LIC IPO Date: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్‌ఐసీ) పబ్లిక్ ఇష్యూ ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం ఆశించినట్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే లోపు జరగకపోవచ్చని, వచ్చే ఆర్థిక సంవత్సరంలోనే ఇది జరగొచ్చనే వాదన వినిపిస్తోంది. రష్యా- ఉక్రెయిన్‌ల మధ్య యుద్ధం ఫలితంగా, ప్రపంచ మార్కెట్లు తీవ్ర ఒడుదొడుకుల మధ్య కదలాడుతుండటం ఇందుకు నేపథ్యం. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఎల్‌ఐసీ ఐపీఓను నిర్వహించే సమయంపై పునరాలోచన చేయాల్సిన అవసరం ఉందని ఓ వార్తా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు.
'పూర్తిగా దేశీయ పరిణామాలను ఆధారంగా చేసుకునే మేం ఎల్‌ఐసీ ఐపీఓను నిర్ణయించాం. అంతర్జాతీయ పరిణామాలను పరిగణనలోకి తీసుకోవాల్సిన పరిస్థితి అనివార్యమైతే.. ఐపీఓ ఎప్పుడు నిర్వహించాలనే సమయంపై సమీక్ష జరపాల్సిన అవసరం ఉంద'ని ఆమె చెప్పారు. ఎల్‌ఐసీ నమోదు అంశంపై సమీక్ష జరిపేందుకు ఈవారంలోనే ఒక సమావేశాన్ని ప్రభుత్వం నిర్వహించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఎల్‌ఐసీ ఐపీఓను మార్చిలో పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఇందుకుగాను ఐపీఓ సంబంధిత ముసాయిదా పత్రాలను ఫిబ్రవరి 13న సెబీకి సమర్పించింది.
ఇదీ చూడండి : అది తెలిసిన క్షణాల్లోనే భారత్‌పే ఎండీ రాజీనామా!