Investment formula: ప్రతి ఒక్కరికీ ఆర్థిక ప్రణాళిక అవసరమే. భవిష్యత్ లక్ష్యాల సాధనకు ఇది మార్గదర్శకం. డబ్బు ఆదా చేయడం, పెట్టుబడి పెట్టడం ఈ రెండింటికీ అవినాభావ సంబంధం ఉంటుంది. కేవలం ఆదా చేయడంతోనే ఆర్థిక స్వేచ్ఛ సాధించలేం. మహిళలు ఈ విషయాన్ని అర్థం చేసుకొని, పెట్టుబడులవైపు దృష్టి సారిస్తే.. ఆర్థిక స్వేచ్ఛకు మొదటి అడుగు పడినట్లే.
రక్షణ ఉండాల్సిందే..
మహిళలకు బీమా అవసరం లేదనే అపోహ చాలామందిలో ఉంటుంది. ఇది పొరపాటు. ఉద్యోగం చేస్తున్నా, గృహిణిగా ఉన్నా తగిన మొత్తానికి జీవిత బీమా పాలసీ ఉండాల్సిందే. కొవిడ్-19 పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికీ బీమా రక్షణ అవసరం తెలిసింది. సంప్రదాయ మనీ బ్యాక్, ఎండోమెంట్ పాలసీలతోపాటు, టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలకూ ప్రాధాన్యం ఇవ్వాలి. ఆరోగ్య బీమా పాలసీ తప్పనిసరి. మహిళలకు ప్రత్యేకంగా కొన్ని రకాల వ్యాధులకు వర్తించే ఆరోగ్య బీమా పాలసీలూ ఉన్నాయి. వీటిని ఎంచుకునేందుకు ప్రాధాన్యం ఇవ్వాలి.
అవగాహన పెంచుకోండి..
చాలామంది పెట్టుబడుల గురించి మాకు అర్థం కాదు అని అనుకుంటారు. ఇప్పుడున్న సమాచార ప్రపంచంలో ఏ విషయాన్ని తెలుసుకోవాలన్నా పెద్ద కష్టమేమీ కాదు. పెట్టుబడి పథకాల విషయంలోనూ ఇదే వర్తిస్తుంది. వార్తా పత్రికల్లో వచ్చే బిజినెస్, వ్యక్తిగత ఆర్థిక వార్తలను చదవండి. అనేక వెబ్‌సైట్లలో పెట్టుబడులకు సంబంధించిన వీడియోలు చూడండి. దీనివల్ల పెట్టుబడులు ఎంత సులభంగా ప్రారంభించవచ్చనే అవగాహన వస్తుంది. ఒక్క రోజులో ఏదీ జరగదు. మీ ప్రయత్న లోపం లేకుండా చూసుకోవడమే ఇక్కడ అవసరం. చిన్న మొత్తాలతో పెట్టుబడులను ప్రారంభించడం అలవాటు చేసుకుంటే.. త్వరగా నేర్చుకోగలరు.
తొందరగా ప్రారంభించండి..
చక్రవడ్డీ ప్రభావాన్ని ఎనిమిదో వింతతో పోలుస్తారు. అసలుపై వడ్డీ సంపాదించడం కాదు.. ఆ వడ్డీపై వడ్డీ వచ్చినప్పుడే సంపద సృష్టి సాధ్యమవుతుంది. ఈ ప్రయోజనాన్ని అందుకోవాలంటే.. వీలైనంత తొందరగా పెట్టుబడులు ప్రారంభించాల్సిందే. ఉదాహరణకు మీరు మొదటి సంవత్సరం రూ.100 పెట్టుబడి పెట్టారనుకుందాం. దీనికి 10 శాతం రాబడితో రూ.10 వచ్చాయి. రెండో ఏడాది ఈ అసలు రూ.100, వడ్డీ రూ.10 కలిసి రూ.110ని మదుపు చేస్తారు. అప్పుడు ఏడాది చివరి నాటికి అదే 10 శాతం రాబడితో రూ.121 చేతికి అందుతుంది. ఇది ఇలా కొనసాగుతూ.. కొన్నాళ్లకు పెద్ద మొత్తంలో నిధి చేతికి అందుతుంది. కాబట్టి, ఇప్పుడే కాదు.. అనే మాట నుంచి.. ఇప్పటి నుంచే అనుకొని పెట్టుబడులు ప్రారంభించండి.
50 శాతం మీ కోసమే..
వివాహమైన తర్వాత ఉద్యోగినులు తమ సంపాదనను జీవిత భాగస్వామికే ఇచ్చేస్తుంటారు. అప్పటివరకూ ఉన్న పెట్టుబడులనూ ఆపేస్తుంటారు. కుటుంబ అవసరాలు, లక్ష్యాల సాధనలో మీ వంతుగా సహాయం ఉండాలి. అదే సమయంలో మీ పదవీ విరమణ లక్ష్యాన్నీ మర్చిపోవద్దు. అనుకోని పరిస్థితులు వచ్చినప్పుడు ఆర్థికంగా మీకు ఇబ్బందులు ఏర్పడకుండా జాగ్రత్త తప్పనిసరి. మీ ఆదాయంలో తప్పనిసరిగా 30-50 శాతం వరకూ ఈక్విటీ లార్జ్, మిడ్ క్యాప్, హైబ్రీడ్ ఫండ్లలో దీర్ఘకాలిక దృష్టితో మదుపు చేయాలి.
ఉద్యోగం వచ్చిన కొత్తలో..
చదువు పూర్తయి ఉద్యోగం వచ్చిన కొత్తలో ఆర్థికంగా ఎంతో వెసులుబాటు దొరుకుతుంది. ఇది ఒక మంచి అవకాశంగా భావించాలి. భవిష్యత్ ఆర్థిక సాధికారతకు దీన్ని నిచ్చెనగా ఉపయోగించుకోవాలి. పొదుపు, పెట్టుబడులకు ప్రాధాన్యం ఇవ్వాలి. వివాహమైన తర్వాత వీటిని కొనసాగించేలా ఉండాలి. హైబ్రీడ్ ఈక్విటీ పథకాలతోపాటు, ప్రజా భవిష్య నిధి (పీపీఎఫ్) లాంటి పథకాలను పరిశీలించాలి. వీటిని చిన్న మొత్తాలతోనూ కొనసాగించే వీలుంటుంది.
ఇవి పాటించండి..
- ఆర్థిక ప్రణాళిక కోసం మంచి వ్యక్తిగత ఆర్థిక నిపుణులను సంప్రదించండి. మీ లక్ష్యాలు, ప్రాధాన్యాలు వివరిస్తే వారు సరైన మార్గనిర్దేశం చేస్తారు.
- ప్రస్తుతం మీ ఆదాయం, ఖర్చుల మధ్య సమతౌల్యం పాటించాలి. ఎప్పుడూ ఖర్చులు మీ ఆదాయాన్ని మించి ఉండకుండా చూసుకోండి. అప్పులు ఎప్పుడూ ముప్పే.
- లక్ష్య సాధనకు అనువైన పథకాలనే ఎంచుకోండి. ఎప్పటికప్పుడు వాటిని సమీక్షించుకుంటూ ఉండండి.
- అత్యవసర నిధి తప్పనిసరి. కనీసం 6 నెలల ఖర్చులకు సరిపడా సొమ్ము ఎప్పుడూ మీ చేతిలో ఉండాలి.
- మోసపూరిత పథకాలకు ఆకర్షితులు కావద్దు. దీర్ఘకాలంలోనే డబ్బు మరింత డబ్బును సృష్టిస్తుంది.
- నైపుణ్యాలు పెంచుకునేందుకు మీపై మీరు పెట్టుబడి పెట్టుకోండి. తద్వారా ఆర్థికంగానూ బలోపేతం అవుతారు.
ఇదీ చూడండి: Commodity Trading: బంగారం, వెండిపై పెట్టుబడులు లాభదాయకమా?