ప్రతిష్ఠాత్మక టైమ్ మేగజైన్ ప్రకటించిన వంద అత్యంత ప్రభావవంతమైన సంస్థల జాబితాలో.. రెండు భారతీయ సంస్థలకు స్థానం దక్కింది. రిలయన్స్ జియో ప్లాట్‌ఫామ్స్, ఈ లెర్నింగ్ అంకుర సంస్థ బైజూస్.. ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాయి. ఆరోగ్య సంరక్షణ, వినోదం, రవాణా, సాంకేతికత సహా పలు రంగాల నుంచి నామినేషన్లు ఆహ్వానించిన టైమ్ ఈ సంస్థలను ఎంపిక చేసింది. సమాజంపై ప్రభావం, ఆవిష్కరణ, నాయకత్వం, ఆశయం, విజయం లాంటి కీలకమైన అంశాలను మూల్యాంకనం చేసి ఈ జాబితాను ప్రకటించింది.
కొన్నేళ్లుగా ప్రపంచంలోనే అతి తక్కువ రేట్లకు ఇంటర్నెట్ సేవలను జియో అందిస్తోందని కొనియాడిన టైమ్.. కరోనా వ్యాప్తి సమయంలో బైజూస్ అద్భుతాలు సృష్టించిందని తెలిపింది. ఈ జాబితాలో జూమ్, అడిడాస్, టిక్‌టాక్, ఐకియా, మోడెర్నా, నెట్‌ఫ్లిక్స్ వంటి సంస్థలకు కూడా చోటు దక్కింది. టైమ్ మేగజైన్ మొట్టమొదటి సారిగా ప్రకటించిన ప్రభావవంతమైన సంస్థల జాబితాలో భారత సంస్థలకు చోటు దక్కడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
ఇదీ చూడండి: రుణ దరఖాస్తు తరచూ తిరస్కరణకు గురవుతోందా?
ఇదీ చూడండి: '2021-22లో భారత వృద్ధి రేటు 11 శాతం!'