2019లో అత్యధికంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డీఐ) ఆకర్షించిన దేశాల జాబితాలో భారత్ తొమ్మిదో స్థానంలో నిలిచిందని ఐరాసకు చెందిన 'కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్' (యూఎన్‌సీటీఏడీ) నివేదిక పేర్కొంది. ఆసియాలో అయితే ఎఫ్‌డీఐల ఆకర్షణలో భారత్ ఐదో స్థానంలో ఉందని స్పష్టం చేసింది.
సానుకూల వృద్ధి!
2018లో 42 బిలియన్ డాలర్ల ఎఫ్‌డీఐలతో 12వ స్థానంలో ఉన్న భారత్.. 2019లో 51 బిలియన్ డాలర్ల ఎఫ్‌డీఐలను ఆకర్షించగలిగిందని యూఎన్‌సీటీఏడీ తెలిపింది. కరోనా ప్రభావం ధాటికి 2020లో ప్రపంచవ్యాప్తంగా ఎఫ్‌డీఐలు 40 శాతం మేర తగ్గే అవకాశముందని అంచనా వేసింది.
కరోనా కారణంగా భారత ఆర్థిక వృద్ధి మందగించినప్పటికీ... దేశంలోనికి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు కొనసాగుతాయని నివేదిక పేర్కొంది. మొత్తానికి సానుకూల వృద్ధి దిశగా భారత్ పయనిస్తుందని వెల్లడించింది.
ఇదీ చూడండి: 12 రోజుల్లో రూ.16 వేల కోట్ల ఎంఎస్ఎంఈ రుణాలు