నైట్ ఫ్రాంక్ తాజా నివేదిక ప్రకారం.. ప్రపంచంలో గృహాల ధరల పెరుగుదల విషయంలో భారత్ 47వ స్థానంలో నిలిచింది. డిమాండ్ సరిగ్గా లేక జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో హౌసింగ్ రేట్లు 0.6 శాతం మాత్రమే పెరగడం ఇందుకు కారణం.
గ్లోబల్ ప్రోపర్టీ కన్సల్టెంట్ 'నైట్ ఫ్రాంక్'... గ్లోబల్ హౌస్ ప్రైస్ ఇండెక్స్ క్యూ-3 2019ని తాజాగా విడుదల చేసింది. 56 దేశాల్లో గృహాల ధరల పెరుగుదలను ఇది అధ్యయనం చేసింది.
డిమాండ్ లేక..
2019 ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో గృహాల ధరలు సంవత్సరానికి 7.7 శాతం పెరుగుదలను నమోదుచేశాయి. ఫలితంగా అప్పుడు భారత్ 11వ స్థానంలో నిలిచింది. కానీ ప్రస్తుతం త్రైమాసికంలో 47వ స్థానానికి దిగజారింది.
గృహాల సంఖ్య అధికంగా ఉన్నా, అమ్మకాల్లో మందగమనం, నిర్మాణదారులకు ద్రవ్యలభ్యత లేకపోవడం.. గృహాల ధరల పెరుగుదలను పరిమితం చేశాయని నివేదిక పేర్కొంది.
వ్యవస్థలో జవాబుదారీతనం కోసం భారత ప్రభుత్వం.. రియల్ ఎస్టేట్ (రెగ్యులేషన్స్ అండ్ డెవలప్మెంట్) చట్టం-2016, జీఎస్టీ, బినామీ లావాదేవీల (నిషేధ) సవరణ చట్టం-2016 తీసుకొచ్చింది. ఇవి మార్కెట్ అభివృద్ధికి బాటలు వేశాయి.
రియల్ ఎస్టేట్ డెవలపర్లు ధరలను వాస్తవికంగా ఉంచడంపై దృష్టి సారించారని, తుది వినియోగదారులను ఆకర్షించడంలో, కొనుగోలుదారుల విశ్వాసాన్ని మెరుగుపరుచుకోవడంలో ఇది ఉపకరిస్తుందని నైట్ ఫ్రాంక్ ఇండియా సీఎమ్‌డీ బైజుల్ అభిప్రాయపడ్డారు.
ప్రపంచంలో..
నైట్ ఫ్రాంక్ నివేదిక ప్రకారం, ఈ త్రైమాసికంలో 15.4 శాతం వార్షిక ధరల పెరుగుదలతో హంగరీ ప్రథమ స్థానంలో ఉంది. తరువాత లక్సెంబర్గ్ (11.4 శాతం), క్రొయేషియా (10.4 శాతం) ఉన్నాయి. 7వ స్థానంలో చైనా (8.5 శాతం), 10వ స్థానంలో రష్యా (8.1 శాతం) ఉన్నాయి.
ఈ 56 దేశాల్లో గృహ ధరలు సగటున 3.7 శాతం వార్షిక రేటుతో పెరిగాయి. గత ఆరు సంవత్సరాల ఇండెక్స్ చూస్తే.. వృద్ధి రేటు బాగా తగ్గినట్లు స్పష్టం చేస్తుంది. అయితే మెజారిటీ దేశాలు, భూభాగాల్లో 2019 సెప్టెంబర్ వరకు స్థిరమైన లేదా సానుకూల వృద్ధి నమోదైందని నివేదిక స్పష్టం చేసింది.
ఇదీ చూడండి: రూపాయి అస్థిరతతో.. స్వల్పంగా పెరిగిన పసిడి ధరలు