దేశంలో ఆర్థిక మందగమనం నెలకొన్నప్పటికీ 2019 నవంబర్లో పారిశ్రామికోత్పత్తి వృద్ధి కనబర్చింది. మూడు నెలల ప్రతికూల వృద్ధికి తెరదించుతూ నవంబర్లో 1.8 శాతం వృద్ధి నమోదు చేసినట్లు జాతీయ గణాంక కార్యాలయం వెల్లడించింది. 2018 నవంబర్లో పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) 0.2 శాతం వృద్ధిని నమోదు చేసింది.
అధికారిక డేటా ప్రకారం, 2019 నవంబర్లో తయారీ రంగం 2.7 శాతం వృద్ధి నమోదు చేసినట్లు స్పష్టమైంది. గత ఏడాది నవంబర్లో ఈ వృద్ధి కేవలం 0.7 శాతంగా ఉంది.
మరోవైపు విద్యుత్ రంగం తిరోగమన బాటలో పయనించింది. 2019 నవంబర్లో విద్యుత్ ఉత్పాదన -5 శాతానికి పడిపోయింది. 2018 నవంబర్లో ఈ రంగం 5.1 శాతం వృద్ధి నమోదు చేసింది.
2019 నవంబర్లో మైనింగ్ రంగంలో వృద్ధి 1.7 శాతానికి పరిమితమైంది. గత ఇదే సమయంలో ఈ వృద్ధి 2.7 శాతంగా ఉంది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-నవంబర్లో పారిశ్రామిక ఉత్పత్తి సూచీ వృద్ధి భారీగా పతనమైంది. 2018-19 ఏప్రిల్-నవంబర్ మధ్య పారిశ్రామికోత్పత్తి వృద్ధి 5 శాతంగా ఉండగా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అదే కాలంలో 0.6 శాతానికి దిగజారింది.