భారత కుబేరుడు ముకేశ్ అంబానీ వరుసగా 12వ ఏడాదీ తన వార్షిక వేతనాన్ని రూ.15 కోట్లకే పరిమితం చేసుకున్నారు. మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరం(2019-20)లో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్‌గా రూ.15 కోట్లు మాత్రమే తీసుకున్న ఆయన.. కొవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో ఆ తర్వాత వేతనం వదులుకోవాలని నిర్ణయించుకున్నారు.
రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు ఛైర్మన్ హోదాలో 2008-09 నుంచి జీతం, భత్యాలు, కమిషన్ అన్నీ కలిపి రూ.15 కోట్లే తీసుకుంటున్నారు ముకేశ్. ఏటా దాదాపు రూ.24 కోట్లను వదులుకుంటున్నారు. ఇక నిఖిల్, హితాల్ మేస్వానీలతో పాటు కంపెనీ ఇతర శాశ్వత డైరెక్టర్ల వేతనాలు మాత్రం 2019-20లో భారీగా పెరగడం గమనార్హం.
కొవిడ్-19 సంక్షోభం ముగిసేంత వరకు ముకేశ్ అంబానీ స్వచ్ఛందంగా వేతనాన్ని వదులుకున్నారని కంపెనీ వార్షిక నివేదికలో పేర్కొంది. ముకేశ్ 2019-20 వేతనంలో రూ.4.36 కోట్ల జీతం, భత్యాలున్నాయి. 2018-19 జీతభత్యాలైన రూ.4.45 కోట్లతో పోలిస్తే ఇది కొంచెం తక్కువ. ఇక కమిషన్ రూ.9.53 కోట్లలో మార్పు లేదు. ఇతర భత్యాలు మాత్రం రూ.31 లక్షల నుంచి రూ.40 లక్షలకు పెరిగాయి. ఇక పదవీ విరమణ ప్రయోజనాలు రూ.71 లక్షలుగా ఉన్నాయి.
ఇదీ చదవండి: భారత సంస్థలపై చైనా హ్యాకర్ల దాడి!