LIC IPO SEBI Approval: మదుపర్లు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఎల్‌ఐసీ ఐపీఓకు మార్కెట్ నియంత్రణా సంస్థ సెబీ ఆమోదం లభించిందని ఈ వ్యహారంతో సంబంధం ఉన్న ఓ ఉన్నతాధికారి తెలిపినట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. దరఖాస్తు చేసుకున్న 22 రోజుల్లోనే అనుమతి లభించడం విశేషం. సాధారణంగా ఏదైనా కంపెనీ ఐపీఓకి దరఖాస్తు చేసుకున్న తర్వాత కనీసం 30-40 రోజుల తర్వాతే సెబీ ఆమోదిస్తుంది. కానీ, ఎల్‌ఐసీ విషయంలో మాత్రం సెబీకి ఈ ప్రక్రియ చాలా వేగంగా పూర్తిచేసిందనే చెప్పాలి!
LIC IPO Date
ఒకసారి సెబీ అనుమతి లభించిన తర్వాత ఐపీఓకి వెళ్లడమే తరువాయి. అది ఎప్పడన్నది ప్రభుత్వం నిర్ణయించాల్సి ఉంది. పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాల్లో భాగంగా ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికే పబ్లిక్ ఇష్యూ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం భావించింది. కానీ, అది సాధ్యపడే సూచనలు లేవని స్వయంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల సంకేతాలు ఇచ్చారు. ఇతర పారిశ్రామిక ప్రముఖులు సైతం అదే అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఉక్రెయిన్-రష్యా ఉద్రిక్తతల నేపథ్యంలో స్టాక్ మార్కెట్‌లో ఇప్పుడు పరిస్థితులు ప్రతికూలంగా మారడమే అందుకు కారణం. మార్కెట్ పరిస్థితులు ఇప్పుడు పెట్టుబడికి అనువుగా లేవని నిపుణులు తెలిపారు. ఈ సమయంలో ఐపీఓకి రావడం వల్ల మదుపర్లు పెట్టుబడికి పెద్దగా ఆసక్తి చూపకపోవచ్చని అంచనావేస్తున్నారు.
LIC IPO Size
ఎల్‌ఐసీ పబ్లిక్ ఇష్యూ కోసం సెబీకి ప్రభుత్వం ముసాయిదా పత్రాలను ఫిబ్రవరి 13న దాఖలు చేసింది. ఎల్‌ఐసీలో 5 శాతం వాటాకు సమానమైన 31.6 కోట్లకు పైగా రూ.10 ముఖ విలువ కలిగిన ఈక్విటీ షేర్లను ప్రభుత్వం విక్రయించనుంది. రూ.63,000 కోట్ల వరకు ఖజానాకు చేరతాయని మర్చంట్ బ్యాంకర్ల అంచనా. తద్వారా ఇదే దేశీయంగా అతిపెద్ద ఇష్యూగా నిలవనుంది. ఇష్యూ పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌ఎస్) రూపంలో జరగనుంది. సంస్థలో 100 శాతం వాటా (632.49 కోట్ల షేర్లను) కలిగిన ప్రభుత్వం 5 శాతం వాటాను ఇలా విక్రయించబోతోంది. కొత్తగా షేర్లు ఏమీ జారీ చేయడం లేదు.
ఇదీ చూడండి: త్వరలోనే మరో మెగా ఐపీఓ.. రూ.6,000- 7,500 కోట్లు టార్గెట్!