Indian Economy: అత్యధిక ద్రవ్యోల్బణం, అధిక నిరుద్యోగంతో ఇబ్బంది పడుతూ, మందగమనానికి గురయ్యే పరిస్థితి మన ఆర్థిక వ్యవస్థకు రాదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నరు శక్తికాంత దాస్ భరోసా ఇచ్చారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడి పరిణామాల ప్రభావం మనపై చాలా తక్కువగా ఉన్నందున, ధరలు త్వరలోనే అదుపులోకి వస్తాయనే అంచనాను సీఐఐ నిర్వహించిన సదస్సులో దాస్ వ్యక్తం చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధిరేటు 8.9 శాతంగా ఉంటుందనే అంచనా వేశామని, ఉక్రెయిన్ యుద్ధ పరిణామాల ప్రభావం దీనిపై స్వల్పంగా ఉండొచ్చని పేర్కొన్నారు. అంతర్జాతీయ అనిశ్చితి దీర్ఘకాలం కొనసాగితే మాత్రం, వృద్ధిపై ఏడాది పాటు ప్రభావం పడుతుందని, ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు శ్రమించాల్సి వస్తుందని పేర్కొన్నారు. ఆర్‌బీఐ లక్షిత రిటైల్ ద్రవ్యోల్బణం (2-6 శాతంలో) గరిష్ఠ స్థాయికి కాస్త అధికంగా గత రెండు నెలల్లో నమోదైనా, మున్ముందు అదుపులోకి వస్తుందనే అంచనాను దాస్ వ్యక్తం చేశారు.. జనవరిలో 6.01 శాతం, ఫిబ్రవరిలో 6.07 శాతంగా రిటైల్ ద్రవ్యోల్బణం నమోదైన సంగతి విదితమే. ఆర్‌బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్షలోనే భవిష్యత్తు ద్రవ్యోల్బణ అంచనాలను వెలువరిస్తామని దాస్ చెప్పారు
రూపాయి మారకపు విలువలోనూ స్థిరత్వం రావొచ్చని దాస్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఎలాంటి సవాళ్లనైనా తట్టుకోగలిగే స్థితిలో మన ఆర్థిక వ్యవస్థ ఉందని, విదేశీ మారకపు నిల్వలు అధికంగా ఉండటం, కరెంటు ఖాతా లోటు తక్కువగా ఉండటం ఇందుకు ఉపకరించే అంశాలని వివరించారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రారంభించాక, ముడిచమురు సహా కీలక కమొడిటీ ధరలు పెరగడంతో, ఆర్థిక వ్యవస్థకు సవాళ్లు ఎదురవుతుండటాన్ని ఆయన ప్రస్తావించారు. డాలరు మారకపు విలువ ఈనెలలో రూ.77.27కు చేరిన నేపథ్యంలో, రూపాయి విలువను కాపాడేందుకు తన నిల్వల నుంచి 10 బిలియన్ డాలర్లను ఆర్‌బీఐ విక్రయించింది. గత దశాబ్ద కాలంలోనే ఈ స్థాయిలో ఆర్‌బీఐ కార్యాచరణకు దిగలేదు. శ్రీలంకలో గరిష్ఠస్థాయులకు చేరిన ధరలతో ప్రజలు అల్లాడుతున్న నేపథ్యంలో, ఆర్‌బీఐ గవర్నర్ ఈ భరోసా ఇచ్చారు.
ద్రవ్యలభ్యతకు ఊతం: ఆర్థిక వ్యవస్థలో తగినంత ద్రవ్యలభ్యత ఉండేలా ఆర్‌బీఐ తన సహకారాన్ని కొనసాగిస్తుందని దాస్ చెప్పారు. '2020 మార్చిలో కొవిడ్-19 పరిణామాలు చోటుచేసుకున్నప్పటి నుంచి ఆర్థిక వ్యవస్థలోకి రూ.17 లక్షల కోట్లను ఆర్‌బీఐ చొప్పించింది. ద్రవ్యలభ్యత పరంగా ఆర్‌బీఐ తన సహకారాన్ని మున్ముందూ కొనసాగిస్తుంద'ని ఆయన అన్నారు. బ్యాంకింగ్ వ్యవస్థ కూడా కనీస మూలధన నిష్పత్తి విషయంలో మెరుగైన స్థితిలో ఉందని, స్థూల నిరర్థక ఆస్తుల నిష్పత్తి రికార్డు కనిష్ఠమైన 6.5 శాతానికి దిగివచ్చిందని చెప్పారు.
ఇదీ చూడండి:
ఐదు నెలలు తర్వాత పెరిగిన పెట్రోలు, డీజిల్ ధరలు- కొత్త రేట్లు ఇవే..