పరారీలో ఉన్న ఆర్థిక నేరగాడు నీరవ్ మోదీ భార్య అమీ మోదీపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసింది ఇంటర్‌పోల్. భారత్‌లో నమోదైన మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విజ్ఞప్తి మేరకు ఈ నోటీసులు జారీ చేసింది ఇంటర్‌పోల్.
రెడ్‌కార్నర్ నోటీసు అంటే.. పరారీలో ఉన్న నిందితులను అరెస్టు చేయాలని ఇంటర్‌పోల్ తన సభ్య దేశాలకు కోరుతుంది. ఆ తర్వాత సంబంధిత దేశానికి అప్పగించేలా ఇంటర్‌పోల్ చర్యలు తీసుకుంటుంది.
2018లో పీఎన్బీ కుంభకోణం మూలాలు బయట పడుతున్న సమయంలో అమీ మోదీ దేశాన్ని వదిలి వెళ్లిపోయారు. నీరవ్‌తో కలిసి మనీ లాండరింగ్, మోసపూరిత చర్యలకు పాల్పడినట్లు ఈడీ కేసు నమోదు చేసింది.
లండన్ జైలులో మోదీ..
ఇదే కేసులో నీరవ్ మోదీ, అతని సోదరుడు నేహల్ మోదీతో పాటు సోదరి పూర్విపైనా రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేశారు. ముంబయిలోని ప్రత్యేక కోర్టు నీరవ్‌ను పరారీలో ఉన్న ఆర్థిక నేరస్థుడిగా గుర్తించింది. గతేడాది మార్చిలో నీరవ్ మోదీని లండన్‌లో అరెస్టు చేశారు.
భారీ కుంభకోణం..
పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు వేల కోట్లు ఎగవేసిన కేసులో నీరవ్ మోదీ ప్రధాన నిందితుడు. మోదీతో కలిసి తన బంధువు మెహుల్ ఛోక్సి కలిసి రూ.14 వేల కోట్ల కుంభకోణానికి పాల్పడినట్లు సీబీఐ ఛార్జిషీటు దాఖలు చేసింది. ఇప్పటివరకు మోదీ సంబంధించిన ఆస్తుల నుంచి రూ.329 కోట్లు స్వాధీనం చేసుకుంది ఈడీ.
ఇదీ చూడండి: నీరవ్ మోదీ బెయిల్ పిటిషన్ మరోమారు తిరస్కరణ