కరోనాను ఎదుర్కొనేందుకు కృషి చేస్తున్న 22.12 లక్షల వైద్య సిబ్బందికి ఒక్కొక్కరికి 50 లక్షల రూపాయల బీమా కల్పించటానికి అంగీకరించింది ద న్యూ ఇండియా అష్యూరెన్స్ సంస్థ. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు జారీ చేసింది.
కరోనా నియంత్రణకు పాటుపడుతున్న వైద్య, మున్సిపల్, పారా మెడికల్ సిబ్బంది, ఆశా కార్యకర్తలకు ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద 50 లక్షల బీమా సదుపాయం కల్పిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈ బీమా మూడు నెలల వరకు మాత్రమే వర్తిస్తుందని తెలిపారు.
బీమా విధివిధానాలు
- దేశవ్యాప్తంగా 22.12 లక్షల మందికి ఈ బీమా వర్తిస్తుంది.
- వైద్యులు, వైద్య నిపుణులు, ఆశావర్కర్లు, పారామెడికల్ సిబ్బంది, నర్సులు, వార్డుబాయ్‌లు, పారిశుద్ధ్య కార్మికులు, రోగనిర్ధరణ పరీక్షలు నిర్వహించే సిబ్బంది, ఇతర ఆరోగ్య కార్యకర్తలు.
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన అన్ని ఆరోగ్య కేంద్రాలు, ఆరోగ్య వికాస కేంద్రాలు, ఆసుపత్రుల్లో పనిచేసే సిబ్బందికి వర్తింపు.
- గతంలో ఎన్నడూ తలెత్తని పరిస్థితులు నెలకొన్న ప్రస్తుత తరుణంలో ప్రైవేటు ఆసుపత్రి సిబ్బంది/ పదవీ విరమణ/ స్వచ్ఛంద/ పట్టణ స్థానిక సంస్థలు/ కాంట్రాక్టు/ దినకూలీ/ తాత్కాలిక/ పొరుగుసేవల సిబ్బంది/ రాష్ట్రాలు/ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని స్వయం ప్రతిపత్తి ఆసుపత్రులు, ఎయిమ్స్, ఐఎన్‌ఐలు, వివిధ కేంద్ర మంత్రిత్వశాఖల పరిధిలో పని చేసే ఆసుపత్రులకు కరోనా సంబంధిత బాధ్యతలను అప్పగించొచ్చు. వీరెవరైనా కరోనా చికిత్స సంబంధిత సేవల్లో ఉంటే వారికి ఈ బీమా వర్తిస్తుంది.
- ఆయా సిబ్బందికి ఇప్పటికే ఏవైనా బీమాలుంటే వాటికి అదనంగా ఈ బీమా వర్తిస్తుంది.
ఇదీ చూడండి:రూ.50 లక్షల ప్రమాద బీమా ఎవరెవరికి?