కొత్త రాష్ట్రమైనా... తెలంగాణ అద్భుత ప్రగతి సాధించి, అభివృద్ధిలో దూసుకెళ్తోందని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. విద్య, వైద్య రంగాల్లో అంతర్జాతీయ ప్రమాణాలు పాటిస్తున్నామన్న మంత్రి... హైదరాబాద్ సమతుల అభివృద్ధి సాధించేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్ తూర్పు ప్రాంతంలో ఐటీ విస్తరణకు చర్యలు తీసుకుంటున్నామని కేటీఆర్ తెలిపారు.
నివేదిక విడుదల...
బ్రిటన్‌కు చెందిన ప్రపంచ స్థిరాస్తి సలహా సంస్థ... నైట్ ఫ్రాంక్ హైదరాబాద్ నాలెడ్జ్ సిటీలోని డల్లాస్ సెంటర్‌లో నెలకొల్పిన కార్యాలయాన్ని కేటీఆర్ ప్రారంభించారు. ఆ సంస్థ రూపొందించిన హైదరాబాద్ నుంచి విధులు- వర్క్ ఫ్రం హైదరాబాద్ అనే నివేదికను విడుదల చేశారు.
హైదరాబాద్ నగరాన్ని విస్తరించడానికి ఉప్పల్, నాగోల్, కొంపల్లితో పాటు మరికొన్ని ప్రాంతాల్లో 5 ఐటీ పార్కులు ఏర్పాటుకు అనుమతులు మంజూరు చేశాం. బాహ్యవలయ రహదారికి 5 కి.మీ పరిధిలో టౌన్‌షిప్స్ విస్తరణ కోసం ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్ పాలసీపై సంతకం చేశాను. తూర్పు ప్రాంతంలో పెట్టుబడులు పెడితే మరిన్ని ప్రోత్సాహాకాలు అందిస్తాం.
--- కేటీఆర్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి
ఓఆర్ఆర్ చుట్టూ...
బాహ్యవలయ రహదారి చుట్టూ శాటిలైట్ టౌన్‌షిప్‌లను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. ఇప్పటికే సమీకృత టౌన్‌షిప్ విధానాన్ని మంత్రి మండలి ఆమోదించిన విషయాన్ని గుర్తుచేశారు. హైదరాబాద్‌లో వర్గాలు, వరదలను తట్టుకునేలా నాలాలను అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక రచిస్తున్నామని తెలిపారు.
ఇటీవల భారీ వర్షాలు, వరదలు హైదరాబాద్‌ను ఇబ్బంది పెట్టడం చూశాం. నాలాల అభివృద్ధి, విస్తరణ కోసం వ్యూహాత్మక అభివృద్ధి ప్రణాళిక రచిస్తున్నాం. భవిష్యత్తులో భారీ వరదలు పునరావృతం కాకుండా కాలనీలు వరదనీటిలో చిక్కుకోకుండా ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం.
--- కేటీఆర్, ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి
తొలి కరోనా టీకా...
ఔషధ రంగంలో హైదరాబాద్ మంచి పురోగతి సాధించిందని కేటీఆర్ పేర్కొన్నారు. తొలి కరోనా టీకా హైదరాబాద్ నుంచి వచ్చే అవకాశం ఉందని... భవిష్యత్‌లో వ్యాక్సిన్ ఉత్పత్తులు ఎక్కువగా భాగ్యనగరం నుంచే ఉంటాయన్నారు.
ఇదీ చూడండి: తెలంగాణలో అమలు కాబోతోన్న డిజిలాకర్ విధానం!