కరోనా మహమ్మారితో కుదేలైన ఆర్థిక వ్యవస్థకు తిరిగి జీవం పోయడానికి ఉద్దేశించిన భారీ ప్యాకేజీ వివరాలను ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ రెండో రోజు వెల్లడించారు. లాక్డౌన్ కారణంగా చితికిపోయిన వలస కార్మికులు, చిరు వ్యాపారులు, సన్నకారు రైతులను ఆదుకోవడమే ప్రధాన అజెండాగా కీలక ప్రకటనలు చేశారు. మొత్తం 9 విభాగాలకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
లాక్డౌన్ కారణంగా సరైన పని దొరక్క తీవ్ర ఇబ్బందులు పడుతున్న వలస కార్మికులకు ఊరట కలిగిస్తూ పలు చర్యలు ప్రకటించారు ఆర్థిక మంత్రి. పట్టణాల్లో ఇళ్లు లేని పేదలకు అండగా ఉంటామన్నారు. వారి పట్ల కేంద్రం పూర్తి శ్రద్ధ వహిస్తున్నట్లు వెల్లడించారు. నిరుపేదల కోసం ఏర్పాటు చేసిన ఆశ్రయాల్లో గత రెండు నెలల నుంచి.. రోజూ మూడు పూటల భోజనం అందిస్తున్నట్లు నిర్మల తెలిపారు. దీనికయ్యే ఖర్చు పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే భరిస్తున్నట్లు స్పష్టం చేశారు.
రేషన్ ఉచితం
రానున్న 2 నెలలపాటు వలస కార్మికులకు ఉచితంగా ఆహార ధాన్యాలు పంపిణీ చేస్తామని నిర్మల స్పష్టం చేశారు. రేషన్ కార్డు లేకపోయినా ఐదు కిలోల బియ్యం లేదా గోధుమలు, కిలో పప్పు అందిస్తామన్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా రేషన్ కార్డ్ ఉన్నవారికి 3 నెలలపాటు ఉచితంగా నిత్యవసరాలు పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు.
లబ్ధిదారుల్ని గుర్తించి రాష్ట్ర ప్రభుత్వాలే నిత్యవసరాలను అందజేస్తాయని నిర్మల వివరించారు. దీనికయ్యే మొత్తం ఖర్చు రూ. 3,500 కోట్లు కేంద్రమే భరిస్తుందని స్పష్టం చేశారు.
వన్ నేషన్-వన్ రేషన్
ఆగస్టు నుంచి 'ఒకే దేశం- ఒకే రేషన్' కార్డు విధానం అమలు చేస్తామని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ఫలితంగా లబ్ధిదారులు ఎక్కడ ఉన్నా.. రేషన్ సరకులు తీసుకునే వెసులుబాటు కలుగుతుందని ఆమె తెలిపారు. ఈ వెసులుబాటు వల్ల స్వస్థలాలను వదిలి ఇతర రాష్ట్రాలకు వెళ్లే వలస కార్మికులకు ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు.
పట్టణ పేదలకు ఆవాసం
వలస కార్మికులు, పట్టణ పేదల కోసం కొత్త పథకం ద్వారా చౌకగా అద్దె ఇళ్లు అందుబాటులోకి తీసుకొస్తామని ఆర్థికమంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యంలో వీటిని అభివృద్ధి చేస్తామన్నారు. త్వరలో పూర్తి వివరాలు ప్రకటిస్తామన్నారు.
సన్నకారు రైతులకు అండ
చిన్న, సన్నకారు రైతులు సరైన ఆర్థిక వనరులు లేక ఇబ్బంది పడుతున్నారని ఆర్థికమంత్రి పేర్కొన్నారు. వారందరికీ కేంద్రం అండగా ఉంటుందని స్పష్టం చేశారు. కిసాన్ కార్డుదారులకు ఇప్పటికే రూ.25వేల కోట్ల రుణాలు మంజూరు చేసినట్లు తెలిపారు. దేశంలో 3 కోట్ల మంది రైతులకు రూ.4.22లక్షల కోట్ల రుణాలు ఇచ్చినట్లు స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా.. కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా రెండున్నర కోట్ల మంది రైతులకు రూ.2 లక్షల కోట్ల అదనపు రుణాలు అందించనున్నట్లు నిర్మల తెలిపారు. పశు పోషకులు, మత్స్యకారులను కూడా ఇందులో భాగస్వామ్యం చేయనున్నట్లు స్పష్టం చేశారు.
రబీ పంట కోత అనంతర కార్యక్రమాలు సహా ఖరీఫ్ ముందస్తు ఏర్పాట్లకు ఈ నిధులు ఉపయోగపడతాయని చెప్పారు నిర్మల. దీని ద్వారా 3 కోట్ల మంది రైతులకు అదనపు ప్రయోజనం కలుగుతుందని స్పష్టం చేశారు. గ్రామీణ సహకార బ్యాంకులు, రీజనల్ రూరల్ బ్యాంకులు ద్వారా రైతులు ఈ పంట రుణాలు తీసుకోవచ్చన్నారు.
ముద్రా శిశు రుణాలు
ముద్రా యోజన కింద శిశు రుణాలు తీసుకున్నవారికి వడ్డీ రేట్లలో సబ్సిడీ ఇస్తున్నట్లు ఆర్థికమంత్రి తెలిపారు. 3 నెలల మారటోరియం తర్వాత 12 నెలల పాటు 2 శాతం ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ (వడ్డీరేట్లలో సబ్సిడీ) సౌలభ్యం కల్పిస్తున్నట్లు స్పష్టం చేశారు.
వీధి వ్యాపారులు
కరోనా కారణంగా వీధి వ్యాపారులే తీవ్రంగా దెబ్బతిన్నారని నిర్మలా పేర్కొన్నారు. పూర్తి లాక్డౌన్ విధించడం వల్ల ఎలాంటి వ్యాపారం నిర్వహించే అవకాశం లేకుండా పోయిందని తెలిపారు. ఈ నేపథ్యంలో లాక్డౌన్ తర్వాత వెంటనే వ్యాపారాలు ప్రారంభించే పలు ఉద్దీపనలు ప్రకటించారు.
ఉపాధి హామీ
2020 మే 13 నాటికి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా 14.62 కోట్ల రోజుల పని కల్పించినట్లు నిర్మల తెలిపారు. ఉపాధి హామీ కోసం రాష్ట్రాలకు రూ.10 వేల కోట్లు బట్వాడా చేసినట్లు తెలిపారు. ఉపాధి కోసం 2.33 కోట్ల మంది కార్మికులు 1.87లక్షల గ్రామ పంచాయతీలలో నమోదు చేసుకున్నట్లు స్పష్టం చేశారు. సగటు వేతన రేటు రూ.182 నుంచి రూ.202కి పెంచిన విషయం గుర్తుచేశారు. స్వస్థలాలకు తరలివెళ్తున్న కార్మికుల వివరాలు సేకరిస్తున్నట్లు తెలిపారు. వలస కూలీలకు ఉపాధి కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించారు. చెట్లు నాటడం, ఉద్యాన పంటలు, పశుపోశణ వంటి పనులతో వర్షాకాలంలోనూ ఉపాధి హామీ కొనసాగించనున్నట్లు స్పష్టం చేశారు.
'కాంపా' పథకం
అడవుల పరిరక్షణ, మొక్కలు నాటేందుకు నూతన పథకం ప్రకటించారు విత్తమంత్రి. గిరిజనులు, ఆదివాసీలకు ఉపాధి కల్పించే విధంగా రూ.6 వేల కోట్లతో 'కాంపా' పథకం రూపొందించారు. ఈ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాల్సిన బాధ్యత రాష్ట్రాలదేనని స్పష్టం చేశారు.
హౌసింగ్