కరోనా దెబ్బకు అన్ని రంగాలు కుదేలైపోయాయి. భారత్‌లోనూ ఈ వైరస్ అడుగుపెట్టాక స్మార్ట్‌ఫోన్ మార్కెట్ సేల్స్ సగానికి పడిపోయాయి. లాక్డౌన్ వల్ల ఏప్రిల్-జూన్ కాలంలో షిప్మెంట్లకు ఇబ్బందులు ఏర్పడ్డాయని.. అయితే రానున్న కాలంలో పండుగ సీజన్ కావడం వల్ల మళ్లీ వ్యాపారాలు పుంజుకుంటాయని అభిప్రాయపడింది మార్కెట్ రీసెర్చ్ సంస్థ ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్(ఐడీసీ) ఇండియా. ఈ మేరకు శుక్రవారం ఓ నివేదిక విడుదల చేసింది.
కరోనా వ్యాప్తి నియంత్రణలో భాగంగా విధించిన లాక్డౌన్ కారణంగా.. గతేడాది వ్యాపారంతో పోలిస్తే దాదాపు 50.6 శాతం తగ్గుదల నమోదైనట్లు ఆ నివేదిక తెలిపింది. దాదాపు 18.2 మిలియన్ యూనిట్లు తక్కువగా అమ్ముడైనట్లు స్పష్టం చేసింది.
తొలి స్థానంలో శాంసంగ్...
చైనాకు చెందిన స్టార్ట్ ఫోన్ల తయారీ సంస్థ షియోమీకి షాకిచ్చింది దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్ దిగ్గజం శాంసంగ్. భారత మొబైల్ ఫోన్ల మార్కెట్లో అగ్రస్థానంలో రారాజుగా వెలుగొందుతున్న షియోమీని.. శాంసంగ్ వెనక్కి నెట్టింది. ఈ ఏడాది ఏప్రిల్-జూన్ మధ్య మొబైల్ ఫోన్ల విక్రయాలకు సంబంధించి ఐడీసీ విడుదల చేసిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది.
స్మార్ట్ఫోన్ల సెగ్మెంట్లో మాత్రం షియోమీ టాప్‌లో నిలిచింది. 29.4 శాతం షేర్‌తో ఈ చైనా సంస్థ అగ్రస్థానంలో ఉంది. రెండో స్థానంలో ఉండే వివోను(17.5) వెనక్కి నెట్టి ఆ ర్యాంక్‌ను ఆక్రమించుకుంది శాంసంగ్(26.3). రియల్ మీ 9.8 శాతం, ఒప్పో 9.7 శాతం మార్కెట్‌ను కైవసం చేసుకున్నాయి. చైనా వస్తువుల బహిష్కరణ కారణంగా శాంసంగ్ మార్కెట్ దూసుకెళ్తున్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
లాక్డౌన్ దెబ్బ...
దేశవ్యాప్తంగా లాక్డౌన్ వల్ల సప్లై చైన్‌లో ఇబ్బందులు ఎదుర్కొని విక్రేతలు డిమాండ్‌కు తగ్గట్లు వస్తువులను అందించలేకపోయినట్లు ఆ నివేదిక పేర్కొంది. ఫ్యాక్టరీలు కూడా సగం సిబ్బందితో పనిచేయడం మరో కారణంగా వెల్లడించింది. విడి పరికరాలు, మొబైల్ భాగాల రవాణా విషయంలోనూ సమస్యలు ఎదురైనట్లు స్పష్టం చేసింది. అయితే లాక్డౌన్ సడలింపుల వల్ల జూన్ నుంచి అమ్మకాల్లో జోరు పెరిగినట్లు తెలిపింది.
" 44.8 శాతం మార్కెట్ షేర్ ఆన్లైన్ ద్వారానే జరిగింది. అయితే ఇది గతేడాదితో పోలిస్తే 39.9 శాతం తక్కువ. లాక్డౌన్ ఆంక్షలు, డెలివరీ ఆలస్యం, తక్కువ ఉత్పత్తి వల్ల ఈ లోటు వచ్చింది" అని ఐడీసీ నివేదిక పేర్కొంది.
కొత్త విధానాలు..
చాలా మంది రిటైలర్లు కరోనా వల్ల కొత్త తరహా మార్కెటింగ్ విధానాలను అందిపుచ్చుకున్నారని తెలిపింది ఐడీసీ. సామాజిక మాధ్యమాలు, వాట్సాప్, రిఫరెన్సులు వంటి వాటితో పాటు ఇంటివద్దే డెమో, డెలివరీ వంటి సదుపాయం, కాంటాక్ట్‌లెస్ పేమెంట్స్‌తో వ్యాపారాలను కొనసాగించారని తెలిపింది. అయితే ఏప్రిల్‌లో జీఎస్టీ పెరుగుదల వల్ల బ్రాండ్ సంస్థలు వస్తువుల ధరలు పెంచినట్లు పేర్కొంది.
ప్రీమియం విభాగంలో 500 డాలర్లకు పైగా ధర ఉండే అమ్మకాల్లో.. గతేడాది కన్నా 35.4 శాతం లోటు నమోదైందని తెలిపింది. ఇందులో 48.8 శాతం షేర్‌తో యాపిల్ అగ్రస్థానంలో ఉండగా శాంసంగ్, వన్ ప్లస్ వరుస స్థానాల్లో నిలిచాయి. ఫీచర్ ఫోన్ షిప్మెంట్ కూడా గతేడాది కన్నా 69 శాతం తగ్గినట్లు ఐడీసీ వెల్లడించింది.