LIC IPO Date: మదుపర్లలో తీవ్ర ఆసక్తి రేకెత్తిస్తున్న బీమా దిగ్గజం ఎల్‌ఐసీ ఐపీఓకు మార్చి మొదటి వారంలో సెబీ నుంచి అనుమతి లభించే అవకాశం ఉందని సమాచారం. ఇష్యూ పరిమాణం 8 బిలియన్ డాలర్లుగా (దాదాపు రూ.60 వేల కోట్లు) ఉండే అవకాశం ఉందని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న అధికారులు తెలిపినట్లు రాయిటర్స్ పేర్కొంది.
మార్చి 11 నుంచి యాంకర్ ఇన్వెస్టర్లకు ఐపీఓ ప్రారంభం కానున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. తర్వాత కొన్ని రోజుల్లోనే ఇతర మదుపర్లకూ పబ్లిక్ ఇష్యూ అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నాయి. అయితే, ఈ షెడ్యూల్‌లో మార్పులు జరిగే అవకాశం లేకపోలేదని అధికారిక వర్గాలు తెలిపాయి. సెబీ అనుమతి లభించిన తర్వాతే ఇష్యూ ధరను నిర్ణయించనున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామంపై స్పందించడానికి ఎల్‌ఐసీ నిరాకరించింది. కేంద్ర ఆర్థికశాఖ సైతం ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి ఎల్‌ఐసీ ఐపీఓ ప్రక్రియను పూర్తి చేయాలని నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో ప్రక్రియను వేగవంతం చేస్తోంది.
ఎల్‌ఐసీ పబ్లిక్ ఇష్యూ కోసం మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ప్రభుత్వం ముసాయిదా పత్రాలను ఆదివారం దాఖలు చేసింది. ఎల్‌ఐసీలో 5 శాతం వాటాకు సమానమైన 31.6 కోట్లకు పైగా రూ.10 ముఖ విలువ కలిగిన ఈక్విటీ షేర్లను ప్రభుత్వం విక్రయించనుంది. రూ.63,000 కోట్ల వరకు ఖజానాకు చేరతాయని మర్చంట్ బ్యాంకర్ల అంచనా. తద్వారా ఇదే దేశీయంగా అతిపెద్ద ఇష్యూగా నిలవనుంది. ఇష్యూ పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌ఎస్) రూపంలో జరగనుంది. సంస్థలో 100 శాతం వాటా (632.49 కోట్ల షేర్లను) కలిగిన ప్రభుత్వం 5 శాతం వాటాను ఇలా విక్రయించబోతోంది. కొత్తగా షేర్లు ఏమీ జారీ చేయడం లేదు.
ఇదీ చూడండి: స్టాక్ మార్కెట్లలో అదే తీరు.. వారాంతంలోనూ నష్టాలే