ఆర్థికంగా ప్రతి వ్యక్తికీ కొన్ని లక్ష్యాలుంటాయి. దాన్ని సాధించేందుకు ఒక్కొక్కరూ ఒక్కో విధంగా ప్రణాళికలు వేసుకుంటారు. పెట్టుబడులు పెడుతుంటారు. వారు ఎంపిక చేసుకున్న పెట్టుబడి పథకాల గురించి పూర్తి అవగాహన ఉండి, వాటి పనితీరును ఎప్పటికప్పుడు బేరీజు వేసుకునే వారే వాటి నుంచి లాభాలను ఆర్జించగలరు. అవసరం లేకపోయినా.. రుణాలు తీసుకోవడం, దానికి వడ్డీ చెల్లించడం, తక్కువ రాబడి వచ్చే చోట మదుపు చేయడం, క్రెడిట్ కార్డు బిల్లులను సకాలంలో చెల్లించకపోవడం, దానికి బదులుగా రుసుములు చెల్లించడం ఇలా.. కొన్నిసార్లు తెలిసీ తెలియక కష్టార్జితాన్ని నష్టపోతుంటారు. నిజానికి ఇవన్నీ సరిదిద్దుకునే అంశాలే. కావాల్సిందల్లా.. కాస్త ఓపిక అంతే..
పాలసీలు ఉంటే చాలా..
చాలామంది పన్ను ఆదా కోసమని, లేదా ఎవరో మొహమాట పెట్టారనీ పాలసీలు చేస్తుంటారు. అందుకోసం వేల రూపాయల ప్రీమియాన్ని చెల్లించేస్తుంటారు. ఒకటి రెండు ఏళ్ల తర్వాత ఆ ప్రీమియాన్ని చెల్లించలేక పాలసీని వదిలేస్తుంటారు. బీమా పాలసీ అంటే పెట్టుబడి అనుకుంటారు మరికొందరు. ఇవన్నీ మనం డబ్బు నష్టపోవడానికి కారణాలే. బీమా పాలసీ తీసుకునే ముందు మీకు తగిన పాలసీ ఏదో గుర్తించేందుకు ప్రయత్నించండి. తక్కువ ప్రీమియంతో సాధ్యమైనంత ఎక్కువ రక్షణ ఇచ్చే పాలసీలను ఎంచుకునేందుకు ప్రయత్నించండి. ఇలా మిగిలిన మొత్తాన్ని సరైన పథకంలో మదుపు చేసేలా చర్యలు చేపట్టండి. ఆర్థికంగా ఏదైనా నిర్ణయం తీసుకునేముందు సొంత అవగాహన పెంచుకోవాలి. లేదా నిపుణులైన సలహాదార్లను సంప్రదించాలి. అప్పుడే.. కష్టార్జితం కాసిన్ని కాసులు కురిపిస్తుంది.
రుణాల సంగతి..
అవసరం ఉండి అప్పు చేయడం వేరు.. అవసరం లేకపోయినా బ్యాంకు ఇస్తానంటోంది అని రుణం తీసుకోవడం వేరు.. చాలామందికి విలువ పెరిగే ఆస్తులపై అప్పులకన్నా.. తరుగు ఉండే ఆస్తులపైనే రుణాలుంటాయి. ముఖ్యంగా వ్యక్తిగత రుణాలు, క్రెడిట్ కార్డులపై రుణాలు ఈ కోవలోకే వస్తాయి. వీటికి చెల్లించే వడ్డీ అధికంగా ఉంటుంది. ఆర్థికంగా వృద్ధి చెందాలని భావించేవారు సాధ్యమైనంత వరకూ ఈ అప్పులకు దూరంగా ఉండటమే మేలు. గృహరుణం తీసుకున్న వారి నెలవారీ ఖర్చులో పెద్ద మొత్తం దీని వాయిదాకే వెళ్తుంది. ఒకసారి ఈ రుణం తీసుకుంటే.. దాదాపు 20-25 ఏళ్లపాటు దానికి అంకితం అవ్వాల్సిందే. అయితే, దీన్ని కూడా అప్పుడప్పుడూ పట్టించుకోవాలి. మీరు తీసుకున్నప్పుడు ఉన్న వడ్డీ రేటుకూ, ఇప్పటి లెక్కలకూ తేడా ఉండవచ్చు. తగ్గించుకునే వీలూ ఉంటుంది. కాబట్టి, కనీసం ఏడాదికోసారైనా మీ ఇంటి రుణం ఎంత వరకూ వచ్చింది.. అనేది చూసుకోండి. ఇక్కడ ఇంకో విషయం.. మీరు చెల్లిస్తున్న వాయిదాలన్నీ బ్యాంకుకు సక్రమంగా చేరుతున్నాయా లేదా అనేదీ నిర్ధారించుకోండి.
ద్రవ్యోల్బణాన్ని మించి..
పెట్టుబడుల విలువను, నికర రాబడి శాతాన్నీ తగ్గించే శక్తి ద్రవ్యోల్బణానికి ఉంది. ఈ రోజు రూ.100 పెట్టి కొన్న వస్తువు ధర రెండు మూడు నెలల తర్వాత 5శాతం వరకూ పెరుగుతుంది. సంప్రదాయ పెట్టుబడులతో ఈ ఖర్చులను తట్టుకోవడం కష్టమే. అందుకే, పెట్టుబడుల ద్వారా ద్రవ్యోల్బణాన్ని మించి రాబడి సాధించేలా ఉండాలి. ఈక్విటీలు, ఈక్విటీ ఆధారిత పథకాలు ఇందుకు తోడ్పడతాయి. అయితే, దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టినప్పుడే ఈక్విటీలు మంచి రాబడినిస్తాయని మర్చిపోకూడదు.
వైవిధ్యం ఉందా?
పెట్టుబడులకు నష్టం రాకూడదు.. ఇది మొదటి సూత్రం.. మొదటి సూత్రాన్ని మర్చిపోకూడదు.. ఇది రెండో సూత్రం.. మదుపు వ్యూహాలను పాటించేప్పుడు అంతిమంగా రాబడి ఎంత అనేదే ప్రధానం. మీరు ఏ పథకాల్లో మదుపు చేశారనే విషయమే దీన్ని నిర్ణయిస్తుంది. మీ వయసు, నష్టభయాన్ని భరించే సామర్థ్యం, లక్ష్యాలను అందుకోవడానికి ఉన్న సమయంలాంటివన్నీ మీ పెట్టుబడులను నిర్ణయించేవే. ఇదంతా ఒక రోజులో జరిగే పనికాదు. దీర్ఘకాలం కొనసాగాల్సి ఉంటుంది. అవసరాన్ని బట్టి, పెట్టుబడులు ఈక్విటీలు, డెట్, ఇతర సురక్షిత పథకాల్లో సమపాళ్లలో ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి.
కాలం వెనక్కి వెళ్లదు.. ఈ రోజు జరిగిన తప్పును సరిదిద్దుకోగలం కానీ.. దాని వల్ల జరిగిన నష్టాన్ని భర్తీ చేయడం ఎప్పటికీ సాధ్యం కాదు. ఆర్థిక విషయాల్లో నేడు తీసుకునే ఒక నిర్ణయం మీ భవిష్యత్తుపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంటుంది. అందుకే, ఆలస్యం చేయకండి. ఒకసారి మీకు సంబంధించిన అన్ని విషయాలనూ సమీక్షించుకునేందుకు కాస్త సమయం కేటాయించండి.
లక్ష్యం సాధించాకే..
పెట్టుబడి పెట్టడానికి పథకాలను ఎంపిక చేసుకోవడం ఎంత ముఖ్యమో.. దానిలో నిర్ణీత కాలం పాటు కొనసాగడమూ అంతే ప్రధానం. కొన్నిసార్లు భావోద్వేగాలు మన నిర్ణయ సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తాయి. దీంతో ఎక్కువలో కొనడం, తక్కువలో అమ్మేయడంలాంటి నిర్ణయాలు తీసుకుంటారు. పెట్టుబడులు ఎలా పెట్టాలి? ఏ లక్ష్యం కోసం మదుపు చేస్తున్నాం? అనే విషయంలో స్పష్టత లేనప్పుడు ఇలాంటి పొరపాట్లు జరుగుతుంటాయి. మదుపు చేసేప్పుడు ఒక పూర్తి ప్రణాళికను రూపొందించుకోవాలి. దీర్ఘకాలిక దృష్టితో పెట్టుబడులను కొనసాగించాలి. కొనడం వెంటనే అమ్మడంలాంటి వాటి వల్ల మన సొమ్ము చాలా సందర్భాల్లో హరించుకుపోతుంది. ముఖ్యంగా నేరుగా షేర్లలో మదుపు చేసే వారు ఈ విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి.
ఇదీ చదవండి: విమాన ప్రయాణం మరింత భారం