దేశీయ ఆటోమోబైల్ దిగ్గజం కార్ల ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న నేపథ్యంలో విక్రయాలు పెంచుకునేందుకు భారీ ఆఫర్లను ప్రకటించింది. కొత్త కారు కొనాలనుకునే వారు.. ఏ మోడల్‌పై ఎంత డిస్కౌంట్ ఉందో తెలుసుకోండి మరి..
మోడళ్ల వారీగా డిస్కౌంట్లు:
మారుతీ సుజుకి ఎస్-ప్రెస్సో..
68 హెచ్‌పీ సామర్థ్యంతో 1.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్, 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో చిన్నగా.. ఆకర్షణీయంగా ఉన్న ఈ కారు రెనాల్ట్ క్విడ్‌కి గట్టి పోటీనిస్తోంది. దీనిపై గరిష్ఠంగా 52వేల రూపాయల ప్రయోజనాలను కల్పిస్తోంది మారుతి.
సెలెరియో..
టాటా టియాగోతో పాటు.. డాట్సన్ గో వంటి మోడళ్లకు దీటుగా నిలిస్తుంది సెలెరియో.. 1.0లీటర్ కే సిరీస్ పెట్రోల్ ఇంజిన్‌ను అమర్చారు. ఈ సమర్థవంతమైన హ్యాచ్‌బ్యాక్.. విశాలమైన ఇంటీరియర్ కలిగి ఉంది. మాన్యువల్‌తో పాటు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ మోడళ్లలో లభ్యమయ్యే ఈ కారుపై గరిష్ఠంగా రూ.47వేల వరకూ ప్రయోజనాలను ప్రకటించింది సంస్థ.
ఆల్టో..
ఎంట్రీ లెవల్ మోడల్ ఆల్టోపై గరిష్ఠంగా రూ.42,000 విలువైన ప్రయోజనాలను మారుతీ ప్రకటించింది. 48 హెచ్‌పీ సామర్థ్యంతో, 0.8 లీటర్ పెట్రోల్ ఇంజిన్. ఇరుకుగా ఉన్నప్పటికీ డిమాండ్ బాగా ఉన్న మోడల్. దీనిపై రూ.42వేల వరకు ప్రయోజనాలు పొందవచ్చు.
స్విఫ్ట్..
ఇటీవలే అప్డేట్ చేసిన స్విఫ్ట్ నూతన మోడల్లో శక్తిమంతమైన 90 హెచ్‌పీ డ్యూయల్ జెట్ ఇంజిన్‌ను అమర్చారు. 1.2 లీటర్ ఇంజిన్‌తో.. మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ వేరియంట్లలో లభిస్తోంది. ఈ మోడల్‌పై గరిష్ఠంగా రూ.37వేల వరకు ప్రయోజనాలు ప్రకటించిన సంస్థ.. ఎక్స్ఛేంజ్ ఆఫర్ సైతం వర్తిస్తుందని తెలిపింది.
ఈకో..
ప్రయాణికులతో పాటు.. రవాణాకు సౌకర్యంగా ఉండే ఈ బడ్జెట్ మోడల్‌పై గరిష్ఠంగా రూ.37వేల ప్రయోజనాలు కల్పిస్తోంది మారుతీ సుజుకి. సీఎన్జీ వేరియంట్లోనూ లభ్యమయ్యే ఈకో మెయింటెనెన్స్ తక్కువగా ఉంటుందని తెలిపింది.
విటారా బ్రెజ్జా..
కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్లో విటారా బ్రెజ్జా గట్టి పోటీనిస్తోంది. 105 హెచ్‌పీ సామర్థ్యంతో.. 1.5లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో నడిచే ఈ మోడల్.. మాన్యువల్, టార్క్ కన్వర్టర్ గేర్‌బాక్స్ వేరియంట్లలో లభిస్తోంది. దీనిపై రూ.35వేల వరకు రాయితీ ప్రకటించింది మారుతీ.
డిజైర్..
పెట్రోల్ కార్లలో అత్యంత విజయవంతమైన మోడల్‌గా పేరొందిన స్విఫ్ట్ డిజైర్ హోండా అమేజ్‌తో పాటు.. ఫోర్డ్ అస్పైర్, హ్యుందాయ్ ఆరాలకు గట్టి పోటీనిస్తోంది. 90 హెచ్‌పీ డ్యూయల్ జెట్ ఇంజిన్‌తో.. ట్విన్ గేర్‌బాక్స్ వేరియంట్లలో లభించే ఈ కాంపాక్ట్ సెడాన్ మోడల్‌పై రూ.35వేల వరకు ప్రయోజనాలు కల్పించింది.
వాగన్ ఆర్..
బడ్జెట్లో వాహనంగా పేరొందిన వాగన్ ఆర్.. 68, 83 హెచ్‌పీ సామర్థ్యం, 1.0లీటర్, 1.2లీటర్ ఇంజిన్ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లలో లభించడం మరో విశేషం. హ్యుందాయ్ సాంత్రోకి పోటీగా ఉన్న ఈ మోడల్‌పై రూ.30వేల తగ్గింపును ప్రకటించింది మారుతీ సుజుకి.
పైన పేర్కొన్న తగ్గింపు ధరలు ఒక్కో నగరంలో ఒక్కోలా లభ్యమవుతాయని తెలిపింది. అలాగే ఈ ఆఫర్ల జాబితాలో నగదు తగ్గింపు సహా.. ఎక్స్ఛేంజ్ బోనస్, కార్పొరేట్ డిస్కౌంట్లూ ఉన్నాయి.
ఇదీ చదవండి: ఫిబ్రవరిలో కార్ల విక్రయాలు 18% వృద్ధి