వార్తాపత్రికల కంటెంట్‌ను వినియోగించుకున్నందుకు సరైన పరిహారం చెల్లించాలని సెర్చ్‌ఇంజిన్ దిగ్గజం గూగుల్‌ను ఇండియన్ న్యూస్‌పేపర్ సొసైటీ(ఐఎన్‌ఎస్) కోరింది. ప్రకటనల ఆదాయంలో ప్రచురణకర్తల వాటాను 85 శాతానికి పెంచడంతో పాటు, ఆదాయ పంపిణీలో మరింత పారదర్శకత వహించాలని డిమాండ్ చేసింది. ఇందుకోసం భారత న్యూస్‌పేపర్ సొసైటీ(ఐఎన్‌ఎస్) తాజాగా గూగుల్‌కు లేఖ రాసింది. గూగుల్, ఫేస్‌బుక్ వంటి సంస్థలు తమ ప్లాట్‌ఫాంలలో ప్రచురించే న్యూస్ కంటెంట్‌పై మీడియా సంస్థలకు రుసుము చెల్లించాలని ఆస్ట్రేలియా నిర్ణయించిన వేళ, భారత్‌లోనూ ఇదే విషయం మరోసారి చర్చనీయాంశమయ్యింది.
'అడ్వెర్‌టైజింగ్ వ్యవస్థలో ఉన్న అపారదర్శకత వల్ల పత్రికా సంస్థలు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నాయి. దీంతో గూగుల్ ఇచ్చే ప్రకటన వివరాలను కూడా పొందలేకపోతున్నాం' అని భారత న్యూస్‌పేపర్ సొసైటీ అధ్యక్షుడు ఎల్ ఆదిమూలం వెల్లడించారు. నిత్యం వేలమంది జర్నలిస్టులు విశ్వసనీయమైన సమాచారం, విశ్లేషణాత్మక కథనాలను అందించడంలో కీలకంగా వ్యవహరిస్తారు. ఇందుకోసం వార్తా సంస్థలు ఎంతో వ్యయాన్ని కేటాయిస్తాయి. ఇలాంటి నేపథ్యంలో ప్రకటనల్లో సరైన వాటా డిమాండ్ చేస్తూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రచురణకర్తలు గూగుల్ ముందు ఇదే అంశాన్ని గతకొన్నేళ్లుగా లేవనెత్తుతున్నాయని ఐఎన్‌ఎస్ పేర్కొంది.
దేశంలో వార్తలు, సమాచార పంపిణీలో భారత ప్రింట్ మీడియా అత్యంత విశ్వసనీయత కలిగి ఉందని, జాతీయాభివృద్ధిలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయని ఇండియన్ న్యూస్‌పేపర్ సొసైటీ(ఐఎన్‌ఎస్) పునరుద్ఘాటించింది. అందుచేత అసత్య వార్తలను నివారించడంలో రిజిస్టర్డ్ వార్తా సంస్థలు ఇచ్చే ఎడిటోరియల్ కంటెంట్‌కు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలని సూచించింది. విశ్వసనీయత లేని అనేక సైట్ల నుంచి గూగుల్ కంటెంట్‌ను తీసుకుకోవడం కూడా తప్పుడు, అసత్య వార్తల ప్రచారానికి కారణమవుతుందని, వీటిపై గూగుల్ సమీక్ష చేసుకోవాలని పేర్కొంది.
ఇదిలాఉంటే, ఫ్రాన్స్, యూరోపియన్ యూనియన్, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో వార్తలు ప్రచురించినందుకు అక్కడి ప్రచురణకర్తలకు రుసుము చెల్లించేందుకు గూగుల్ అంగీకరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్‌లోనూ వార్తా సంస్థల కంటెంట్‌ను వినియోగించుకునే పక్షంలో సరైన వాటా ఇవ్వడంతో పాటు, పారదర్శకత పాటించాలని ఐఎన్‌ఎస్ గూగుల్‌ను డిమాండ్ చేస్తోంది.
ఇదీ చూడండి: 'వార్తల కోసం ఆ సంస్థలు డబ్బులు చెల్లించాల్సిందే'