ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ రెండో రోజు ప్రకటనలో.. వలస కూలీలపై వరాల జల్లు కురిపించారు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్. ఉచితంగా ఆహార ధాన్యాల పంపిణీ సహా, పట్టణ పేదలకు, వలస కార్మికులకు చౌకగా అద్దె ఇళ్లు సమకూర్చేందుకు నూతన పథకం తీసుకొస్తామన్నారు.
ఆకలి తీరుస్తాం...
రానున్న రెండు నెలల పాటు ఉచితంగా ఆహార ధాన్యాలు పంపిణీ చేస్తామని పేర్కొన్నారు నిర్మలా. రేషన్ కార్డు లేకపోయినప్పటికీ.. ప్రతి కుటుంబానికి ఐదు కిలోల బియ్యం లేదా గోధుమలు, కిలో పప్పు అందిస్తామని స్పష్టం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వాలు స్వయంగా లబ్ధిదారులను గుర్తించి రేషన్ అందజేస్తాయని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. ఫలితంగా 8 కోట్ల మంది వలస కార్మికులకు లబ్ధి చేకూరుతుందని ఆమె తెలిపారు. ఇందుకు అయ్యే ఖర్చు రూ.3,500 కోట్లను కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని స్పష్టం చేశారు.
ఒకే రేషన్ కార్డు విధానం..
ఇకపై ఒకే దేశం- ఒకే రేషన్ కార్డు విధానం అమలు చేస్తామని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ఫలితంగా లబ్ధిదారులు ఎక్కడ ఉన్నా.. రేషన్ సరకులు తీసుకునే వెసులుబాటు కలుగుతుందని ఆమె తెలిపారు.
కొత్త పథకం..
వలస కార్మికులు, పట్టణ పేదల కోసం.. ప్రధాన మంత్రి ఆవాస యోజన కొత్త పథకం అమలు చేస్తామని ఆర్థికమంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యంలో చౌకగా అద్దె ఇళ్లు అభివృద్ధి చేస్తామన్నారు. దీని వల్ల వలస కార్మికులు, పట్టణ పేదలకు నివాస భారం తగ్గుతుందన్నారు. త్వరలో పూర్తి వివరాలు ప్రకటిస్తామని ఆమె తెలిపారు.
ఇదీ చూడండి: టీడీఎస్, టీసీఎస్ రేట్లను సవరించిన సీబీడీటీ