ETV Bharat / business

ఎల్​ఐసీ వాటాల విక్రయం సరైనదేనా? - ద్రవ్యలోటు పూడ్చుకునేందుకే ఎల్​ఐసీ వాటాల విక్రయమా

భారత జీవిత బీమా సంస్థ (ఎల్​ఐసీ) వాటాలను విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం ద్రవ్యలోటు పూడ్చుకునేందుకే ఈ చర్యకు పూనుకుంది. అయితే మంచి లాభాలతో కొనసాగుతున్న బంగారు బాతు లాంటి ఈ సంస్థలో వాటాల విక్రయం సరైన నిర్ణయం కాదని గణాంకాలు చెబుతున్నాయి.

Is the sale of L IC shares fair?
ఎల్​ఐసీ వాటాల విక్రయం సరైనాదేనా?
author img

By

Published : Mar 14, 2020, 7:24 AM IST

Updated : Mar 14, 2020, 8:07 AM IST

భారత జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసీ)లో వాటాలను విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ఇటీవలి బడ్జెట్‌ ప్రసంగంలో తెలిపారు. విస్తృత జన భాగస్వామ్యం ఉన్న సంస్థ ఎల్‌ఐసీ. ఆర్థిక శక్తి అపారం. అందువల్లే ప్రభుత్వ పెట్టుబడుల ఉపసంహరణ నిర్ణయంపై తీవ్ర చర్చలు సాగుతున్నాయి. వివాదాలు రేగుతున్నాయి. వాస్తవానికి ఇదేమీ కొత్త ప్రతిపాదన కాదు. ప్రధానిగా పీవీ నరసింహారావు హయాములో ప్రభుత్వం నియమించిన మల్హోత్రా కమిటీ సైతం ఎల్‌ఐసీలో మూలధనాన్ని పెంచి, 50 శాతం మేర వాటాలు విక్రయించాలని సిఫార్సు చేసింది. తరవాత వాజ్‌పేయీ నాయకత్వంలోని తొలి ఎన్డీయే ప్రభుత్వం ఎల్‌ఐసీ పని విధానంలో మార్పులు, పునర్వ్యవస్థీకరణకు సిఫార్సులు చేయాల్సిందిగా డెలాయిట్‌ కన్సల్టెన్సీ సంస్థను కోరింది. ఎల్‌ఐసీని ఓ కార్పొరేట్‌ సంస్థగా తీర్చిదిద్ది, గణనీయమైన భాగాన్ని విక్రయించాలని డెలాయిట్‌ తన నివేదికలో సూచించింది. అయితే ఎల్‌ఐసీతో సామాన్య భారతీయుడికి ఉన్న సంబంధం వల్ల వాటాల విక్రయానికి ప్రభుత్వాలు సాహసించలేదు. 2016లో నాటి ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ కూడా ఇదే రకమైన ప్రతిపాదన చేశారు.

ద్రవ్యలోటు పూడ్చుకునేందుకే!

పెట్టుబడుల ఉపసంహరణవైపు కేంద్ర ప్రభుత్వం మొగ్గుచూపడానికి ఆర్థిక మందగమనమే కారణం. ఆర్థిక మాంద్యం వల్ల కేంద్ర ప్రభుత్వ ఆదాయంలో భారీగా కోత పడింది. పన్నుల ద్వారా వచ్చే ఆదాయంలో కనీసం మూడు లక్షల కోట్ల రూపాయల వరకు తగ్గవచ్చని అంచనా. గత బడ్జెట్లో ప్రభుత్వరంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా లక్షా అయిదు వేల కోట్ల రూపాయలు సమీకరించాలని కేంద్రం లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. కానీ, తాజా బడ్జెట్‌ గణాంకాల ప్రకారం 2019 డిసెంబరు 31నాటికి కేవలం రూ.18వేల కోట్లను మాత్రమే సమీకరించగలిగింది. ఈ ఆర్థిక సంవత్సరాంతానికి రూ.65 వేల కోట్లు సమీకరిస్తామని 2020-21 బడ్జెట్‌ ప్రసంగంలో ఆర్థికమంత్రి తెలిపారు. ఈ లక్ష్యసాధన కూడా అంత సులభమేమీ కాదు. పైగా వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వరంగ సంస్థల పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా సమీకరించాల్సిన మొత్తం నిధుల లక్ష్యం రెండు లక్షల పది వేల కోట్ల రూపాయలు. ఇందులో రూ.90వేల కోట్లు ద్రవ్య రంగంలో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా సాధించాలని కేంద్రం నిర్దేశించుకుంది. అయితే ఐడీబీఐ నష్టాల్లో ఉన్నందువల్ల అనుకున్న మేరకు ఈ సంస్థలో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా నిధుల సేకరణ సాధ్యం కాకపోవచ్చు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ దృష్టి భారీ ఆర్థిక శక్తిగల జీవిత బీమా సంస్థపై పడింది. జీవిత బీమా సంస్థలో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా వచ్చే నిధుల్ని కేవలం ద్రవ్యలోటు పూడ్చటానికే వినియోగిస్తారు. అంటే ప్రభుత్వ రోజువారీ ఖర్చుల కోసం మంచి ఆదాయ వనరును కోల్పోవడం ఏ రకంగా సహేతుకం అవుతుందన్నది విమర్శకుల వాదన.

పాలసీదారులూ యజమానులే

ఎల్‌ఐసీ తనకున్న మిగులు నిధుల్లో అయిదు శాతం కేంద్ర ప్రభుత్వానికి డివిడెండ్‌ రూపంలో చెల్లిస్తుంది. మిగతా 95 శాతం పాలసీదారులకు బోనస్‌ రూపంలో చెల్లిస్తోంది. జీవిత బీమా చట్టంలో ఉన్న నిబంధనే ఇది. అందువల్ల ఈ సంస్థను కేంద్ర ప్రభుత్వం, పాలసీదారుల ఉమ్మడి ఆస్తిగా చూడాలి. కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా వాటాలను విక్రయించడం చట్టరీత్యా, నైతికంగా సాధ్యమయ్యే పని కాదనే వాదనా ఉంది. 2018-19 బీమా నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్‌డీఐ) నివేదిక ప్రకారం ఎల్‌ఐసీ నిర్వహణ ఖర్చులు 3.19 శాతం తగ్గాయి. కానీ, ప్రైవేటు బీమా సంస్థల నిర్వహణ ఖర్చులు ఇదే కాలంలో 17.5 శాతం పెరిగాయి. ఎల్‌ఐసీలో మొత్తం వ్యక్తిగత పాలసీదారుల సంఖ్య 29 కోట్లు, గ్రూప్‌ పాలసీలు తీసుకున్నవారు మరో 11 కోట్ల దాకా ఉన్నారు. ఎల్‌ఐసీ తిరస్కరించిన చెల్లింపులు కేవలం 0.43 శాతమేనని నివేదిక వెల్లడించింది. ప్రైవేటు బీమా కంపెనీల్లో అది 2.83 శాతంగా ఉంది. ఎల్‌ఐసీలో మొండి బాకీలు కేవలం ఒక్క శాతమే ఉన్నాయి. సంస్థకు ఉన్న మొత్తం ఆస్తుల్లో ఇది 0.80 శాతం మాత్రమే. సంస్థ మొత్తం ఆస్తుల విలువ రూ.31 లక్షల కోట్లు. లైఫ్‌ ఫండ్‌ రూ.28.28 లక్షల కోట్లు. అంటే ఇప్పటికిప్పుడు పాలసీదారులందరూ వచ్చి తక్షణం డబ్బు చెల్లించాలని అడిగితే ఆ మొత్తం చెల్లించిన తరవాతా సంస్థ వద్ద మూడు లక్షల కోట్ల రూపాయల మేర మిగులు నిధులు ఉంటాయి.

ప్రభుత్వ వాదనలివీ...

జీవిత బీమా సంస్థలో వాటాల విక్రయం వల్ల ఒనగూడే ప్రయోజనాలను బడ్జెట్‌ ప్రసంగంలో ఆర్థిక మంత్రి వివరించారు. స్టాక్‌ మార్కెట్‌లో వాటా విక్రయంవల్ల సంస్థ నిర్వహణలో పారదర్శకత వస్తుందన్నది మొదటి వాదన. దీన్ని సాధించడానికి వాటాల విక్రయం అవసరం లేదు. ఇక స్టాక్‌ మార్కెట్‌కు వెళ్ళడం వల్ల ఎల్‌ఐసీ మార్కెట్‌ నుంచి పెట్టుబడుల్ని సమీకరించగలదన్నది మరో కీలక వాదన. దేశ ఆర్థిక వ్యవస్థలో ఇప్పటికే ఎల్‌ఐసీ గణనీయమైన స్థాయిలో పెట్టుబడులు పెడుతోంది. సుమారు రూ.31 లక్షల కోట్ల ఆస్తులు కలిగి, ఏటా నాలుగు లక్షల కోట్ల రూపాయల మిగులు నిధులు పెట్టుబడి పెట్టగల సంస్థకు మార్కెట్‌ నుంచి పెట్టుబడులు సమీకరించాల్సిన అవసరం ఏమిటి? వాటాల విక్రయం వల్ల ఎల్‌ఐసీలో ‘రిటైల్‌’గా పెట్టుబడి పెట్టే సామాన్యులు కూడా భాగస్వాములు కావచ్చన్నది మరో వాదన. కానీ, భారతీయ స్టాక్‌ మార్కెట్‌లో రిటైల్‌ పెట్టుబడిదారులు కేవలం మూడు శాతమే. చురుగ్గా పాల్గొనేవారు కేవలం ఒక్క శాతం. అలాంటప్పడు ఎల్‌ఐసీలో వాటాల విక్రయం వల్ల లాభపడేది దేశ, విదేశీ పెట్టుబడిదారులే అన్నది దాచేస్తే దాగని నిజం. 2008లో ప్రపంచ ద్రవ్య సంక్షోభం వచ్చినప్పుడు దెబ్బతిన్నవాటిలో ప్రధానమైనవి బీమా సంస్థలే. బీమా అంటే కష్టకాలంలో పాలసీదారునకు డబ్బు అందించే ప్రక్రియ. అందువల్ల జీవిత బీమా రంగంలో ఆర్థిక శక్తి చాలా కీలకం. ఈ విషయంలో ఎల్‌ఐసీ తిరుగులేని స్థితిలో ఉంది. ప్రజల పొదుపు మొత్తాలకు భద్రత, ప్రజల బీమాకు విశ్వసనీయత, ప్రజల సొమ్ముతో ప్రజాభివృద్ధికి సహకరించడం, పన్నులు డివిడెండ్‌ రూపంలో ప్రభుత్వాలకు భారీగా నిధులు సమకూర్చడం తదితర విశిష్ట కర్తవ్యాలను నిర్వహిస్తున్న ఎల్‌ఐసీలో ప్రభుత్వ వాటాల విక్రయం తాత్కాలికంగా ప్రభుత్వానికి నిధులు సమకూర్చవచ్చేమోగాని, దీర్ఘకాలంలో అటు ప్రజలకు, ఇటు ప్రభుత్వానికి ఈ నిర్ణయం ఎంతమాత్రం లాభదాయకం కాదు!

బంగారు బాతు

Is the sale of L IC shares fair?
బంగారు బాతు ఎల్​ఐసీ

జీవిత బీమా సంస్థ ఏటా రూ.10వేల కోట్లకు పైగా ఆదాయ పన్ను, వస్తుసేవల పన్ను తదితరాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెల్లిస్తోంది. ప్రభుత్వరంగ సంస్థ కావడం వల్ల పన్నుల ఎగవేతకూ ఆస్కారం లేదు. దీనికితోడు 2018-19లో జీవిత బీమా సంస్థ కేంద్ర ప్రభుత్వానికి చెల్లించిన డివిడెండ్‌ మొత్తం రూ.2,611 కోట్లు. ఇప్పటివరకు చెల్లించిన మొత్తం డివిడెండ్‌ రూ.26వేల కోట్లకు పైగానే ఉంటుంది. కేంద్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయంపోగా, బడ్జెట్‌కు సమీకరించే నిధుల్లో సుమారు 25శాతం ఎల్‌ఐసీయే సమకూరుస్తోంది. ఇంత భారీ మొత్తాన్ని ఖజానాకు జమ చేస్తున్న ఎల్‌ఐసీలో కేంద్రం 1956 నుంచి పెట్టిన పెట్టుబడి కేవలం రూ.100 కోట్లు. పాలసీదారుల విశ్వాసమే పెట్టుబడిగా ఎల్‌ఐసీ ప్రభుత్వాలకు భారీగా చెల్లింపులు చేయగలిగింది. ఎల్‌ఐసీ పాలసీలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే హామీ ప్రజల్లో విశ్వాసానికి ప్రధాన కారణం. ఈ సంస్థ ఏనాడూ ఈ హామీని ఉపయోగించాల్సిన అవసరం రాలేదు. ఒకవేళ పాలసీదారులకు ఎల్‌ఐసీ డబ్బులు చెల్లించే పరిస్థితిలో లేకుంటే కేంద్ర ప్రభుత్వం ముందుకొస్తున్నదే ఈ హామీ సారాంశం. ఇది కాగితంపైనే ఉండిపోయింది. 2019 మార్చి 31 నాటికి ఎల్‌ఐసీ పెట్టిన మొత్తం పెట్టుబడుల విలువ రూ.29.84 లక్షల కోట్లు. ఇందులో 82 శాతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీల్లో లేదా ప్రభుత్వ ఆమోదం గలవాటిలో పెట్టినవే. అందువల్ల ఎల్‌ఐసీ పెట్టిన పెట్టుబడులకు ఎలాంటి ఢోకా లేదు. దేశంలోనే నాలుగో అతిపెద్ద ప్రైవేటు బ్యాంక్‌ అయిన ఎస్‌ బ్యాంక్‌ నేడు సంక్షోభంలోకి జారుకోవడానికి కారణం ప్రైవేటు రుణగ్రహీతలు తీసుకున్న అప్పులు మొండిబాకీలుగా మారడమే. అత్యధిక పెట్టుబడులు ప్రభుత్వాలసెక్యూరిటీల్లోనే ఉండటం వల్ల అలాంటి దుస్థితి ఎల్‌ఐసీకి పట్టే అవకాశమే లేదు. ఏటా ఎల్‌ఐసీ వద్ద పెట్టుబడులు పెట్టేందుకు ఉండే మిగులు నిధుల విలువ మూడున్నర నుంచి నాలుగున్నర లక్షల కోట్ల వరకు ఉంటుంది. ఏ ప్రైవేటు బీమా సంస్థ అయినా తన వద్ద ఉన్న నిధుల్ని ఇంత భారీగా ప్రభుత్వం వద్దనే పెట్టుబడులుగా పెట్టదు. అంటే ప్రజల పొదుపు మొత్తాలకు భద్రత ఇవ్వడమే కాకుండా, వాటిని వారి అభివృద్ధికే వినియోగించడం ఎల్‌ఐసీ ప్రత్యేకత. ఏ ప్రైవేటు బీమా సంస్థ కూడా ఈ విషయంలో ప్రభుత్వరంగ బీమా సంస్థతో తులతూగడం సాధ్యమే కాదు. ఇక ఎల్‌ఐసీలో పెట్టుబడుల ఉపసంహరణకు ప్రభుత్వం చెబుతున్న ప్రధాన కారణం- వాటాల విక్రయంవల్ల సంస్థ పనితీరు మెరుగుపడుతుందన్నది. గణాంకాలను పరిశీలిస్తే ఈ వాదనలోని డొల్లతనం తేటతెల్లమవుతుంది. మూడు దశాబ్దాల క్రితం దేశంలోని బీమా రంగంలో సరళీకరణ ప్రక్రియ మొదలైంది. ప్రైవేటు బీమా కంపెనీల పోటీని తట్టుకొని దేశీయ బీమా రంగంలో ఎల్‌ఐసీ ఇప్పటికీ 73 శాతం వాటాను కొనసాగిస్తోంది. ఇలాంటి ప్రయోగం బహుశా ప్రపంచంలో మరెక్కడా లేదు.

ప్రొఫెసర్ కె.నాగేశ్వరరావు,

(రచయిత - ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జర్నలిజం ఆచార్యులు, శాసన మండలి మాజీ సభ్యులు)

ఇదీ చూడండి: మైక్రోసాఫ్ట్​ బోర్డ్​ ఆఫ్​ డైరెక్టర్స్​ నుంచి తప్పుకున్న బిల్​గేట్స్

Last Updated : Mar 14, 2020, 8:07 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.