ధరలతో సంబంధం లేకుండా భారత్‌లో బంగారానికి ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. పల్లెలు, పట్టణాలు తేడా లేకుండా మన దేశంలో పసిడిపై విపరీతమైన ఆకర్షణ. పైగా ఈ నెల బంగారానికి బాగా డిమాండ్ ఉండే నెల కూడా. అయితే ఈసారి అనూహ్యంగా బంగారం ధర 4 నెలల కనిష్ఠానికి చేరడం గమనార్హం. ఈ శుక్రవారం దిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.48,215గా ఉంది. బంగారంలో పెట్టుబడులు పెట్టడానికి ఆభరణాలతో సహా 5 మార్గాలున్నాయి. ఇవి ఫిజికల్ గోల్డ్ (నగలు, ఆభరణాలు), డిజిటల్ గోల్డ్, గోల్డ్ ఈటీఎఫ్, గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్, ప్రభుత్వ లేదా సార్వభౌమ పసిడి బాండ్లు.
మార్కెట్ రిస్క్ లేకుండా..
బంగారు ఆభరణాలను కొనుగోలు చేయడం వల్ల దొంగతనం, నాణ్యత సమస్యలు, ఆభరణాల తయారీ సమయంలో నష్టాలు మొదలైనవి ఉంటాయి. మరోవైపు డిజిటల్ గోల్డ్.. ఆర్‌బీఐ, సెబీ, ఏ ఇతర నియంత్రణ సంస్థ పరిధిలోకి రాదు. అందువల్ల నియంత్రణ పర్యవేక్షణ లేదు. గోల్డ్ ఈటీఎఫ్, మ్యూచువల్ ఫండ్‌లు రెండూ బంగారం ధరల అస్థిరత కారణంగా మార్కెట్ రిస్క్‌ను కలిగి ఉంటాయి. సార్వభౌమ గోల్డ్ బాండ్స్ మాత్రం భారత ప్రభుత్వం హామీ ఇచ్చిన డెరివేటివ్ ప్రోడక్ట్.
భౌతిక బంగారం విషయానికొస్తే..
బంగారం పెట్టుబడి నుండి వచ్చే రాబడులు పెట్టుబడి ఎంపికను బట్టి కొద్దిగా మారవచ్చు. సార్వభౌమ గోల్డ్ బాండ్లతో సంవత్సరానికి 2.5% హామీ రాబడిని పొందవచ్చు. మరోవైపు, దేశీయ బంగారం ధరలను ట్రాక్ చేసే 'గోల్డ్ ఈటీఎఫ్' కూడా మంచి ఎంపిక. భౌతిక బంగారం విషయానికొస్తే వివిధ రాష్ట్రాలలో ధరలు కొద్దిగా భిన్నంగానే ఉంటాయి. ఆభరణాల తయారీకి అదనపు ఛార్జీలు, తరుగు మీకు రావలసిన లాభాలను తగ్గిస్తాయి. దీంతో భౌతిక బంగారం విషయంలో పెద్దగా అదనపు రాబడులు రావనే చెప్పాలి. బంగారాన్ని వెంటనే నగదు రూపంలోకి మార్చుకోగలిగే ఆస్తిగా పరిగణిస్తారు. భౌతిక బంగారం, డిజిటల్ గోల్డ్, గోల్డ్ ఈటీఎఫ్‌లు, గోల్డ్ మ్యూచువల్ ఫండ్లను మార్కెట్లో సులభంగా కొనుగోలు చేయవచ్చు, అమ్మవచ్చు కూడా. అయితే సార్వభౌమ గోల్డ్ బాండ్ 8 సంవత్సరాలు మెచ్యూరిటీ వ్యవధిని కలిగి ఉంటుంది. కానీ 5 సంవత్సరాలు లాక్-ఇన్ పీరియడ్ పూర్తయిన తర్వాత ఈ బాండ్లను ముందుగానే క్యాష్ చేయవచ్చు. ప్రత్యామ్నాయంగా వాటిని సెకండరీ మార్కెట్లో కూడా తక్కువ ధరకు విక్రయించవచ్చు.
బంగారంపై ఆదాయ పన్ను..
రుణ నిధుల మాదిరిగానే, మూలధన లాభాల పన్ను నియమాలు బంగారానికి వర్తిస్తాయి. కాబట్టి, 3 ఏళ్ల లోపు బంగారం పెట్టుబడిని విక్రయిస్తే, మీ ఆదాయపు పన్ను శ్లాబ్ ప్రకారం స్వల్పకాలిక మూలధన లాభాలుగా పరిగణిస్తారు. 3 సంవత్సరాల తర్వాత విక్రయిస్తే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఛార్జ్ వర్తిస్తుంది. ఆ విధంగా ఇండెక్సేషన్‌తో 20% ఛార్జ్ పడుతుంది. అయితే, సార్వభౌమ గోల్డ్ బాండ్‌లు 5, 8 సంవత్సరాల మధ్య రిడీమ్ చేస్తే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ పన్ను నిబంధనల నుండి మినహాయింపు పొందవచ్చు. కానీ, సార్వభౌమ గోల్డ్ బాండ్ల వడ్డీ పెట్టుబడిదారుల పన్ను శ్లాబ్ ప్రకారం పన్ను విధిస్తారు. ఎందుకంటే వడ్డీ ద్వారా వచ్చే ఆదాయం ఇతర వనరుల నుంచి వచ్చే ఆదాయం కింద వర్గీకరిస్తారు.
అయితే సుదీర్ఘకాలం పెట్టుబడి పెట్టాలనుకుంటే బంగారం ధర పెరుగుదల, అదనంగా 2.5% వడ్డీ వస్తుంది కాబట్టి సార్వభౌమ గోల్డ్ బాండ్ మంచి ఎంపికగానే మార్కెట్ నిపుణులు పరిగణిస్తున్నారు. అయితే పెట్టుబడి కాలపరిమితి తక్కువగా ఉంటే గోల్డ్ ఈటీఎఫ్‌ల్లో పెట్టుబడులను పరిగణలోకి తీసుకోవచ్చని కూడా నిపుణులు చెబుతున్నారు. అయితే భౌతిక, డిజిటల్ గోల్డ్‌లో పెట్టుబడులు పెట్టకపోవడమే మేలని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు.
ఇదీ చూడండి: ప్రచారం జీరో.. బ్రాండ్లు మాత్రం హీరో!
ఇదీ చూడండి: ఓలా ఈ-స్కూటర్.. ఆగస్టు 15న మీ ముందుకు