మెల్బోర్న్ మెర్సెల్ గ్లోబల్ పెన్షన్ ఇండెక్స్ (ఎంఎంజీపీఐ) తాజాగా తన నివేదికను విడుదల చేసింది. ఇందులో పౌరులకు పెన్షన్, పదవీ విరమణ ప్రయోజనాలను అందించే విషయంలో భారత్ తన ర్యాంకింగ్‌ను గతేడాదితో పోల్చుకుంటే స్వల్పంగా మెరుగుపరుచుకుని 32వ స్థానానికి చేరుకుంది. 2018లో భారత్... ఎంఎంజీపీఐ స్కోర్ 44.6 ఉండగా 2019లో 45.8కి పెరిగింది.
ఎంఎంజీపీఐ 37 దేశాల్లో ఈ సర్వే చేసింది. ఆయా దేశాలు.. వివిధ ఆదాయవర్గాల పౌరులకు పెన్షన్, పదవీ విరమణ ప్రయోజనాలను ఎలా అందిస్తున్నాయో పరిశీలించి ఈ నివేదిక రూపొందించింది.
కాస్త మెరుగు!
2018లో ఎంఎంజీపీఐ ర్యాంకింగ్స్‌లో మొత్తం 34 దేశాలకుగాను భారత్ 33వ స్థానంలో నిలిచింది. 2019లో కాస్త మెరుగుపడి 37 దేశాల జాబితాలో 32వ ర్యాంక్ సాధించింది. సమర్థత, స్థిరత్వం, సమగ్రత అనే మూడు ఉపసూచికల్లో మెరుగుదల కారణంగా భారత్ మెరుగైన ర్యాంక్ సాధించింది.
ఇదీ కారణం
ఇండెక్స్ ప్రకారం... నికర గృహ పొదుపు, పార్ట్‌టైమ్ జాబ్ అవకాశాలు పెరగడం, పదవీ విరమణ విషయంలో ఎక్కువ సౌలభ్యం ఉండటం, పాలనలో స్థిరమైన పురోగతి, ప్రైవేట్ పెన్షన్ ప్రణాళికలు వంటి అంశాల్లో స్కోర్లు స్వల్పంగా పెరగడం వల్ల ఈసారి భారత్ ర్యాంక్ మెరుగుపడింది.
ఏపీవై
ఎంఎంజీపీఐ... అటల్ పెన్షన్ యోజన (ఏపీవై) గురించి ఉదహరించింది. అసంఘటిత రంగంలోని 40 ఏళ్లలోపు పౌరులందరూ పదవీ విరమణకు ముందు పొదుపు చేయడాన్ని ఏపీవై ప్రోత్సహిస్తోంది. ఫలితంగా వారికి పెన్షన్ సౌకర్యం లభిస్తుంది. అలాగే వివిధ అసంఘటిత రంగాలవారి కోసం కేంద్రం ప్రవేశపెట్టిన పీఎమ్ కరంయోగి మాన్‌ధన్ పథకం, పీఎమ్ కిసాన్ పెన్షన్ యోజన, ప్రధానమంత్రి శ్రమయోగి మాన్ధన్ల గురించీ ఇండెక్స్ పేర్కొంది.
ప్రథమ స్థానంలో నెదర్లాండ్స్
మెల్బోర్న్ మెర్సెల్ గ్లోబల్ పెన్షన్ ఇండెక్స్‌లో నెదర్లాండ్స్ 81 స్కోర్‌తో ప్రథమస్థానంలో ఉండగా, థాయిలాండ్ 39.4 స్కోర్‌తో చివరి స్థానంలో నిలిచింది.
సబ్-ఇండెక్స్‌లో... సమర్థతకు ఐర్లాండ్ 81.5, సుస్థిరతకు డెన్మార్క్ 82, సమగ్రతకు ఫిన్లాండ్ 92.3 స్కోర్‌తో అగ్రస్థానంలో నిలిచాయి. కాగా సమర్థతలో థాయిలాండ్ 35.8, సమగ్రతలో ఫిలిప్పీన్స్ 34.7, సుస్థిరతలో ఇటలీ 19 స్కోర్‌తో అథమస్థానాల్లో నిలిచాయి.
ఇదీ చూడండి: దిల్లీ వైపు నితీశ్ చూపు.. రాష్ట్ర హోదాకు డిమాండ్