టెలికాం రంగంలో రిలయన్స్ జియో దూసుకుపోతోంది. సేవలు ప్రారంభించిన రెండున్నర సంవత్సరాలలో జియో వినియోగదారుల సంఖ్య 30 కోట్లు దాటింది. ఈ ఏడాది మార్చి 2నే ఈ మైలురాయిని సాధించినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై జియో అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.
తమ నెట్వర్క్కు 30 కోట్ల మంది వినియోగదారులు ఉన్నట్లు జియో ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ ప్రకటనల్లో ఇస్తోంది. 30 కోట్ల వినియోగదారులను సాధించటానికి ఎయిర్టెల్కు 19 సంవత్సరాలు పట్టింది.
ప్రపంచంలోనే 170 రోజుల్లో 10 కోట్ల వినియోగదారులను పొందిన మొదటి సంస్థగా జియోకు రికార్డు ఉంది.
రెండో స్థానంపై అస్పష్టత...
డిసెంబర్ త్రైమాసిక ఆదాయ నివేదికలో తమకు 28.4 కోట్ల వినియోగదారులు ఉన్నట్లు భారతీ ఎయిర్టెల్ ప్రకటించింది. అయితే సెబీకి సమర్పించిన నివేదికలో మాత్రం డిసెంబర్ చివరి వరకు 34.02 కోట్ల వినియోగదారులు, జనవరి చివరి నాటికి 34.03 కోట్ల వినియోగదారులు ఉన్నట్లు తెలిపింది.
ప్రస్తుతం ఐడియా-వొడాఫోన్ 40 కోట్ల వినియోగదారులతో దేశంలో అతిపెద్ద నెట్వర్క్గా ఉంది.