దేశంలో రైతుల కన్నా నిరుద్యోగులు, స్వయం ఉపాధిదారుల ఆత్మహత్యలే అధికమని అధికారిక డేటాలో తెలిసింది. జాతీయ క్రైమ్ రికార్డ్ బ్యూరో (ఎన్సీఆర్బీ) ప్రకారం 2018లో ప్రతి రోజూ సగటున 35 మంది నిరుద్యోగులు, 36 మంది స్వయం ఉపాధిదారులు బలవన్మరణాలకు పాల్పడ్డట్లు వెల్లడైంది.
పెరిగన ఆత్మహత్యలు..
2018లో మొత్తం 1,34,516 మంది బలవన్మరణానికి పాల్పడ్డట్లు ఎన్సీఆర్బీ డేటాలో తేలింది. 2017తో పోలిస్తే ఈ సంఖ్య 3.6 శాతం అధికం. 2017లో దేశంలో ఆత్మహత్యల రేటు లక్ష మందికి ఒకరు ఉండగా.. 2018లో ఆ రేటు 0.3 శాతం పెరిగింది.
2018లో మొత్తం ఆత్మహత్యల్లో 12,936 మంది నిరుద్యోగులు (9.8 శాతం), 13,149 మంది స్వయం ఉపాధిదారులు (9.6 శాతం) ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఇదే సమయంలో 7.7 శాతంతో 10,349 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్లు ఎన్సీఆర్బీ విడుదల చేసిన గణాంకాలు చెబుతున్నాయి.
మహిళల్లో గృహిణులే అధికం..
2018లో బలవన్మరణానికి పాల్పడ్డ మహిళల్లో 54.1 శాతం గృహిణులేనని ఎన్సీఆర్బీ నివేదిక తెలిపింది. ఈ సమయంలో మొత్తం 42,391 మంది మహిళలు ఆత్మహత్యలకు పాల్పడగా.. వీరిలో 22,937 మంది గృహిణులని గణాంకాలు చెబుతున్నాయి. 2018లో మొత్తం ఆత్మహత్యల్లో మహిళల వాటా 17.1 శాతంగా ఉంది.
ఉద్యోగుల ఆత్మహత్యల లెక్కలు
2018లో ఆత్మహత్యలకు పాల్పడిన వారిలో ప్రభుత్వ ఉద్యోగులు 1.3 శాతం (1,707), ప్రైవేటు ఉద్యోగులు 6.1 శాతం (8,246)గా ఉన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల ఆత్మహత్యలు 1.5 శాతం (2,022)గా ఉన్నాయి. ఇదే సమయంలో విద్యార్థుల బలవన్మరణాలు 7.6 శాతం (10,159)గా ఉన్నట్లు అధికారిక డేటాలో తెలిసింది.
రాష్ట్రాల వారీగా
మొత్తం ఆత్మహత్యల్లో తొలి స్థానాల్లో ఉన్నరాష్ట్రాలు ఇవే..
రాష్ట్రం | ఆత్మహత్యల సంఖ్య | శాతాల్లో |
మహారాష్ట్ర | 17,972 | 13.4 శాతం |
తమిళనాడు | 13,896 | 10.3 శాతం |
బంగాల్ | 13,255 | 9.9 శాతం |
మధ్యప్రదేశ్ | 11,775 | 8.8 శాతం |
కర్ణాటక | 11,561 | 8.6 శాతం |
మొత్తం ఆత్మహత్యల్లో ఈ ఐదు రాష్ట్రాల వాటానే 50.9 శాతంగా ఉండటం గమనార్హం.
ఇదీ చూడండి:ప్రతి ఉద్యోగి సూపర్ యాన్యుయేషన్ గురించి తెలుసుకోవాల్సిందే!