Indigenous semiconductor chips: ఎలక్ట్రానిక్ పరికరాల తయారీలో కీలకమైన 'చిప్‌సెట్'లను దేశీయంగా ఉత్పత్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆవిష్కరించిన సెమీకండక్టర్ పీఎల్‌ఐ విధానం దిగ్గజ కంపెనీల్లో కదలిక తీసుకువచ్చింది. ఈ రంగంలో భారీగా పెట్టుబడులు పెట్టి, 'చిప్'లు ఉత్పత్తి చేయడంతో పాటు, డిజైన్- టెస్టింగ్ సేవలను ఆవిష్కరించేందుకు ఆయా సంస్థలు సన్నద్ధమవుతున్నాయి.
టాటా, వేదాంతా గ్రూపు ఇప్పటికే సంసిద్ధత వ్యక్తం చేయగా, కొన్ని విదేశీ సంస్థలు కూడా ప్రభుత్వంతో సంప్రదింపులకు ముందుకు వస్తున్నాయని సమాచారం. దేశీయంగా పలు చిన్న, మధ్యతరహా ఎలక్ట్రానిక్, సెమీకండక్టర్ కంపెనీలు కూడా కొత్త అవకాశాలపై దృష్టి సారిస్తున్నాయి. ఇప్పటికే సాఫ్ట్‌వేర్, ఎలక్ట్రానిక్స్ తయారీలో నైపుణ్యం అధికంగా ఉన్నందున, చిప్ డిజైనింగ్ సేవలు మొదలుపెట్టి, అందులో అగ్రగామిగా మారే అవకాశం మనదేశానికి ఉన్నట్లు ఆ వర్గాలు పేర్కొంటున్నాయి. కేంద్రం ప్రకటించిన సెమీకండక్టర్ విధానం కింద రాయితీల కోసం దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. దీనికోసం ప్రభుత్వం ఓ వెబ్‌సైట్‌ను ఆవిష్కరించింది.
సెమీకండక్టర్, సంబంధిత కార్యకలాపాల్లో నిమగ్నమైన 100 దేశీయ కంపెనీలను ప్రభుత్వం గుర్తించి, పీఎల్‌ఐ పథకం కింద రాయితీలు పొందేలా పెట్టుబడులు పెట్టాలని సూచిస్తున్నట్లు తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లుగా సాగితే రెండేళ్లలో దేశీయ అవసరాలకు కావాల్సిన చిప్‌లు ఉత్పత్తి కావచ్చని విశ్లేషిస్తున్నారు.
4 రకాల కార్యకలాపాలకు
కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన 10 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.75,000 కోట్లు) రాయితీల పథకం కింద, సెమీకండక్టర్ పరిశ్రమకు సంబంధించి ప్రధానంగా 4 రకాల కార్యకలాపాలు చేపట్టే సంస్థలను ఎంపిక చేస్తారు. సీఎంఓఎస్ (కాంప్లిమెంటరీ మెటల్ ఆక్సైడ్ సెమీకండక్టర్) డిస్‌ప్లే ఫ్యాబ్, కాంపౌండ్ సెమీకండక్టర్ ఫ్యాబ్స్ అండ్ ఏటీఎంపీ (ప్యాకేజింగ్ అండ్ టెస్టింగ్) యూనిట్లు, డిజైన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ ఫర్ ఫ్యాబ్‌లెస్ సెమీకండక్టర్ కంపెనీలు (ప్రోడక్ట్స్, ఐపీ అభివృద్ధి చేసేవి), సెమీకండక్టర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, సపోర్ట్ సిస్టమ్స్- ఇందులో ఉన్నాయి.
విదేశీ భాగస్వాముల కోసం అన్వేషణ
కొన్ని పెద్ద కంపెనీలు సెమీకండక్టర్ ఫ్యాబ్‌లు ఏర్పాటు చేసే ఆలోచన చేస్తున్నాయి. అందుకు అవసరమైన విదేశీ భాగస్వాముల కోసం అన్వేషిస్తున్నాయి. విదేశాల్లో సెమీకండక్టర్ కంపెనీలను టేకోవర్ చేసే సన్నాహాల్లో మరికొన్ని నిమగ్నమయ్యాయి. ప్రపంచంలో అతిపెద్ద చిప్ డిజైన్, తయారీ కంపెనీ ఇంటెల్ మనదేశంలో ఏటీఎంపీ (అసెంబ్లీ, టెస్టింగ్, మార్కింగ్, ప్యాకింగ్) యూనిట్‌కు సిద్ధపడుతుందని అంటున్నారు. ఇంటెల్‌కు అమెరికా వెలుపల అతిపెద్ద డిజైన్ సెంటర్ మనదేశంలోనే ఉంది. దేశీయ సంస్థలు డిజైన్, ఎంబెడెడ్ సిస్టమ్స్, సంబంధిత సేవల వైపు చూస్తున్నాయి.
- హైదరాబాద్ కేంద్రంగా దాదాపు 2 దశాబ్దాలుగా సెమీకండక్లర్ల విభాగంలో కార్యకలాపాలు సాగిస్తున్న మాస్‌చిప్ టెక్నాలజీస్ డిజైన్ లెడ్ ఇన్సెంటివ్స్ (డీఎల్‌ఐ) కోసం దరఖాస్తు చేసే ఆలోచనలో ఉంది. డీఎల్‌ఐ, దానికి సంబంధించిన రాయితీల ద్వారా ప్రయోజనాన్ని పొందటానికి అవకాశాలను పరిశీలిస్తున్నట్లు మాస్‌చిప్ టెక్నాలజీస్ ఇటీవల వెల్లడించింది.
- ఎస్‌పీఈఎల్ సెమీకండక్టర్ కూడా ఇటువంటి ఆలోచన చేస్తున్నట్లు చెబుతున్నారు. ప్రభుత్వ ప్రయత్నాలు ఫలిస్తే, దేశీయంగా సెమీకండక్టర్ల రంగంలో రూ.90,000 కోట్ల వరకు పెట్టుబడులు లభిస్తాయని కేంద్ర ఐటీ సహాయ కార్యదర్శి సౌరభ్ గౌర్ ఇటీవల పేర్కొన్నారు. రెండేళ్లలో దేశీయంగా చిప్‌లు తయారు చేసే పరిస్థితి వస్తుందని అన్నారు. టాటా, వేదాంతా గ్రూపు స్థాపించే భారీ సెమీకండక్టర్ యూనిట్లను ఆకర్షించేందుకు పలు రాష్ట్రాలు పోటీపడుతున్నాయి. ఈ యూనిట్‌పై 300 మిలియన్ డాలర్లు (రూ.2,250 కోట్లు) పెట్టుబడి పెట్టటానికి టాటా గ్రూపు సిద్ధంగా ఉంది. టాటాలను తమ రాష్ట్రానికి రావాల్సిందిగా తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర, కర్నాటక ఆహ్వానిస్తున్నాయి. చిన్న, మధ్యస్థాయి యూనిట్ల కోసం ప్రత్యేకంగా 'సెమీకండక్టర్ కాంప్లెక్స్' లను ఏర్పాటు చేసేందుకు కొన్ని రాష్ట్రాలు కసరత్తు ప్రారంభించాయి.
- సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చూడండి: ఉద్యోగం మారేందుకే 82 శాతం మొగ్గు.. అదే కారణం!