బడ్జెట్లో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్న వృద్ధిరేటు అంచనాలు... భారత ఆర్థికవ్యవస్థ ఎదుర్కొంటున్న నిర్మాణ, చక్రీయ సవాళ్లను ఎదుర్కోవడంలో ఆశావహ దృక్పథాన్ని చాటేలా ఉన్నాయని ప్రముఖ రేటింగ్ సంస్థ మూడీస్ ఇన్వెస్టర్స్ అభిప్రాయపడింది.
చాలా తేడా ఉంది..!
2020-21లో నామమాత్రపు జీడీపీ వృద్ధి 10 శాతం, తరువాతి రెండేళ్లలో వరుసగా 12.6 శాతం, 12.8 శాతం ఉండొచ్చని ఆర్థికమంత్రి అంచనా వేశారు. అయితే మూడీస్ మాత్రం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నామమాత్రపు జీడీపీ వృద్ధి 7.5 శాతానికే పరిమితమవుతుందని పేర్కొంది. వచ్చే ఏడాది ఇది 8.7 శాతానికి పెరుగుతుందని అంచనా వేసింది.
ప్రభుత్వ అంచనాలకు భిన్నంగా
మందగమనం కారణంగా, మార్చి 31తో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి 4.9 శాతానికే పరిమితమవుతుందని మూడీస్ అంచనా వేసింది. ఇది ప్రభుత్వం అంచనా వేసిన 5 శాతం కంటే తక్కువ. వచ్చే ఆర్థిక సంవత్సరంలో జీడీపీ 6 నుంచి 6.5 శాతంగా ఉండవచ్చని ప్రభుత్వం అంచనా వేయగా, మూడీస్ మాత్రం ఇది 5.5 శాతానికి పరిమితమవుతుందని పేర్కొంది.
మందగమనం కారణంగా
'మందగమనం కొనసాగుతుండడం, నిరర్ధక ఆస్తులు పెరిగిపోతుండడం వల్ల దేశ వృద్ధిరేటు బలహీనపడుతోంది. ఫలితంగా రుణాలు మంజూరు చేయడానికి, పెట్టుబడులు పెట్టడానికి తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. మరోవైపు వినియోగం కూడా తగ్గడం సమస్యను మరింత జఠిలం చేస్తోంది' అని మూడీస్ స్పష్టం చేసింది.
ఇదీ చూడండి: ఎండీఆర్ జీరో కావాలి: నందన్ నీలేకని