కిరాణా దుకాణాలను 48 గంటల వ్యవధిలోనే సూపర్ మార్కెట్లగా తీర్చిదిద్దే ప్రణాళికలు రచించి విజయవంతంగా అమలు చేస్తున్నామని మెట్రో ఎండీ, సీఈఓ అరవింద్ మేడిరట్ట పేర్కొన్నారు. విశాఖపట్నంలో 'మెట్రో హోల్‌సేల్ స్టోర్'ను ప్రారంభించిన సందర్భంగా ఆయన 'ఈనాడు'తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ విశేషాలు..
దేశీయంగా మెట్రోను ఎలా విస్తరించాలనుకుంటున్నారు?
జర్మనీకి చెందిన 'మెట్రో క్యాష్ అండ్ క్యారీ' సంస్థ ప్రపంచవ్యాప్తంగా 30 దేశాల్లో వ్యాపారాన్ని విజయవంతంగా కొనసాగిస్తోంది. భారతదేశంలో 19 నగరాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తూ ప్రస్తుతం భారతదేశ అతిపెద్ద హోల్‌సేల్ వ్యాపార సంస్థగా మెట్రో రికార్డు అవతరించింది. దేశీయంగా 29వ స్టోర్‌ను విశాఖలో ప్రారంభించింది. ఆంధ్రప్రదేశ్‌లో పదేళ్ల కిందట విజయవాడలో తొలి స్టోర్ ఏర్పాటు చేశాం. ఏపీలో రెండో స్టోర్‌ను విశాఖలో ప్రారంభించాం. పెద్ద నగరమైన విశాఖలో మరికొన్ని స్టోర్లు నెలకొల్పాలన్న ఆలోచన ఉంది. కొద్దిరోజుల్లో గుంటూరులో మరోటి ప్రారంభిస్తాం.
పోటీ ఎక్కువగా ఉన్నందున, మీ సంస్థ విజయానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు?
దేశవ్యాప్తంగా మెట్రోకు 35లక్షల మంది వ్యాపారులు అనుసంధానమై ఉన్నారు. విశాఖలో స్టోర్ ప్రారంభించే సమయానికే 50వేల దుకాణాలు/సంస్థలు మా దగ్గర సరకు కొనుగోలు చేయడానికి అనుమతులు పొందాయి. రూ.వేలు ఖరీదు చేసే ఎలక్ట్రానిక్ ఉపకరణాల నుంచి నిత్యం ఉపయోగించే కూరగాయలు, చేపలు, మాంసం తదితరాల వరకు వేల రకాల ఉత్పత్తులను విక్రయానికి అందుబాటులో ఉంచుతున్నాం. ఇదే ఆదరణకు కారణమవుతోంది.
మెట్రోతో అనుసంధానమైన సంస్థలకు మీరు ప్రత్యేకంగా ఏమైనా సేవలు అందిస్తున్నారా?
కిరాణా దుకాణాలకు నేటికీ ఆదరణ తగ్గలేదు. అయితే ఇవి మరింత సౌకర్యవంతంగా ఉండాలని కొనుగోలుదారులు కోరుకుంటున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఆయా దుకాణాలను సూపర్ మార్కెట్లుగా మార్చే బృందాన్ని మా దగ్గర సిద్ధంగా ఉంచాం. ఈ పనిని కేవలం 48 గంటల్లో పూర్తి చేస్తాం. ఇందుకు అయ్యే వ్యయంలో కొంత భాగానికి రుణం ఇప్పించే బాధ్యత కూడా తీసుకుంటున్నాం. రూ.లక్ష వరకు రాయితీ ఇస్తున్నాం. 'స్మార్ట్ కిరాణా' పేరుతో వారికి అవసరమైన డిజిటల్ పరిజ్ఞానాలూ అందిస్తున్నాం.
మీ సంస్థపై కొవిడ్ ప్రభావం ఎలా ఉంది? అధిగమించడానికి ఏయే జాగ్రత్తలు తీసుకుంటున్నారు?
కొవిడ్ కాలం మెట్రో సంస్థకు కలిసి వచ్చిందనే చెప్పాలి. మేము కూడా సరుకులను మా కొనుగోలుదారుల సంస్థలకే పంపిణీ చేసేలా 'ఇ- కామర్స్' విధానాల్ని, యాప్ పరిజ్ఞానాల్ని అందిపుచ్చుకున్నాం. కొందరు వ్యాపారులు ఆర్డర్ చేసిన తక్కువ సమయంలోనే సరకు అందాలని కోరుకుంటున్నారు. ఫలితంగా ఆర్డర్ల సంఖ్య, కొనుగోళ్ల పరిమాణం పెరిగింది. ఇక మా స్టోర్‌కు వచ్చి కావాల్సిన సరకు తీసుకువెళ్లేవారికి అత్యంత సౌకర్యవంతంగా ఉండేలా, అద్భుత అనుభూతి కలిగేలా అన్ని రకాల ఏర్పాట్లూ ఉన్నాయి. కొవిడ్‌ను దృష్టిలో ఉంచుకుని 30 రకాల అదనపు భద్రత ఏర్పాట్లు అమలు చేస్తున్నాం. కొవిడ్ వ్యాప్తికి అవకాశం లేని రీతిలో ముందస్తు ఏర్పాట్లు, విశాలమైన మార్గాలను ఏర్పాటు చేశాం. 200 వరకు కార్లు నిలిపే విధంగా పార్కింగ్ సౌకర్యం కల్పించాం.
ఆన్‌లైన్ కొనుగోళ్లు పెరుగుతున్న నేపథ్యంలో సంప్రదాయ విక్రయాలు, కిరాణా దుకాణాల భవిష్యత్తు ఎలా ఉంటుంది?
దేశంలో జరుగుతున్న కిరాణా వస్తువుల కొనుగోళ్లలో ఆన్‌లైన్ వాటా 3.5 శాతమే. అందువల్ల కిరాణా దుకాణాలు, సూపర్ మార్కెట్ల భవిష్యత్తుకు ఎలాంటి ఢోకా ఉండదు. అయితే మారుతున్న కొనుగోలుదారుల అభిరుచికి అనుగుణంగా ఈ దుకాణాలు అదనపు సేవలు అందించగలగాలి. ఆమేరకు దుకాణ యజమానులకు సలహాలు, సూచనలు కూడా ఇప్పిస్తున్నాం. కొనుగోలుదారుల సరళిని విశ్లేషించి దుకాణాల యజమానులకు కన్సల్టెన్సీ సేవలు అందిస్తున్నాం. కిరాణా దుకాణాల వారు కూడా తమ చుట్టుపక్కల వారి నుంచి ఆన్‌లైన్లో ఆర్డర్లు తీసుకుని, సరుకును ఇంటికి పంపేలా ప్రోత్సహిస్తున్నాం.
ఇదీ చూడండి: నీరజ్ చోప్డాకు ఆనంద్ మహీంద్రా ప్రత్యేక బహుమతి!