జీవిత బీమా ముఖ్య ఉద్దేశం పాలసీదారు కుటుంబానికి రక్షణ కల్పించడం. పాలసీదారుకు అనుకోకుండా ఏదైనా జరిగితే తదనంతర పరిణామాలను ఎదుర్కొనేందుకు కుటుంబం సంసిద్ధంగా ఉండాలి. అందుకు ఆర్థిక చేయూత ఉండాలి. వీటన్నింటిని జీవిత బీమా నెరవేరుస్తుంది. కుటుంబ సభ్యులకు క్లెయిం చేసే విధానంపై అవగాహన కల్పించడం ఎంతో ముఖ్యం. క్లెయిం విధానం ముందే తెలుసుకోవడం వలన అవసరమైన సందర్భంలో సరైన నిర్ణయాలు తీసుకొని పరిహారం సులువుగా పొందేందుకు వీలవుతుంది.
క్లెయిం సమయంలో ఎలాంటి డాక్యుమెంట్లు అవసరమవుతాయో, ఆ డాక్యుమెంట్లు పొందేందుకు ఎవరిని సంప్రదించాలో కూడా కుటుంబసభ్యులకు లేదా నామినీకి తెలియజేయడం మంచిది. జీవిత బీమా క్లెయిం విధానంలో ఏజెంట్ల పాత్ర ప్రముఖమైనది. వారు నామినీ లేదా కుటుంబసభ్యులకు సహాయంగా ఉండి మరీ క్లెయిం విధానాన్ని తెలిపి పరిహారం అందేలా చూసుకోవాలి. ఇది వారి బాధ్యత.
సేకరించాల్సిన వివరాలు:
పాలసీదారు మృతి చెందిన పక్షంలో చనిపోయిన తేదీ, స్థలం, అందుకు కారణాలను బీమా కంపెనీకి వీలయినంత త్వరగా తెలియజేయాలి. క్లెయిం కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఇన్సూరెన్స్ ఏజెంటు సహాయం తీసుకోవాలి. నామినీ లేదా కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు లేదా సమీప బంధువులు ఏజెంటును సంప్రదించేందుకు చొరవ చూపాలి.
అవసరమైన డాక్యుమెంట్లు:
- క్లెయిం కోసం సంప్రదించాక బీమా కంపెనీ కొన్ని డాక్యుమెంట్లను కోరవచ్చు. అవేమిటంటే…
- పూర్తి చేసిన క్లెయిం ఫారం. ఈ ఫారంను బీమా సంస్థ అందిస్తుంది.
- పాలసీదారు మరణ ధ్రువీకరణ పత్రం
- పాలసీ డాక్యుమెంట్
- నామినేషన్ లేదా పాలసీ అసైన్ చేసినట్టు ఆధారాలు
- నామినీ పేర్కొనకపోతే చట్టబద్ధ వారసుల వివరాలు
ఇవి కాకుండా అవసరమైతే మరికొన్ని అదనపు పత్రాలను కూడా బీమా సంస్థలు కోరవచ్చు. మెడికల్ సర్టిఫికెట్, ఆసుపత్రిలో చేరితే సంబంధిత సర్టిఫికెట్, పోలీస్ రిపోర్టు, పోస్ట్‌మార్టం రిపోర్టు తదితర పత్రాలు ఈ జాబితాలో ఉంటాయి. క్లెయింకు తగ్గట్టు ఈ పత్రాలను అందించాల్సి ఉంటుంది.
దరఖాస్తుల పరిశీలన:
బీమా సంస్థ సంబంధిత పత్రాలను అందుకున్నాక… సంస్థ తరఫు నుంచి అధీకృత అధికారిని పంపిస్తుంది. వారు వివరాలన్నీ సరిచూసుకొని కంపెనీకి తెలియజేస్తారు.
పరిహారం అందజేత:
పాలసీని బట్టి బీమా హామీ సొమ్ము ఎంతుందో దానికి తగినట్టు పరిహారం అందజేస్తారు. పరిహారాన్ని నామినీకి లేదా చట్టబద్ధ వారసులకు లేదా కుటుంబ సభ్యుల్లో ఒకరికి అందిస్తారు. క్లెయిం పరిహార సొమ్మును బ్యాంకు ఖాతాకు జమచేస్తారు. బ్యాంకు ఖాతాలో జమచేయడం వీలు కాని పక్షంలో చెక్కు ద్వారా ఇచ్చే ప్రయత్నం చేస్తారు.
క్లెయిం సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
- ముందుగానే పాలసీ డాక్యుమెంట్లను కావలసినవారికి అందుబాటులో ఉంచాలి.
- డెత్ క్లెయింలకు సంబంధించి మరణ ధ్రువీకరణ పత్రంలో వివరాలను సరిచూసుకోవాలి.
- క్లెయిం తిరస్కరణకు అనేక కారణాలు ఉంటాయి కాబట్టి అన్ని డాక్యుమెంట్లలోనూ పేరు, చిరునామా, తదితర వివరాలు ఒకేలా ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి.
మెచ్యూరిటీ క్లెయిం:
- బీమాతోపాటు పొదుపు అవకాశం ఉన్న పాలసీల విషయంలో మెచ్యూరిటీ గడువు సమీపిస్తుండగా ఈ విషయాన్ని బీమా సంస్థ పాలసీదారుకు తెలియజేస్తుంది.
- డిశ్ఛార్జి వోచర్ రూపంలో పాలసీదారుకు మెచ్యూరిటీ తీరనుందని లేఖలో సవివరంగా పేర్కొంటుంది.
- మెచ్యూరిటీ ముగిశాక ఎంత పరిహారం అందుతుందో, ఏ సమయానికి జమచేయబోతున్నారో కనీసం రెండు లేదా మూడు నెలల ముందుగానే తెలియజేస్తారు.
డిశ్ఛార్జి వోచర్ పై సంతకం:
డిశ్ఛార్జి వోచర్ అందుకున్న పాలసీదారు దానిని అంగీకరిస్తున్నట్టు సూచనగా సదరు వోచర్‌పై సంతకం చేయాల్సి ఉంటుంది. ఈ వోచర్ తోపాటు ఒరిజినల్ పాలసీ డాక్యుమెంట్లను బీమా సంస్థకు పంపించాలి. ఈ విధానాన్ని పాటించడం ద్వారా బీమా సంస్థ పరిహారం చెల్లించడంలో మన వంతుగా కృషి చేసినట్టవుతుంది.