బంగారం భద్రంగా ఉండాలంటే బ్యాంకు లాకర్లలో పెట్టుకోవాలన్నది సాధారణ అభిప్రాయం. కానీ ధరించినప్పుడు, లాకర్ లేని సమయంలో పరిస్థితి ఏంటి? విలువైన ఆభరణాలను ఎలా రక్షించుకోవాలి? అంటే సమాధానం ఆభరణాల బీమా.
ప్రజలు తమ ఆభరణాలకు బీమా చేయించుకోవచ్చు. బంగారు ఆభరణాల కోసం ప్రత్యేకంగా పాలసీలు ఉన్నాయి. ఏదైనా వేడుకలో బంగారు ఆభరణాలు పోగొట్టుకున్నా, చైన్ దొంగతనం జరిగినా.. వాటి విలువలో ప్రధాన భాగాన్ని బీమా ద్వారా పొందవచ్చు.
ఈ పాలసీల్లో ఉన్న కీలక ఫీచర్లు, ఎలా కొనుగోలు చేయాలన్న విషయాలను తెలుసుకుందాం.
ఎవరు పాలసీలు అందిస్తారు?
రిలయన్స్ హోమ్ ఇన్సూరెన్స్, హెచ్డీఎఫ్సీ ఎర్గో తదితర ప్రధాన బీమా సంస్థలు ఆభరణాలకు సంబంధించి బీమా పాలసీలు అందిస్తున్నాయి. ఇటీవల ముత్తూట్ ఫైనాన్స్ కూడా బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్ భాగస్వామ్యంతో బంగారు ఆభరణాల బీమా పాలసీని ప్రకటించింది.
గృహ బీమాలో ఆభరణాలకు కవరేజీ ఉంటుందా?
సమగ్ర గృహ బీమా పాలసీల్లో ఆభరణాలు, బంగారు వస్తువులకు కవరేజీ ఉంటుంది. మౌలికమైన గృహ బీమా పథకాలు ఆభరణాలు లాంటి వాటికి బీమా అందించకపోవచ్చు. ఇవి ఇంటికి మాత్రమే బీమా కల్పిస్తాయి.
ఎక్కువ నగలు ఉన్నా, లేక వాటితో ఎక్కువగా ప్రయాణాలు చేస్తున్నా… ఆభరణాలకు సంబంధించి బీమా తీసుకోవటం ఉత్తమం.
ఎలాంటి వస్తువులకు కవరేజీ ఉంటుంది?
రత్నాలు(జెమ్ స్టోన్స్), వెండి, బంగారం, ప్లాటినం, ఇతర విలువైన లోహలతో కూడిన ఆభరణాలకు మాత్రమే జువెలరీ బీమా కవరేజీ ఇస్తుంది. క్రిస్టల్ వేర్, విలువైన చేతి గడియారాలు, వెండి వస్తువులు, ఆభరణాల రూపంలో లేని బంగారం(కాయిన్స్ తదితరాల)కు కూడా కొన్ని పాలసీలు బీమా అందిస్తాయి.
ఎలాంటి ప్రమాదాల్లో కవరేజీ లభిస్తుంది?
ప్రకృతి వైపరీత్యాలు, అగ్ని వల్ల ఆభరణాలకు జరిగే డ్యామేజీ, దోపిడీ, దొంగతనం, రవాణాలో ఉన్నప్పుడు కోల్పోయినట్లైతే ఆభరణాల బీమా కవరేజీ ఇస్తుంది.
వేటికి వర్తించదు?
సాధారణంగా ధరించినప్పుడు జరిగే డ్యామేజీ.. శుభ్రం, సర్వీసింగ్, రిపేరింగ్ చేసే సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లైతే, ఉద్దేశపూర్వకంగా జరిగిన నష్టం లాంటి వాటికి కవరేజీ ఉండదు. అదే విధంగా బీమా ఉన్న ఆభరణాలు విక్రయించి, నూతన ఆభరణాలు తీసుకున్నట్లయితే… బీమా ఆటోమేటిక్‌గా నూతన నగలకు వర్తించదు.
ఈఎమ్ఐలు చెల్లించుకపోవటం, చట్టపరమైన విషయాల వల్ల మీ ఆభరణాల జప్తు జరిగినట్లైతే బీమా సంస్థ కవరేజీ ఇవ్వదు.
ప్రీమియం ఏ విధంగా ఉంటుంది?
బీమా మొత్తం, గడువు, బీమా వర్తించే ఆభరణాల సంఖ్య, కవరేజీ సందర్భాలు తదితర అంశాలపై ప్రీమియం ఆధారపడి ఉంటుంది. సాధారణంగా ప్రీమియం ఆభరణం విలువలో ఒక శాతం ఉంటుంది.
ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలి?
బీమా తీసుకోవాలనుకునే వారు ఆభరణానికి సంబంధించిన మార్కెట్ విలువను మొదటగా తెలుసుకోవాలి. ఇందుకోసం ఆభరణాల దుకాణం నుంచి వాల్యుయేషన్ సర్టిఫికేట్ పొందవచ్చు. దీనితో పాటు ఆధార్, పాన్ తదితర వివరాలను బీమా సంస్థలు అడుగుతుంటాయి.
బీమా కొనుగోలు చేసే సమయంలో ఎలాంటి అంశాలను దృష్టిలో ఉంచుకోవాలి?
అందుబాటులో ఉన్న ఆభరణాల బీమా పాలసీలను పోల్చి చూసుకోవాలి. పాలసీలకు సంబంధించి నిబంధనలు, షరతులను జాగ్రత్తగా పరిశీలించాలి. తక్కువ ప్రీమియం, తక్కువ మినహాయింపులు ఉండే పాలసీని ఎంచుకోవటం ఉత్తమం.
క్లెయిమ్ సెటిల్ మెంట్ నిష్పత్తిని కూడా చూసుకోవాలి. డిస్కౌంట్లు ఏమైనా అందిస్తున్నారా? అన్నది చూసుకోవచ్చు.
సాధారణంగా సంభవించే ప్రమాదాలతో పాటు అన్ని రకాల రిస్క్‌లకు కవరేజీ ఇచ్చే పాలసీని ఎంచుకోవచ్చు. 100 శాతం కవరేజీ తీసుకోవటం వల్ల ఆభరణాల పూర్తి విలువను పొందవచ్చు. సాధారణ బీమాలు కొంత విలువకు మాత్రమే కవరేజీ ఇస్తాయి.
క్లెయిమ్ ప్రక్రియ ఎలా ఉంటుంది?
క్లెయిమ్ చేసుకునేందుకు బీమా సంస్థను ఫోన్, ఈ-మెయిల్, ఫ్యాక్స్ తదితర పద్ధతుల్లో సంప్రదించాలి. డ్యామేజీ లేదా నష్టం గురించి వారికి తెలపాలి. తప్పనిసరి కాకపోయినప్పటికీ జరిగిన నష్టానికి సంబంధించి ఆధారం కోసం ఫొటోలు, వీడియోలు తీసుకోవటం మంచిది. పాలసీ పేపర్లు, గుర్తింపు ధ్రువీకరణ పత్రాలు, ఎఫ్ఐఆర్ కాపీ, రెంట్ అగ్రిమెంట్, ఫైర్ బ్రిగేడ్, ఇన్ వాయిస్ తదితరాలను సిద్ధం చేసుకోవాలి. బీమా సంస్థ సర్వేయర్ ద్వారా డ్యామేజీని అంచనా వేయిస్తుంది. క్లెయిమ్ సరైనదే అయితే బీమా మొత్తం అందుతుంది.