స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు నష్టాలతో ముగిశాయి. గురువారం సెషన్లో బీఎస్ఈ-సెన్సెక్స్ 173 పాయింట్లు కోల్పోయి.. 39,749 వద్దకు చేరింది. ఎన్ఎస్ఈ-నిఫ్టీ 59 పాయింట్ల నష్టంతో 11,670 వద్ద సెషన్‌ను ముగించింది.
అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రభావం, ఐరోపాలో కరోనా కేసులు మళ్లీ భారీగా పెరుగుతుండటం వంటి పరిణామాలు అంతర్జాతీయంగా ప్రతికూలంగా మారాయి. ఈ కారణంగా ఒకానొక దశలో భారీ నష్టాల్లోకి జారుకున్న సూచీలు.. రిలయన్స్ ఇండస్ట్రీస్, టీసీఎస్, హెచ్‌సీఎల్‌టెక్, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ బ్యాంక్ వంటి హెవీ వెయిట్ షేర్ల దన్నుతో మోస్తరు నష్టాలకు పరిమితమయ్యాయి.
ఇంట్రాడే సాగిందిలా
సెన్సెక్స్ 40,011 పాయింట్ల అత్యధిక స్థాయి, 39,524 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.
నిఫ్టీ 11,744 పాయింట్ల గరిష్ఠ స్థాయి;11,606 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.
లాభనష్టాల్లోనివి ఇవే..
ఏషియన్ పెయింట్స్, అల్ట్రాటెక్ సిమెంట్, కోటక్ మహీంద్రా బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్‌సీఎల్‌టెక్ షేర్లు లాభాల్లో ప్రధానంగా ఉన్నాయి.
ఎల్&టీ, టైటాన్, ఓఎన్జీసీ, యాక్సిస్ బ్యాంక్, హెచ్‌యూఎల్, ఎం&ఎం షేర్లు నష్టపోయాయి.
ఆసియా మార్కెట్లు
ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లలో షాంఘై మినహా నిక్కీ, కోస్పీ, హాంగ్‌సెంగ్ సూచీలు నష్టాలతో ముగిశాయి.
రూపాయి, ముడి చమురు
కరెన్సీ మార్కెట్లో రూపాయి 23 పైసలు తగ్గింది. దీనితో డాలర్‌తో పోలిస్తే మారకం విలువ 74.10 వద్దకు చేరింది.
ముడి చమురు ధరల సూచీ-బ్రెంట్ 0.87 శాతం తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ముడి చమురు ధర 38.78 డాలర్లుగా ఉంది.
ఇదీ చూడండి:కరోనాతో బంగారానికి డిమాండ్ డౌన్- కానీ...