దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమల్లో ఉన్నా.. ఎక్కువశాతం మంది కిరాణా సరకుల కోసమే బయటకు వచ్చారని ఓ సర్వేలో తేలింది. వినియోగదారులు కిరాణా సరకులను ఇంట్లో నిల్వ ఉంచుకోవడానికి ఆసక్తి కనబర్చలేదని 'డెలాయిట్ గ్లోబల్ స్టేట్ ఆఫ్ ది కన్స్యూమర్ ట్రాకర్' సర్వే వివరించింది.
గృహోపకరణాలు, స్థానిక వస్తువులపైనే..
గత ఆరువారాల్లో వినియోగదారుల ఖర్చులు పూర్తిగా మారిపోయాయని సర్వే స్పష్టం చేస్తోంది. సుమారు 1000 మందిపై నిర్వహించిన సర్వేలో.. 55 శాతం మంది కిరాణా సరకులు కొనడానికి ఆసక్తి చూపగా.. 52 శాతం మంది రోజువారీ గృహోపకరణాలపై దృష్టిసారించినట్లు తేలింది. 72 శాతం మంది స్థానికంగా లభించే వస్తువులనే కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపారు. మిగిలిన 64 శాతం మంది బ్రాండెడ్ వస్తువులపై శ్రద్ధ పెట్టారు.
ప్రజా రవాణా వినియోగాన్ని తగ్గించడంపై ఎక్కువ మంది దృష్టి సారించగా.. 70 శాతం మంది పూర్తిగా నివారించాలని కోరుకున్నారు. మొత్తంగా 79 శాతం మంది ప్రజలు.. తామే ఓ వాహనాన్ని కొనుగోలు చేయాలనే అభిప్రాయపడ్డారు.
లాక్డౌన్ సమయంలో ప్రజలు ఎలాంటి సవాళ్లను ఎదుర్కొంటున్నారో ఈ సర్వే ద్వారా వెల్లడైందని డెలాయిట్ ఇండియా కన్స్యూమర్ ఇండస్ట్రీ లీడర్ అనిల్ తల్రేజా చెప్పారు.
'వినియోగదారుల ఆందోళనలను ఈ సర్వే ప్రతిబింబిస్తోంది. వారి నిర్ణయాలపైనే మార్కెటింగ్ వ్యవస్థ ఆధారపడి ఉంటుంది. ఇవి మార్కెట్ వ్యూహాలను రూపొందించడానికి తోడ్పడుతుంది.'
- అనిల్ తల్రేజా, డెలాయిట్ ఇండియా - భాగస్వామి, కన్స్యూమర్ ఇండస్ట్రీ లీడర్
13 దేశాల్లో సర్వే..
సుమారు 13 దేశాల్లో నిర్వహించిన ఈ-మెయిల్ సర్వేలో 18ఏళ్లు పైబడిన వారు పాల్గొన్నారు. ఇందులో భారత్ సహా ఆస్ట్రేలియా, కెనడా, చైనా, ఫ్రాన్స్ దేశాలూ ఉన్నాయి. ఏప్రిల్ 19 నుంచి మే 16 వరకు ఈ సర్వేను నిర్వహించారు.
ఇదీ చదవండి: లాక్డౌన్ 5.0లో ఏం చెయొచ్చు? ఏం చెయ్యరాదు?