Nominee for Gold Loans: ఆర్థికంగా ఏదైనా అత్యవసరం ఏర్పడినప్పుడు వెంటనే గుర్తుకువచ్చేది బంగారం. దీన్ని హామీగా ఉంచి, బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి అప్పు తీసుకుంటారు చాలామంది. ఇలా రుణం తీసుకునేటప్పుడు నామినీ పేరు తెలియజేయకపోవడంతో కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు వస్తున్నాయి. ఇలాంటి చిక్కులు రుణగ్రహీతలకు ఎదురవ్వకూడదంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి.
సాధారణంగా బ్యాంకు ఖాతా, డీమ్యాట్, ఇన్సూరెన్స్, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, ఇతర పెట్టుబడులన్నింటికీ నామినీ పేరు రాస్తుంటారు. అయితే, కొన్ని రకాల రుణాలకు నామినీ పేరుతో అవసరం ఉండదు. రుణం తీసుకున్న వ్యక్తికి అనుకోనిదేమైనా జరిగినప్పుడు.. హామీగా ఉంచిన బంగారాన్ని నామినీ క్లెయిం చేసుకునేందుకు వీలవుతుంది. నామినీ పేరు లేకపోతేనే చిక్కులు వస్తున్నాయి. చాలా సందర్భాల్లో రుణం తీసుకున్న వ్యక్తి కుటుంబ సభ్యులకు బంగారాన్ని ఎక్కడ హామీగా పెట్టారనే సమాచారం ఉండటం లేదు. బ్యాంకుల్లో ఏడాదిలోపు ఈ రుణాన్ని తీర్చడం లేదా పునరద్ధరించుకోవడం చేయాలి. ఆర్థిక సంస్థలలో నెలనెలా వడ్డీ చెల్లిస్తూ ఉండాలి. నిర్ణీత కాలం తర్వాత వడ్డీ, అసలు చెల్లించకపోతే బంగారం రుణాలను నిరర్ధక ఆస్తులుగా పరిగణిస్తారు. బ్యాంకు నుంచి, ఆర్థిక సంస్థ నుంచి నోటీసులు వచ్చినప్పుడు వారసులు దాన్ని గుర్తించకపోతే.. బంగారాన్ని ఆయా సంస్థలు వేలం వేసేందుకు ప్రయత్నిస్తాయి. రుణం సంగతి తెలుసుకుని, కుటుంబ సభ్యులు బ్యాంకులు/ఆర్థిక సంస్థలను సంప్రదించి, మొత్తం రుణం తీర్చేసినా.. బంగారం వెనక్కి ఇచ్చేందుకు వారసత్వ ధ్రువీకరణలాంటివి అవసరం.
ఏం చేయాలంటే..
Gold Loans News: పసిడి రుణాలకు నామినీ పేరు పేర్కొనాలని బ్యాంకులు పేర్కొంటున్నాయి. బ్యాంకింగేతర సంస్థల్లో ఈ నిబంధనను కొన్ని పట్టించుకోవడం లేదు. ఇప్పటికే రుణం తీసుకున్నవారు నామినీ పేరు ఉందో లేదో చూసుకోండి. లేకపోతే బ్యాంకును సంప్రదించి, ఆ వివరాలను నమోదు చేయించండి. కొత్తగా రుణం తీసుకుంటున్న వారు.. నామినీ పేరును రాయడం మర్చిపోవద్దు.
ఇదీ చదవండి: భారీగా తగ్గుతున్న బంగారం ధర.. ఎక్కడ ఎంతంటే..?