కొవిడ్-19 టీకా ఆవిష్కరణకు హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న మరొక సంస్థ సిద్ధమవుతోంది. టీకాల తయారీలో అగ్రగామి సంస్థల్లో ఒకటైన ఇండియన్ ఇమ్యునలాజికల్స్ లిమిటెడ్ (ఐఐఎల్), ఆస్ట్రేలియాకు చెందిన గ్రిఫిత్ యూనివర్సిటీతో కలిసి కొవిడ్-19 టీకా తయారీ యత్నాలను ముమ్మరం చేసింది. ప్రస్తుతం ఈ టీకాను జంతువులపై ప్రయోగిస్తున్నారు. మానవులపై ప్రయోగాలు త్వరలో ప్రారంభయ్యే అవకాశం ఉంది. ఈ ప్రయోగాలను సత్వరం పూర్తిచేసి, సాధ్యమైనంత త్వరగా టీకా తీసుకు రావాలని భావిస్తున్నట్లు ఐఐఎల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కె.ఆనంద్ కుమార్ 'ఈనాడు'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ఎన్‌డీడీబీ (నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డు)కు అనుబంధంగా ఏర్పాటైన ఐఐఎల్, గత ఇరవై ఏళ్లుగా 'హ్యూమన్ వ్యాక్సిన్స్' విభాగంలో కార్యకలాపాలు సాగిస్తోంది.
రేబిస్, డీపీటీ, డీటీ, టీటీ, హెపటైటిస్-బి టీకాలను పెద్దఎత్తున ఈ సంస్థ తయారు చేస్తోంది. కొవిడ్-19 పై మనదేశం చేస్తున్న పోరాటంలో తమ సంస్థ క్రియాశీలక పాత్ర పోషించడానికి సన్నద్ధమవుతున్నట్లు డాక్టర్ ఆనంద్ కుమార్ వివరించారు. ప్రజలందరికీ టీకా ఇవ్వటం ద్వారానే కొవిడ్ ముప్పును తప్పించుకోగలమని అభిప్రాయపడ్డారు.
ఇంటర్వ్యూ ముఖ్యాంశాలివీ..
కొవిడ్-19తో మనదేశం సహా ప్రపంచం తల్లడిల్లిపోతోంది. టీకాల తయారీలో ఎంతో అనుభవం ఉన్న ఐఐఎల్ దీనికి ఏవిధంగా స్పందిస్తోంది?
మా సంస్థ దాదాపు రెండు దశాబ్దాలుగా టీకాల తయారీలో నిమగ్నమై ఉంది. పలు రకాల టీకాలు అందిస్తున్నాం. గత ఏడాది కాలంలో ఎన్నో ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనా, మా కార్యకలాపాలను కొనసాగించాం. టీకాల తయారీ, పంపిణీ.. వ్యవహారాల్లో కొత్త పద్ధతులు ఆవిష్కరించాం. ఇవన్నీ ఒక ఎత్తు. కొవిడ్-19 టీకా ఆవిష్కరణ యత్నాలు మరొక ఎత్తు. అన్నీ మా ప్రణాళిక ప్రకారం జరిగితే త్వరలోనే టీకా ఆవిష్కరించగలం.
కొవిడ్-19 టీకా తయారీ ప్రస్తుతం ఏ దశలో ఉంది?
'లైవ్ అటెన్యుయేటెడ్ వ్యాక్సిన్' తయారీకి మేం ప్రయత్నిస్తున్నాం. దీనికి సంబంధించి ఆస్ట్రేలియాకు చెందిన గ్రిఫిత్ యూనివర్సిటీతో కలిసి పనిచేస్తున్నాం. ఈ ప్రయోగాలు సంతృప్తికరంగా సాగుతున్నాయి. మూడు 'కార్డన్ డీఆప్టిమైజ్డ్ కొవిడ్-19 వ్యాక్సిన్' కేండిడేట్స్‌ను ప్రస్తుతం జంతువులపై ప్రయోగిస్తున్నాం. మనదేశంతో పాటు అమెరికాలో ఈ ప్రయోగాలు జరుగుతున్నాయి. త్వరలో మనదేశంలో, ఆస్ట్రేలియాలో మానవులపై ప్రయోగాలు (ఫేజ్-1, ఫేజ్-2) మొదలు పెట్టే అవకాశం ఉంది.
ఈ మధ్య ఐఐఎల్, భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఇది 'కొవాగ్జిన్' టీకా తయారీకి సంబంధించినదేనా?
మన దేశంలో జనాభా ఎక్కువ. అందరికీ టీకా ఇవ్వాలంటే పెద్దఎత్తున తయారీ అవసరం. ప్రస్తుతం టీకా కొరత సమస్యగా మారింది. అందువల్ల టీకాలో వినియోగించే 'ఔషధ పధార్థాలు' తయారు చేయడానికి భారత్ బయోటెక్‌తో మేం ఒప్పందం కుదుర్చుకున్నాం. ఈ పదార్థాలతో భారత్ బయోటెక్ తన కొవాగ్జిన్ టీకా తయారు చేస్తుంది. మామూలుగా అయితే టీకాల మార్కెట్లో మేం పరస్పరం పోటీపడతాం. కానీ ప్రస్తుతం మనదేశం ఎదుర్కొంటున్న పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని, కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నాం. ఇదే కాకుండా మాకు ఉన్న యూనిట్లలో ఒకదాన్ని 'కొవాగ్జిన్' టీకా తయారీకి అనుగుణంగా మార్పులు చేస్తున్నాం.
కొవిడ్-19 టీకా తయారీలో వినియోగించే ముడిపదార్థాలను మీరు తయారు చేయాలనుకుంటున్నారా?
అటువంటి ఆలోచన లేదు. ప్రధానంగా మాది టీకాల తయారీ కంపెనీ. అందులోనే మాకు నైపుణ్యం ఉంది. అందువల్ల టీకాల తయారీ మీదే దృష్టి కేంద్రీకరిస్తున్నాం.
టీకా తయారీ కంపెనీలకు ఆర్థికంగా చేయూత నిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక నిధి ఏర్పాటు చేసింది. దాని నుంచి మీరు ఏమైనా నిధులు అడిగారా?
అవును, కొంత నిధులు విడుదల చేయాలని కోరాం. డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని భావిస్తున్నాం.
కొవిడ్ రెండోదశ ముప్పు అత్యంత తీవ్రంగా ఉండటంపై మీ విశ్లేషణ ఏమిటి? దీన్నుంచి రక్షణ పొందడం ఎలా?
టీకా తీసుకోవడమే చాలా వరకు పరిష్కారం. అంచనాల కంటే కొవిడ్-19 రెండోదశ ముప్పు ఎంతో ఎక్కువగా ఉంది. ఈ పరిస్థితుల్లో ప్రజలందరికీ త్వరగా టీకా ఇవ్వాలి. వైరస్ మ్యూటెంట్లు మారినప్పటికీ టీకా తీసుకోవడంతో పాటు, అన్ని రకాల ఆరోగ్యపరమైన జాగ్రత్తలు, పరిశుభ్రత పాటిస్తే.. కొవిడ్-19 ముప్పు నుంచి చాలా వరకు తప్పించుకోవచ్చు.
ఇవీ చదవండి: 'వినూత్న మార్గాల్లో 'ఆపరేషన్ ఆక్సిజన్''