కరోనా భయందోళనల నడుమ ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమల్లో ఉంది. ఈ కారణంగా భారత ఐటీ పరిశ్రమలో ఈ ఏడాది కొత్త నియామకాలు ఉండకపోవచ్చని ఐటీ రంగ నిపుణుడు పద్మశ్రీ టీవీ మోహన్దాన్ పాయ్ అభిప్రాయపడ్డారు.
కొవిడ్ వ్యాప్తిని అరికట్టేందుకు విధించిన లాక్‌డౌన్ కారణంగా వచ్చే రెండు త్రైమాసికాల్లో పరిశ్రమలు మందకొడిగా సాగుతాయని అంచనా వేశారు పాయ్. ఈ ప్రభావం ఉద్యోగులపైనా ఉండొచ్చని ఆయన హెచ్చరించారు. ప్రస్తుత ఉద్యోగులకు పదోన్నతులు దక్కినా.. వారి జీతభత్యాల్లో పెరుగుదల కనిపించకపోవచ్చని చెప్పారు.
లాక్‌డౌన్ తర్వాతా ఇంటినుంచే పని..
భారత్ ఐటీ సంస్థల్లో పని చేస్తూ.. రూ. 75,000 నుంచి రూ.1,00,000కు పైగా జీతం అందుకునే ఉద్యోగుల వేతనాల్లో ఈ ఏడాది సుమారు 20 నుంచి 25 శాతం వరకు కోతపడొచ్చని పాయ్ భావించారు. లాక్‌డౌన్ కారణంగా కార్యాలయాలు మూసివేయగా.. భారత్‌లోని ఐటీ కంపెనీలు ఎవరూ ఊహించని రీతిలో తమ ఉద్యోగుల్లో 90 శాతం మందికి ఇంటి నుంచి పనిచేసే అవకాశం కల్పించాయని కొనియాడారు. లాక్‌డౌన్ ఎత్తివేత తరవాత కూడా కొన్ని కంపెనీలు 20 నుంచి 25 శాతం మంది ఉద్యోగులను ఇంటి నుంచే పని చేయించుకునే అవకాశముందని మోహన్‌దాస్ పాయ్ పేర్కొన్నారు.
ఇదీ చదవండి: కరోనా దెబ్బకు భారీగా తగ్గిన గూగుల్, ఫేస్బుక్ ఆదాయం