ఉత్తర భారతదేశంలో దీపావళి పండగను ఐదు రోజుల పాటు సంబరంగా జరుపుకొనే సంప్రదాయం ఉంది. ఈ పండగలోని మొదటి రోజునే ధన త్రయోదశిగా పిలుస్తారు. దీనినే 'ధన్‌తేరాస్' (Dhanteras 2021) అని కూడా అంటారు. హిందువులు లక్ష్మీదేవిని ఐశ్వర్య దేవతగా పూజిస్తారు. క్షీరసాగర మధనంలో ధనత్రయోదశి రోజున లక్ష్మీదేవి పాలసముద్రం నుంచి ఉద్భవించిందని హిందూ పురాణాలు చెబుతున్నాయి. అందుకనే ఈ రోజున లక్ష్మీదేవిని పూజిస్తారు. అలాగే ఈరోజున బంగారం కొంటే శుభప్రదం అని.. సంవత్సరం మొత్తం ఆ ఇల్లు ఐశ్వర్యంతో కళకళలాడుతుందని విశ్వసిస్తుంటారు. అందుకే ఏటా ఈ పర్వదినాన బంగారు, వెండి అమ్మకాలు రికార్డు స్థాయిలో జరుగుతుంటాయి. అయితే, గత ఏడాది కరోనా ప్రభావంతో బంగారు దుకాణాలన్నీ వెలవెలబోయాయి.
ఈ ఏడాది మాత్రం ప్రజలు పెద్దఎత్తున బంగారం కొనుగోలు చేశారు. మహారాష్ట్ర, గుజరాత్‌లోని నగల దుకాణాలు రద్దీగా మారాయి. ఇందుకు రెండు ప్రధాన కారణాలు ఉన్నట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు. పర్వదినం కావడం మొదటిది కాగా.. మరో వైపు బంగారం ధర తగ్గడం మరో కారణమని అంటున్నారు. గతేడాది కంటే కూడా ఇప్పుడు పుత్తడి ధర (Gold Price) మూడు వేలకు పైగా తగ్గిందని చెబుతున్నారు. దీపావళి పూజ కోసం సిల్వర్ కాయిన్స్నూ కొనుగోలు చేస్తున్నారని చెప్పారు.
ఇదిలా ఉంటే ఈసారి వినియోగదారులను ఆకట్టుకోవడమే లక్ష్యంగా వివిధ బంగారు విక్రయ సంస్థలు ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటించాయి. అవేంటో చూద్దాం..
జోయలుక్కాస్
రూ.25,000 విలువైన వజ్రాభరణాలు కొనుగోలు చేస్తే రూ.1,000 గిఫ్ట్ వౌచర్ ఆఫర్ చేస్తున్నారు. అక్కడి నుంచి ప్రతి రూ.25 వేలకు ఒక గిఫ్ట్ వౌచర్ ఇస్తారు. ఇక వెండిపై ప్రతి రూ.10,000, బంగారంపై ప్రతి రూ.50,000కు ఒక గిఫ్ట్ వౌచర్ అందుబాటులో ఉంది. ఆ ఆఫర్ నవంబరు 5 వరకు అందుబాటులో ఉంటుంది.
తనిష్క్
టాటా గ్రూప్ ఆధ్వర్యంలోని ఈ సంస్థ.. ఆభరణాల తయారీ ఖర్చులపై 20 శాతం వరకు రాయితీ ఇస్తోంది. అక్టోబరు 17న ప్రారంభమైన ఈ ఆఫర్ నేటితో ముగియనుంది.
మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్
రూ.30,000 విలువ చేసే బంగారు నగలు కొనుగోలు చేస్తే ఒక గ్రాము బంగారు నాణేన్ని ఆఫర్ చేస్తున్నారు. అక్కడి నుంచి ప్రతి రూ.30 వేల కొనుగోలుపై ఒక నాణెం లభిస్తుంది. ఇక వజ్రాభరణాల విషయానికి వస్తే ప్రతి రూ.30,000 కొనుగోలుపై రెండు బంగారు నాణేలు ఇస్తున్నారు. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు వినియోగదారులకు మరో ఐదు శాతం అదనపు క్యాష్‌బ్యాక్ లభిస్తోంది.
పీసీ జువెల్లర్
బంగారు నగల తయారీ ఖర్చులపై పీసీ జువెల్లర్ 30 శాతం వరకు రాయితీ ఇస్తోంది. వెండి నగలు, వస్తువులపై కూడా రాయితీ ఉంది. అలాగే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డుతో కొనుగోళ్లు చేసేవారు రూ.7.5 శాతం వరకు క్యాష్‌బ్యాక్ కూడా పొందొచ్చు. అయితే, కనీసం రూ.50 వేలు విలువ చేసే షాపింగ్ చేయాల్సి ఉంటుంది. ఇక వివిధ క్రెడిట్ కార్డులపై రూ.7,500, డెబిట్ కార్డులపై రూ.5,000 వరకు క్యాష్‌బ్యాక్ ఉంది. నవంబరు 7 వరకు ఈ ఆఫర్లు కొనసాగనున్నాయి.
సెంకో గోల్డ్ అండ్ డైమండ్
ఈ నగల కంపెనీ బంగారు ఆభరణాలపై ఒక్కో గ్రాముకు రూ.225 రాయితీ ఇస్తోంది. దీంట్లో రూ.100 నగదు రాయితీ కాగా.. మరో రూ.125 విలువ చేసే వెండి వస్తువులను ఆఫర్ కింద ఇస్తారు. బంగారు ఆభరణాలపై తయారీ ఛార్జీలను పూర్తిగా ఎత్తివేశారు. ఇక వజ్రాభరణాల తయారీపై 75 శాతం వరకు రాయితీ ఇస్తున్నారు. ఇవన్నీ పరిమితకాల ఆఫర్లు మాత్రమే.
రాయితీలు, జీరోమేకింగ్ ఛార్జీలు, క్యాష్‌బ్యాక్ అంటూ బంగారు దుకాణాలు ఎన్ని ఆఫర్లు ఇచ్చినా... పసిడి కొనేటప్పుడు ఆచితూచి అడుగేయాల్సిందే. ప్రతి రూపాయీ లెక్కేసుకోవాల్సిందే. స్వచ్ఛమైన బంగారాన్ని సరిగ్గా గుర్తించాలి. హాల్‌మార్క్ ముద్రని తప్పనిసరిగా చెక్ చేసుకోవాలి. నిబంధనల ప్రకారం.. ప్రతి ఆభరణం మీదా బీఐఎస్ ముద్ర, నాణ్యత, హాల్‌మార్కింగ్ సెంటర్ గుర్తు, ఏ సంవత్సరంలో ఆ ముద్ర వేశారు, నగ అమ్మిన సంస్థ లోగో.. వంటి మొత్తం ఐదు గుర్తులు ఉండాలి.
ఇదీ చూడండి: 'టపాసులు లేకుండానే దీపావళి.. మెజార్టీ ప్రజల ఆలోచన ఇదే!'