ఇంటర్నెట్‌లో కరోనా వైరస్ (కొవిడ్-19)పై నకిలీ వార్తలను వెంటనే తొలగించాలని సామాజిక మాధ్యమ సంస్థలకు కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ సూచించింది. ప్రజల్లో భయాందోళనలు కలిగించేవి, సామాజిక ప్రశాంతకు భంగం కలిగించే తప్పుడు వార్తలను ప్రచారం చేయవద్దని తమ వినియోగదారులకు తెలియజేయాలని.. సోషల్ మీడియా సంస్థలకు సలహా నోట్‌ను పంపించింది.
'తమ సామాజిక వేదికలపై పోస్ట్ చేసిన తప్పుడు వార్తల కంటెంట్‌ను తొలగించాలని మధ్యవర్తులకు విజ్ఞప్తి చేస్తున్నాం. నకిలీ వార్తలను నిలిపివేయాలి' అని సైబర్ చట్టాలు, ఇ-సెక్యూరిటీ గ్రూప్ కో-ఆర్డినేటర్ రాకేశ్ మహేశ్వరి పేర్కొన్నారు.
''సోషల్ మీడియాలో కరోనా వైరస్‌కు సంబంధించిన నకిలీ డేటాను ప్రచారం చేయడం వల్ల ప్రజల్లో భయాందోళనలు కలుగుతాయి. తప్పుడు సమాచారాన్ని పోస్ట్ చేయవద్దని తమ మాధ్యమాల వేదికలపై అందరికీ అవగాహన కలిపించాలి" అని రాకేశ్ మహేశ్వరి తెలిపారు. కరోనా వైరస్‌కు సంబంధించిన నిజమైన సమాచారాన్ని మాత్రమే సాధ్యమైనంతవరకు ప్రచారం చేయాలన్నారు.
ఇదీ చూడండి: కరోనా లక్షణాలు లేని వారి నుంచీ వైరస్ వ్యాప్తి!