పెట్టుబడుల జాబితాలో ఎన్ని పథకాలున్నా.. అందులో బంగారం లేకపోతే అది అసంపూర్ణమే. చరిత్రను పరిశీలిస్తే.. అనిశ్చితిని, ద్రవ్యోల్బణాన్ని తట్టుకునే శక్తి ఉన్నది కేవలం పసిడికే అనేది స్పష్టంగా తెలుస్తుంది. ప్రస్తుతం మన దేశంతో పాటు, ప్రపంచమంతా ఆర్థిక సంక్షోభం తీవ్రంగా ఉంది. ఈ కష్ట సమయంలో బంగారంలో మదుపు చేస్తే.. భవిష్యత్తులో ఎదురయ్యే నష్టాలను పరిమితం చేసుకునేందుకు వీలవుతుంది. పసిడిలో మదుపు చేసేందుకు అనేక మార్గాలున్నాయి. వీటిలో మన లక్ష్యాలకు ఏది సరిపోతుందో తెలుసుకోవాలి. అప్పుడే మనం ఆశించిన ఫలితం దక్కుతుంది. మరి, దాని కోసం మనం అనుసరించాల్సిన వ్యూహాలేమిటో చూద్దాం...
ఐదేళ్లలో రెట్టింపైన పసిడి..
ప్రస్తుతం పది గ్రాముల బంగారం ధర రూ.51,000 దరిదాపుల్లో ఉంది. ఆగస్టు 6, 2015 నాడు దీని ధర రూ.24,562 దగ్గర ఉంది. అంటే, ఈ ఐదేళ్లలో దాదాపు రెట్టింపు కన్నా ఎక్కువే పెరిగింది. 2019లోనూ కనిష్ఠ ధర రూ.31,200 మాత్రమే. అంటే.. ఏడాదిలో దాదాపు ధర 60 శాతం వరకూ పెరిగింది. పసిడి ధర భారీగా పెరగడానికి దేశీయంగానూ, అంతర్జాతీయంగానూ ఆర్థిక పరిస్థితుల్లో నెలకొన్న అనిశ్చితే ప్రధాన కారణం. జనవరి 1, 2020 నాడు పది గ్రాముల పసిడి ధర రూ.38,977గా నమోదయ్యింది. గత ఆరు నెలల్లోనే ఇది రూ.50 వేలను దాటేసింది. కొన్ని నెలల్లో పరిస్థితులన్నీ సర్దుకోకపోతే.. కాంచనం ధర మరింత పెరిగే అవకాశం లేకపోలేదు.
మార్గమేమిటి?
బంగారం ధర ఎప్పటికప్పుడు పెరుగుతుండటం వల్ల చాలామంది మిగతా అన్ని పెట్టుబడులకన్నా దీనికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. అందులోనూ మేలిమి బంగారం, నగలు, నాణేలు కొనేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇలా నేరుగా బంగారం కొనడం కొంత ఇబ్బందికరమే. ధర అధికంగా ఉండటం ఒక కారణమైతే.. నగల నాణ్యత విషయంలోనూ కొన్ని అనుమానాలు తలెత్తవచ్ఛు ప్రముఖ, విశ్వసనీయ విక్రయ కేంద్రాల్లో కొన్నప్పుడు సందేహాలు ఉండవనుకోవచ్ఛు బంగారం ధరతోపాటు మజూరీ, జీఎస్‌టీలాంటివి అదనంగా భరించాలి. పెట్టుబడి దృష్టితో బంగారాన్ని కొన్నప్పుడు వీటివల్ల మనకు వచ్చే లాభాల్లో కొంత క్షీణత కనిపిస్తుంది. ఇక డిజిటల్ రూపంలో మదుపు చేయాలని భావించినప్పుడు.. గోల్డ్ ఈటీఎఫ్‌లను పరిశీలించవచ్ఛు ఇవి డీమ్యాట్‌లో ఉంటాయి కాబట్టి, భద్రపర్చుకోవడం సులభం. వెంటనే నగదుగా మార్చుకునేందుకూ వీలుంటుంది. దీర్ఘకాలిక మూలధన రాబడిపై ద్రవ్యోల్బణ సూచీతో సర్దుబాటు చేసి, 20శాతం వరకూ పన్ను చెల్లించాల్సి వస్తుంది.
సార్వభౌమ పసిడి బాండ్లలో..
ఆర్‌బీఐ జారీ చేసే సార్వభౌమ పసిడి బాండ్లలోనూ మదుపు చేసేందుకు అవకాశం ఉంది. దీనిపై 2.5 శాతం వార్షిక వడ్డీ లభిస్తుంది. మిగతా ఏ ఇతర పసిడి పథకాల్లో పెట్టుబడి పెట్టినా.. ఇలాంటి అవకాశం లేదు. ఎప్పటికప్పుడు తీసుకున్న వడ్డీని.. వ్యక్తిగత ఆదాయంలో కలిపి చూపించి, ఆదాయపు పన్ను మొత్తాన్ని గణించాల్సి వస్తుంది. వ్యవధి తీరాక వచ్చే రాబడి మొత్తంపై ఎలాంటి మూలధన రాబడి పన్ను ఉండదు. ఈ బాండ్లు స్టాక్ ఎక్స్ఛేంజీలలో నమోదవుతాయి. కాబట్టి, మదుపరులు అవసరమైనప్పుడు విక్రయించి, పెట్టుబడి మొత్తాన్ని వెనక్కి తీసుకునే వీలుంది.
పెట్టుబడి ఎంత?
ప్రతి పెట్టుబడికీ ఒక లక్ష్యం ఉంటుంది. కొన్ని అధిక రాబడిని ఆర్జించేందుకు ఉపయోగపడతాయి. మరికొన్ని స్థిరంగా ఉంటాయి. ఇలా అనేక పెట్టుబడి పథకాలు కలిసి.. అనుకున్న వ్యవధిలో మీ లక్ష్య సాధనకు తోడ్పడతాయి. మీ వయసు, ఆదాయం, నష్టభయం భరించే సామర్థ్యం, వ్యవధి, నగదు అవసరాలు, ఆశిస్తున్న రాబడి తదితరాలను చూసుకొని, వైవిధ్యమైన పెట్టుబడులను ఎంచుకోవాలి. బంగారంలో మదుపు చేయడం ద్వారా వచ్చే లాభాలను వదులుకోకూడదు. అదే సమయంలో మన మొత్తం పెట్టుబడుల్లో 10 శాతం వరకే దీనికి కేటాయించడం ఉత్తమమని చెప్పొచ్ఛు పోర్ట్‌ఫోలియోలో సరైన నిష్పత్తిలో బంగారం ఉంటే.. ఎలాంటి హెచ్చుతగ్గులు వచ్చినా.. అందులో స్థిరత్వం ఉంటుంది. అదే సమయంలో మార్కెట్లో ఉన్న ఇతర పెట్టుబడి అవకాశాలను దూరం చేసుకోవద్ధు వైవిధ్యమే మన పెట్టుబడులకు రక్ష అనే విషయాన్ని ఎప్పుడూ మర్చిపోవద్ధు.
ఇలా చేస్తే మేలు..
ఒకేసారి మొత్తం డబ్బును బంగారంలో మదుపు చేయడం అంత మంచిది కాదు. దీనికన్నా.. వ్యూహాత్మకంగా దశలవారీగా పెట్టుబడి పెట్టడంద్వారా కలిసొస్తుంది. ప్రస్తుతం మన దేశంలో పసిడి ధర రికార్డు స్థాయికి చేరింది. ఇలాంటప్పుడు ఒకేసారి పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తే.. ధర తగ్గినప్పుడు నష్టపోయే ఆస్కారం ఉంది. దీనికి బదులుగా ప్రతి నెలా లేదా మూడు నెలలకోసారి డిజిటల్ రూపంలో బంగారాన్ని కొనాలి. దీనివల్ల మీ ఉన్న నగదు ఒకేసారి వెళ్లిపోకుండా చూసుకోవచ్ఛు దీర్ఘకాలంలో మీ పసిడి పెట్టుబడులకు రూపాయి సగటు ప్రయోజనమూ లభిస్తుంది. స్టాక్ మార్కెట్లో సార్వభౌమ పసిడి బాండ్లను కొనుగోలు చేయొచ్ఛు లేదా ఇవి అందుబాటులోకి వచ్చినప్పుడూ కొనుగోలు చేయొచ్ఛు 2020-21 ఆర్థిక సంవత్సరంలో నాలుగో విడత సార్వభౌమ పసిడి బాండ్లు జులై 14 వరకూ అందుబాటులో ఉన్నాయి. వీటి యూనిట్ ధరను రూ.4,852గా నిర్ణయించారు. ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసిన వారికి రూ.50 రాయితీ లభిస్తుంది. ఐదో విడత బాండ్లు ఆగస్టు 3 నుంచి అందుబాటులోకి వస్తాయి.
(రచయిత:అధిల్ శెట్టి, సీఈఓ, BankBazaar.com)