అవసరం ఏమిటన్నది పట్టించుకోకుండా.. చాలామంది ఆదాయపు పన్ను మినహాయింపు కోసం ఆరోగ్య బీమా పాలసీని ఎంచుకుంటున్న వారు ఇప్పటికీ ఎంతోమంది ఉంటున్నారు. ఉదాహరణకు.. ఒక వ్యక్తి తన కుటుంబం మొత్తానికి వర్తించేలా రూ.3 లక్షల పాలసీ తీసుకున్నారు. కానీ.. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇది సరిపోతుందా? దురదృష్టవశాత్తూ.. కరోనా బారిన పడి.. ఆసుపత్రిలో చేరితే.. చికిత్స ఖర్చు ఎంత అవుతుందో ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందుకే.. ఆరోగ్య బీమా పాలసీని ఎంత విలువకు ఎంచుకోవాలనే విషయాన్ని చూద్దాం..
వయసు ఆధారంగా.
వయసు పెరుగుతున్న కొద్ధీ. అనారోగ్యం బారిన పడే అవకాశాలు పెరుగుతాయి. చికిత్స ఖర్చులూ అధికంగానే ఉంటాయి. ఇది సర్వసాధారణ విషయమే. చిన్న వయసులో ఉన్నప్పుడు ఆరోగ్య బీమా ప్రీమియం ధరలు తక్కువగా ఉంటాయి. పాలసీని క్లెయిం చేసుకునే అవసరమూ అంతగా ఉండదు. కాబట్టి, నో క్లెయిమ్ బోనస్‌లాంటివి పాలసీ విలువలో జమ అవుతూ ఉంటాయి. 50 ఏళ్ల వయసు వారు ఆరోగ్య బీమా పాలసీ తీసుకోవాలనుకుంటే.. కనీసం రూ.10లక్షలకు తక్కువ కాకుండా చూసుకోవాలి.
ఒకవేళ.. అలా జరిగితే..
ఎప్పుడూ మంచి గురించే ఆలోచిస్తుంటాం.. కానీ.. అనుకోని సమస్య ఎదురైతే ఏం చేయాలన్నదీ ఆలోచించుకోవాలి. ఒకవేళ కుటుంబంలోని ఒక వ్యక్తి ఆసుపత్రిలో చేరితే ఎంత ఖర్చవుతుంది అనే విషయంలో అవగాహన ఉండాలి. దీనికోసం మీ దగ్గర్లో ఉన్న మంచి ఆసుపత్రిలో చికిత్స ధరలు ఎలా ఉన్నాయన్నది తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఆ తర్వాతే ఈ పాలసీ ఎంత ఉంటే బాగుంటుందనే విషయంలో స్పష్టత వస్తుంది.
చరిత్రను చూసుకోవాలి..
మీ కుటుంబంలోని వ్యక్తులకు తీవ్ర వ్యాధులకు సంబంధించిన చరిత్ర ఉంటే.. మీరూ ఆ విషయంలో కాస్త జాగ్రత్త తీసుకోక తప్పదు. అనుకోని పరిస్థితుల్లో అలాంటి తీవ్ర వ్యాధుల బారిన పడినప్పుడు ఎంత ఖర్చు అవుతుందన్నది చూసుకొని, బీమా మొత్తాన్ని నిర్ణయించుకోవాలి.మీ కుటుంబంలోని వ్యక్తులకు తీవ్ర వ్యాధులకు సంబంధించిన చరిత్ర ఉంటే.. మీరూ ఆ విషయంలో కాస్త జాగ్రత్త తీసుకోక తప్పదు. అనుకోని పరిస్థితుల్లో అలాంటి తీవ్ర వ్యాధుల బారిన పడినప్పుడు ఎంత ఖర్చు అవుతుందన్నది చూసుకొని, బీమా మొత్తాన్ని నిర్ణయించుకోవాలి.
కుటుంబ సభ్యులు..
కుటుంబానికి అంతటికీ వర్తించేలా ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీలను ఎంచుకోవాలనుకుంటే మొత్తం సభ్యుల ఆధారంగా పాలసీ మొత్తాన్ని నిర్ణయించుకోవాలి. ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీ కుటుంబంలోని వ్యక్తులందరికీ వర్తిస్తుంది కాబట్టి, అందరి వయసులు, ఆరోగ్య పరిస్థితి, భవిష్యత్ అవసరాల్లాంటివి చూసుకోవాలి. నలుగురిలో ఒకరు అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరినప్పుడు.. మొత్తం పాలసీ ఖర్చవకుండా ఉండాలి. మిగతా ముగ్గురికీ అవసరమైనప్పుడు పాలసీ కవరేజీ అందుబాటులో ఉండాలి.
సమీక్షిస్తూ ఉండాలి..
వ్యక్తిగతంగా రూ.5లక్షల పాలసీ ఉంటే.. ఇప్పుడు కొంత శ్రేయస్కరం. అయితే, ఆరోగ్య ద్రవ్యోల్బణం ఏటా 12-15 శాతం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో మీ ఆరోగ్య బీమా పాలసీ విలువను ప్రతి రెండేళ్లకోసారి సమీక్షించుకోవడం మంచిది. అప్పుడే.. ప్రస్తుత ఆరోగ్య ఖర్చులను తట్టుకునేలా మీ పాలసీ ఉందా లేదా అనేది తెలుస్తుంది.
మీరు తీసుకున్న పాలసీ కొన్ని చికిత్సలకు సరిపోకపోవచ్చు. ఉదాహరణకు గుండె వ్యాధులు, మూత్రపిండాల వైఫల్యం లాంటివి ఎంతో ఖరీదైనవి. మీ ప్రాథమిక పాలసీ ఇలాంటప్పుడు సరిపోకపోవచ్చు. కాబట్టి, మీ పాలసీకి అనుబంధంగా టాపప్ పాలసీని తీసుకోవాలి. క్రిటికల్ ఇల్‌నెస్ పాలసీలూ అవసరమే. ఇవి ఏదైనా తీవ్ర వ్యాధి బారినపడినప్పుడు ఒకేసారి పరిహారం చెల్లిస్తాయి. వ్యక్తిగత ప్రమాద బీమా పాలసీని ఎంచుకోవడమూ తప్పనిసరి. అనుకోకుండా ప్రమాదం బారినపడి వైకల్యం పొందినా.. మరణించినా ఈ పాలసీ ద్వారా పరిహారం అందుతుంది.
ఆర్థిక ప్రణాళికలో ఆరోగ్య బీమా పాలసీ ఎంతో కీలకం. అది సరైన మొత్తానికి తీసుకున్నప్పుడే అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది.
- తపన్ సింఘేల్, ఎండీ-సీఈఓ, బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్
ఇదీ చదవండి: ఈ బైక్కు అంత క్రేజేంటో?- క్షణాల్లో 'ఔట్ ఆఫ్ స్టాక్'