కరోనా వ్యాప్తి నియంత్రణలో భాగంగా లాక్‌డౌన్ ప్రకటించడంతో ఆన్‌లైన్ వీడియోలకు డిమాండ్ భారీగా పెరిగింది. షికార్లు, థియేటర్లలో సినిమా ప్రదర్శనలపై నిషేధంతో నెట్టింట్లో సినిమా, సీరియళ్లు, కచేరీలతో ప్రజలు కాలక్షేపం చేస్తున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు అందుబాటులోని సినిమాలు, టీవీషోలను చూస్తూ గడుపుతున్నారు. మరోవైపు ఆన్‌లైన్ వీడియో సంస్థలు కొత్త చందాదారుల్ని ఆకట్టుకునేందుకు స్వల్పకాలానికి ఉచిత ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. గత వారం రోజుల్లోనే వీడియో డిమాండ్ 30శాతం వరకు పెరిగింది. సినిమా థియేటర్లు మూసివేయడంతో ఆన్‌లైన్ టికెట్లు విక్రయించే సంస్థలు ఆన్‌లైన్ లైవ్ కచేరీలు నిర్వహిస్తున్నాయి.
కొత్త సినిమాలు, టీవీషోలకు ఇప్పుడు అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్, ఈటీవీ-విన్, జీ, యూట్యూబ్ తదితర సంస్థలు ప్రాచుర్యం పొందాయి. కొత్త సినిమాలు థియేటర్లలో విడుదలైన కొద్దిరోజుల్లోనే ఆన్‌లైన్ వీడియో ప్లాట్‌ఫామ్‌కు వస్తున్నాయి. యువతలో ఈ వీడియో యాప్‌లకు విపరీతమైన డిమాండ్ ఉంది. ఈ-టీవీ విన్‌లో సీరియళ్లు, షోలు, సినిమాలు ఇప్పటికే ఉచితంగా లభిస్తున్నాయి.
అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్ తదితర సంస్థలు నెలవారీ, వార్షికప్లాన్‌లు తీసుకుంటే వీక్షించేందుకు అవకాశం ఉంటుంది. ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్లలో ఈ యాప్‌లు సాధారణమయ్యాయి. స్మార్ట్ టీవీ, మొబైల్, ట్యాబ్‌ల్లో ఎక్కడైనా రిజిస్టర్ చేసి వీక్షించవచ్చు.
పెరిగిన బ్రాడ్‌బ్యాండ్ వినియోగం
ఆన్‌లైన్ వీడియోలకు డిమాండ్ పెరగడంతో అదే సమయంలో బ్రాడ్‌బ్యాండ్ వినియోగం రద్దీ సమయాల్లో రోజువారీ డిమాండ్ కన్నా 30-40 శాతం ఎక్కువ ఉన్నట్లు సర్వేలు చెబుతున్నాయి.
ఒకేసారి బ్రాడ్‌బ్యాండ్, వీడియోకు డిమాండ్ పెరగడంతో కొన్నిసార్లు వీడియో స్ట్రీమింగ్‌లో అంతరాయం కలుగుతోంది. ఇద్దరు ముగ్గురు స్నేహితులు కలిసి నెలవారీ రూ.199 నుంచి రూ.499 లేదా వార్షిక ప్లాన్ రూ.999 తీసుకునేవారు. ప్లాన్, ఆన్‌లైన్ వీడియో స్ట్రీమింగ్ సంస్థ నిబంధనల మేరకు ఒక రిజిస్టరు ఐడీతో ఒకేసమయంలో ఒకటి లేదా రెండు ఫోన్లు, టీవీ, ట్యాబ్‌ల్లో సినిమాలు చూసేందుకు అవకాశం ఉంటుంది.
తాజాగా స్నేహితులందరికీ సెలవులు దొరకడం, సామాజిక దూరం పాటించాల్సి రావడంతో నెల రోజుల వ్యవధి కోసం కొత్త కనెక్షన్లు తీసుకుంటున్నారు. ఆన్‌లైన్ టికెట్లు విక్రయించే బుక్‌మై షో లాంటి సంస్థలు ఇంటి నుంచే కామెడీ, మ్యూజిక్, గేమ్‌షోలు వీక్షించే సదుపాయాన్ని కల్పిస్తున్నాయి.
ఇదీ చదవండి:కావాల్సినన్ని సరకులు ఉన్నాయ్!