మైక్రోసాఫ్ట్ మూలాలు పటిష్ఠమని, కరోనా వైరస్ ప్రభావం నుంచి వెంటనే బయటపడతామనే నమ్మకం తమకు ఉందని మైక్రోసాప్ట్ సీఈఓ సత్య నాదెళ్ల అన్నారు. అయితే అమెరికా, ఐరోపా, ఇతర అభివృద్ధి చెందిన విపణుల్లో గిరాకీపై ఏ మేర ప్రభావం పడిందన్నదే ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారిందని ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.
ఇంటి నుంచే క్లయింట్ల అవసరాలను తీరుస్తున్న విధానంపై ఆయన సంతృప్తిని వ్యక్తం చేశారు. అయితే సరఫరా విషయంలోనే అవరోధాలు ఎదురవుతున్నాయని అన్నారు. ఈ ఏడాది చివరిలోగా ఎక్స్‌బాక్స్ గేమింగ్ కన్సోల్ సహా పలు సర్ఫేస్ డివైజెస్‌ను విడుదల చేయనున్నట్లు కొవిడ్ పరిణామాలకు ముందు మైక్రోసాఫ్ట్ హామీ ఇచ్చింది. అయితే వీటిని అందుబాటులోకి తెస్తామా లేదా అనే దాని కంటే.. నాణ్యత, గిరాకీ పరిస్థితులు, ముఖ్యంగా ప్రజల భద్రతపై ఎక్కువగా దృష్టి సారిస్తున్నట్లు ఆయన చెప్పారు.