Chanel Global CEO: ప్రపంచంలోనే పేరొందిన పలు సంస్థలకు భారతీయులు సీఈఓలుగా రాణిస్తున్నారు. ఇటీవల సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ సీఈఓగా పరాగ్ అగర్వాల్ పగ్గాలు చేపట్టగా.. తాజాగా మరో భారత సంతతికి చెందిన లీనా నాయర్(52) ఈ జాబితాలో చేరారు. ఫ్రెంచ్ విలాసవంత ఉత్పత్తుల సంస్థ షునెల్ గ్లోబల్ సీఈఓగా లీనా నియమితులయ్యారు.
ఎవరీ లీనా నాయర్?
లీనా నాయర్.. మహారాష్ట్రలోని కొల్హాపుర్‌లో జన్మించారు. అయితే బ్రిటన్‌లో స్థిరపడ్డారు. ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ పూర్తి చేసిన లీనా.. తర్వాత ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐలో (జంషెడ్‌పుర్) ఎంబీఏ (1990-92) పూర్తి చేసి బంగారు పతకం సాధించారు. అనంతరం 1992లో హిందుస్థాన్ యూనీలీవర్‌లో (హెచ్‌యూఎల్) మేనేజ్‌మెంట్ ట్రైనీగా చేరారు. అందులో అంచెలంచెలుగా ఎదిగిన లీనా.. ప్రస్తుతం యూనీలీవర్ ముఖ్య మానవ వనరుల అధికారిగా, యూనీలీవర్ లీడర్‌షిప్ ఎగ్జిక్యూటివ్ సభ్యురాలిగా ఉన్నారు. 30 ఏళ్లపాటు హెచ్‌యూఎల్‌లో వివిధ హోదాల్లో విధులు నిర్వహించారు.
యూనిలీవర్‌లో ముఖ్య మానవ వనరులు అధికారిగా పగ్గాలు చేపట్టిన తొలిమహిళగా.. అతి పిన్న వయస్కురాలిగా ఘనత సాధించారు. సంస్థ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు.
లీనా.. గతంలో బ్రిటిన్ ప్రభుత్వానికి చెందిన ఇంధనం, పారిశ్రామిక వ్యూహ విభాగానికి నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేశారు.
గొప్ప గౌరవం
షునెల్ గ్లోబల్ సీఈఓగా 2022 జనవరిలో బాధ్యతలు చేపట్టనున్నారు. షునెల్ సంస్థకు సీఈఓగా ఎంపికవడంపై సంతోషం వ్యక్తం చేశారు లీనా. తనకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నారు.
"షునెల్ గ్లోబల్ సంస్థకు సీఈఓగా ఎంపికవడం.. నాకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. షునెల్ సంస్థ నుంచి ఎంతో స్ఫూర్తి పొందాను."
-లీనా నాయర్
30ఏళ్లు పాటు యూనీలీవర్‌లో పని చేసినందుకు తనకు సంతోషంగా ఉందన్నారు లీనా. తన ఎదుగుదలకు సంస్థ ఎన్నో అవకాశాలు ఇచ్చిందన్నారు. ఇందుకు సంస్థకు ఎల్లప్పుడూ కృతజ్ఞురాలిగా ఉంటానని ట్వీట్ చేశారు.
ప్రస్తుత షునెల్ సీఈఓ మౌరీన్ చిక్వెట్ స్థానాన్ని లీనా భర్తీ చేయనున్నారు.
ఇదీ చూడండి: ప్రపంచ దిగ్గజ కంపెనీల్లో అగ్రాసనం భారతీయులదే- కారణమిదే..