్‌గా నిలిచేంత కీలకమైనదని అన్నారు. భారత వాహన విడిభాగాల తయారీదారుల సంస్థ (ఏసీఎంఏ) వార్షిక సదస్సులో ఆయనతో పాటు పలువురు ప్రముఖులు ప్రసంగించారు.
దిగుమతులూ అవసరమే..
భారత వాహన, విడిభాగాల పరిశ్రమ దిగుమతుల నుంచి పూర్తిగా విడిపోరాదని మహీంద్రా & మహీంద్రా ఎండీ పవన్ గోయెంకా అభిప్రాయపడ్డారు. తక్కువ ధరకు అందించేలా పోటీతత్వంతో శ్రమించాలని, టెక్నాలజీతో నవ్య ఆవిష్కరణలు తీసుకొచ్చి ప్రపంచ సరఫరా వ్యవస్థలో గొప్ప భాగస్వామ్యం వహించాలని అన్నారు. మనమే అన్నీ చేయలేమని, అందువల్ల మనకంటే బాగా ఉత్పత్తి చేయగల దేశాల నుంచి వస్తువులను దిగుమతి చేసుకోవడం కొనసాగించాలని అభిప్రాయపడ్డారు.
ఓ అవకాశం వచ్చింది..
భారత వాహన, విడిభాగాల రంగం ప్రపంచ హబ్‌గా మారేందుకు కొవిడ్-19 ఓ అవకాశాన్ని తీసుకొచ్చిందని, దీన్ని వృధా చేసుకోరాదని హీరో మోటోకార్ప్ సీఎండీ, సీఈవో, పవన్ ముంజాల్ అన్నారు.
ఆ పెట్టుబడులు సాధించాలి..
భౌగోళిక రాజకీయ ఇబ్బందులను అధిగమించడానికి చైనాకు కంపెనీలు చాలామేరకు ఇప్పుడు ఇతర దేశాలకు తరలిపోవడమో లేదా ప్లాంట్లు పెట్టడమో చేస్తున్నాయని సియామ్ కొత్త అధ్యక్షుడు కెనిచి అయుకవా పేర్కొన్నారు. అలాంటి పెట్టుబడులను ఆటో, విడిభాగాల రంగం తీసుకురావడమో లేదా భారత్‌లో ఉత్పత్తికి సంబంధించి వాటితో ఒప్పందాలు కుదుర్చుకోవడమో చేయాలన్నారు.
సహకారంతో ముందుకు..
కొవిడ్ సంక్షోభం నేపథ్యంలో ఆటోమోటివ్ పరిశ్రమ ఆర్థికంగా పునఃప్రారంభ దశలో ఉందని.. కొత్త సవాళ్లున్నాయని టాటా మోటార్స్ ఎండీ, సీఈఓ గంటర్ బుషెక్ అన్నారు. కార్మికుల కొరత ఏర్పడనుందన్నారు. కొవిడ్ అనూహ్యమైన డిమాండ్‌ను తెచ్చిందని ఈ నేపథ్యంలో ప్రభుత్వంతో పాటు, ఈ రంగంలోని భాగస్వాములంతా సహకారంతో ముందుకెళ్లాలన్నారు.
ఉత్పత్తి పెంచండి..
ఉత్పత్తిని పెంచాలని, ఆకర్షణీయ విధానాలను అవలంబించాలని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ వాహన విడిభాగాల పరిశ్రమకు సూచించారు.
ఇదీ చూడండి:కృత్రిమ మేధ ఉద్యోగాలు పెరుగుతున్నాయ్