అపరకుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ మరోసారి భారత్‌లోనే అత్యంత ధనవంతునిగా నిలిచారు. ఐఐఎఫ్ఎల్ వెల్త్ హురున్ ఇండియా విడుదల చేసిన తాజా జాబితాలో రూ.3,80,700 కోట్ల నికర సంపదతో ఆయన అగ్రస్థానం దక్కించుకున్నారు. ముఖేశ్ ఇలా అగ్రస్థానంలో నిలవడం వరుసగా ఇది ఎనిమిదోసారి.
రూ.1,86,500 కోట్లతో...లండన్‌కు చెందిన ఎస్పీ హిందుజా అండ్ ఫ్యామిలీ తన రెండో స్థానాన్ని నిలబెట్టుకుంది. రూ.1,17,100 కోట్ల సంపదతో విప్రో వ్యవస్థాపకుడు అజీమ్ ప్రేమ్‌జీ మూడో స్థానంలో నిలిచారు. ఈ ధనవంతుల జాబితాలో 152 మంది మహిళలు చోటుసంపాదించడం విశేషం.
ఐఐఎఫ్ఎల్ వెల్త్ హురున్ ఇండియా రిచ్ లిస్ట్ ప్రకారం.. వెయ్యి కోట్లకుపైగా సంపద కలిగిన భారతీయుల సంఖ్య 2018లో 831కాగా, 2019లో 953కి పెరిగింది. అయితే యూఎస్ డాలర్ ఆధారంగా చూస్తే బిలియనీర్ల సంఖ్య 141 నుంచి 138కి తగ్గింది.
"భారత ధనవంతుల జాబితాలోని మొదటి 25మంది సంపద.. భారత జీడీపీలో 10 శాతానికి సమానం. మొత్తం 953 మంది ధనవంతుల సంపద కలిపితే అది 27 శాతంగా ఉంది."
- ఐఐఎఫ్ఎల్ వెల్త్ హురున్ ఇండియా రిట్ లిస్ట్
ఆర్సెలర్ మిత్తల్ ఛైర్మన్, సీఈఓ ఎల్ఎన్ మిత్తల్ రూ.1,07,300 కోట్లతో నాల్గవ స్థానంలో ఉన్నారు. రూ.94,500 కోట్లతో గౌతమ్ ఆదానీ ఐదో స్థానంలో నిలిచారు.
ఇదీ చూడండి: సర్వత్రా ప్రతికూలం... మార్కెట్లకు భారీ నష్టం