వరుసగా రెండో నెలలోనూ దేశంలో ఇంధన వినియోగం భారీగా తగ్గింది. ఫిబ్రవరిలో పెట్రోలియం ఉత్పత్తుల వినియోగం 4.9 శాతం తగ్గి.. 17.21 మిలియన్ టన్నులుగా నమోదైనట్లు పెట్రోలియం, సహజవాయు మంత్రిత్వ శాఖలోని విశ్లేషణ విభాగం గణాంకాల్లో వెల్లడించింది. గత ఏడాది సెప్టెంబర్ నుంచి చూస్తే... ఈ ఫిబ్రవరిలోనే ఇంధన డిమాండ్ అత్యధికంగా తగ్గినట్లు పేర్కొంది. ఇంధన ధరలు రికార్డు స్థాయికి చేరడమే డిమాండ్ తగ్గేందుకు కారణంగా వివరించింది.
పెట్రోలియం ఉత్పత్తుల వినియోగం ఇలా..
- రవాణా కోసం అత్యధికంగా వాడే డీజిల్ వినియోగం గత నెల ఏకంగా 8.5 శాతం పడిపోయి.. 6.55 మిలియన్ టన్నులుగా నమోదైంది. పెట్రోల్ వినిమయం కూడా 6.5 శాతం తగ్గి.. 2.4 మిలియన్ టన్నులకు చేరింది.
- నాఫ్తా విక్రయం దాదాపు స్థిరంగా ఉండగా.. రోడ్ల తయారీలో వాడే తారు వినిమయం అత్యధికంగా 11 శాతం పడిపోయింది.
- వంట గ్యాస్ (ఎల్పీజీ) వినియోగం మాత్రం 7.6 శాతం పెరిగింది.
పెట్రోల్, డీజిల్ ధరలు గత నెల భారీగా పెరిగి.. ప్రస్తుతం రికార్డు స్థాయి వద్ద ఉన్నాయి. గత 13 రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. బంగాల్ సహా పలు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యలో కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరల విషయంలో జాగ్రత్త వహిస్తుండటం ఇందుకు కారణమని విశ్లేషకులు చెబుతున్నారు.
ఇదీ చదవండి:ఎన్నికల తర్వాత భారీ స్థాయిలో పెట్రో బాదుడు?
ఒపెక్ అంచనా..
ముడి చమురు ఉత్పత్తి దేశాల కూటమి ఒపెక్ నెలవారీ నివేదిక మాత్రం భారత చమురు డిమాండ్ 2021లో 13.6 శాతం పెరగొచ్చని అంచనా వేసింది. రోజుకు 4.99 మిలియన్ బ్యారెళ్ల చమురు వినియోగమవుతుందని పేర్కొంది.
2020లో భారత్లో చమురు డిమాండ్(2019తో పోలిస్తే) 10.54 శాతం తగ్గినట్లు వెల్లడించింది. రోజువారీ వినియోగం 4.91 మిలియన్ బ్యారెళ్ల నుంచి 4.40 మిలియన్ బ్యారెళ్లకు పడిపోయిందని తెలిపింది.
ఇదీ చదవండి:పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం- ఐఐపీ నేల చూపులు