ట్రావెల్ సంస్థ థామస్ కుక్ దివాలా ప్రకటించిన తరువాత... విదేశాల్లో చిక్కుకున్న 1,50,000 మంది విహారయాత్రికుల్లో సగానికి పైగా స్వదేశం బ్రిటన్‌కు చేరుకున్నారని ఆ దేశ పౌర విమానయాన నియంత్రణ సంస్థ (సీఏఏ) తెలిపింది.
"ఆపరేషన్ మాటర్‌హార్న్ ద్వారా మొదటి 5 రోజుల్లో... 76 వేల మంది యాత్రికులు స్వదేశం బ్రిటన్‌కు చేరుకున్నారు. యుద్ధాలు లేని శాంతి సమయంలో ఇంత పెద్ద సంఖ్యలో మనుషులను తరలించడం ఇదే మొదటిసారి."
- బ్రిటన్ పౌరవిమాన నియంత్రణ సంస్థ (సీఏఏ)
పోటీ తట్టుకోలేక..
ఘనచరిత్ర కలిగిన ట్రావెల్ కంపెనీ థామస్‌కుక్... ఆన్లైన్ పోటీని తట్టుకోలేకపోయింది. కొన్ని వినాశకరమైన విలీనాలు, అధిక వ్యయం, రుణ భారం కంపెనీకి గుదిబండగా మారాయి. అయితే తన పతనానికి బ్రెగ్జిట్ అనిశ్చితే కారణమని ఆ సంస్థ ఆరోపించింది. చివరకు తమ వ్యాపారం నిలబెట్టుకొనేందుకు కావాల్సిన నిధులు సమీకరించలేక దివాలా ప్రకటించింది.
95 శాతం మంది...
విహారయాత్రకు వెళ్లినవాళ్లలో 95 శాతం మంది.. వాస్తవంగా వారి టూర్ ప్లాన్‌లో ఏ రోజు తిరిగి ఇళ్లకు వద్దామనుకున్నారో.. అదే రోజున తిరిగి వస్తారని సీఏఏ తెలిపింది. థామస్‌కుక్ కస్టమర్లకు ఆతిథ్యం ఇచ్చే హోటళ్లకు చెల్లింపులు చేస్తున్నట్లు స్పష్టం చేసింది.
శనివారం 76 విమానాలు కేటాయించామని, ఇవి 16,700 మందిని స్వదేశానికి తీసుకొస్తాయని సీఏఏ పేర్కొంది.
ప్రస్తుతం చేపట్టిన ఈ ఆపరేషన్ మాటర్‌హార్న్ అక్టోబర్ 6 వరకు కొనసాగుతుందని, ఇందుకోసం 1000 విమానాలను సిద్ధంగా ఉంచామని సీఏఏ స్పష్టం చేసింది.
ఇదీ చూడండి: 'భారతీయుల తరఫున మాట్లాడే అర్హత పాక్‌కు లేదు'