- చంద్రమోహన్ ఓ ప్రైవేటు సంస్థలో మేనేజరు. రెండేళ్ల క్రితమే కారు కొన్నాడు. అందులోనే కార్యాలయానికి, అప్పుడప్పుడు కుటుంబంతో బయటకు వెళ్తాడు. కొత్త వాహనమే అయినా కొద్ది కాలానికే మైలేజ్ పడిపోవడంతోపాటు పెట్రోల్ భారం పెరిగింది. టైర్లు అరిగిపోవడం, ఇంజిన్‌లో శబ్దం వంటి ఇబ్బందులతో తరచూ మెకానిక్‌కు చూపిస్తున్నాడు. ప్రతిసారి రూ.1000-1500 ఖర్చవుతోంది. తనతోపాటు కారు కొన్న తోటి అధికారికి మాత్రం ఆ ఇబ్బంది లేదు. ఎందుకిలా?
- కళాశాలకు బైక్‌పై వెళ్లే హితేష్‌కు తన తండ్రి ఇచ్చిన పాకెట్ మనీ వాహన మరమ్మతులకే సరిపోతుంది.. నెల, రెండు నెలలకు బైకు క్లచ్‌ప్లేట్లు పోతున్నాయి. తోటి స్నేహితులకు అలాంటి పరిస్థితి లేదు..మరి హితేష్‌కే ఎందుకీ సమస్య?
కార్లు, ద్విచక్రవాహనాలను నిర్ణీత సమయం, కిలోమీటర్లు తిరిగిన తర్వాత సర్వీసింగ్ చేయించాలి. ఎయిర్ ఫిల్టర్లు, ఆయిల్ ఫిల్టర్లు, స్పార్క్ ప్లగ్‌లు, టైర్ రొటేషన్ పరిశీలించి...సక్రమంగా లేకపోతే మార్చాలి. దీనివల్ల 5 శాతం ఇంధనం ఆదా అవుతుంది.
అరిగిన టైర్లు, గాలి తక్కువగా ఉన్నప్పుడు నడిపినా పెట్రోల్ ఆవిరే.
ఒక్కసారిగా వేగాన్ని పెంచడం, బ్రేకులు ఎక్కువగా వాడితే 5-10 శాతం పెట్రోల్, డీజిల్ వృథాతోపాటు వాహన జీవితకాలం దెబ్బతింటుంది.
గేర్లు మార్చే సమయంలో మాత్రమే క్లచ్ వాడాలి. అదే పనిగా నొక్కి పట్టి ఉంచితే అదనంగా పెట్రోల్ ఖర్చు.. క్లచ్ ప్లేట్లు పాడైతే జేబుకు చిల్లు తప్పదు.
ఇంటి బయట వాహనం నిలిపితే కవర్ వేయాలి. వానకు తడిసినప్పుడు నీళ్లు బైక్‌లోని భాగాలకు చేరే ప్రమాదం ఉంది.
డౌన్‌లో బైక్ లేదా కారు వెళ్లేటప్పుడు కొందరు క్లచ్ మూస్తుంటారు. ఇంధనం 3-5 శాతం ఎక్కువ ఆవిరి అవుతుంది.
ఎలక్ట్రికల్ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. ధరలో తేడా ఉన్నా దీర్ఘకాలంలో నిర్వహణపరంగా చూసుకుంటే తక్కువే. ఉదా: ఒక పెట్రో కారుకు ప్రతి 10 వేల కి.మీ.కు ఇంధనంతో కలిపి రూ.40-45 వేలు ఖర్చయితే.. ఎలక్ట్రికల్ వాహనానికి రూ.15-18 వేలకు మించదని నిపుణులు తెలిపారు.
ఇంజిన్ కట్టేయండి
ట్రాఫిక్ సిగ్నల్స్, పార్కింగ్ స్థలాల వద్ద 2 నిమిషాల కంటే ఎక్కువ ఆగాల్సి వస్తే ఇంజిన్ ఆఫ్ చేయడం మేలు.
బైక్ ట్యాంకుపై చాలామంది కవర్ కూడా వేయరు. కొన్నిసార్లు లాక్ మూత ఉండదు. వర్షం పడే సమయంలో లాక్ రంధ్రం నుంచి నీళ్లు ట్యాంక్‌లోకి చేరే బండి స్టార్ట్ కాకుండా మొరాయిస్తుంది. మెకానిక్ వద్దకు వెళ్తే మళ్లీ ఖర్చే.
వేసవి లేదా అత్యవసర సమయంలో తప్ప మిగిలిన సమయంలో కారులో ఏసీ వినియోగం తగ్గించడం మంచిది. దీనివల్ల కూడా ఇంధనం ఆదా అవుతుంది.
తక్కువ దూరానికెందుకు..
చాలామంది తక్కువ దూరానికి బైక్ బయటకు తీస్తుంటారు. ప్రతి 5-10 కిలోమీటర్లకు కారుపై బయలుదేరుతారు. నడిచి వెళ్లగలిగే దూరమున్న ప్రదేశాలకు బండి తీయకపోవడమే మంచిది. రోజూ కారులో కాకుండా వారానికి ఒకటి రెండు సార్లు అన్ని జాగ్రత్తలతో ప్రజారవాణా ఉపయోగించుకోవచ్చు.
పాతబడిన, కండీషన్‌లో లేని సెకెండ్ హ్యాండ్ వాహనం తీసుకోవడం ఖర్చులను పెంచుకోవడమే. నెలకు వేలకు వేలు సర్వీసింగ్‌కే పోతుంది. కొత్త వాహనమైతే తొలి 2-3 ఏళ్లు ఎలాంటి ఇబ్బంది ఉండదు.
భారీగా తగ్గించుకోవచ్చు
వాహనాల నిర్వహణ ఒక కళ. సరైన అవగాహన లేక విచ్చలవిడిగా బైక్ లేదా కారు నడిపితే చివరికి చాలా మందికి అది భారంలా మారుతుంది. కొన్నిసార్లు నిర్వహణ భరించలేక ఎంతోకొంతకు వదిలించుకోవాలని చూస్తుంటారు. వాహనం నడపటం దగ్గర నుంచి సర్వీసు వరకు మెలకువలు తెలుసుకొని ముందుకు సాగితే ఇంధనమే కాదు, విడి భాగాల పేరుతో బోలెడంత ఆదా చేసుకోవచ్చు.
ఎల్.హర్షిన్, ఆటోమొబైల్ రంగ నిపుణులు