కరోనా సంక్షోభంతో స్టాక్ మార్కెట్లు గత రెండు నెలలుగా భారీ ఒడుదొడుకులు ఎదుర్కొంటున్నాయి. ఈ కారణంగా మదుపరుల సంపద లక్షల కోట్లలో ఆవిరైంది. ఇందులో ఎక్కువగా నష్టాలు మూటగట్టుకున్న వారు చిన్న మొత్తాల్లో పెట్టుబడి పెట్టిన రిటైల్ మదుపరులేనని తెలిసింది. ముఖ్యంగా స్టాక్ మార్కెట్ల ఒడుదొడుకులపై సరైన అవగాహన లేకపోవడం, ప్రస్తుత పరిస్థితులను సరిగ్గా అంచనా వేయలేకపోవడం వల్ల వారు అధిక నష్టాలను మూటగట్టుకోవాల్సి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో చిన్న మదుపరులు కొన్ని మార్గదర్శకాలను అనుసరిస్తే ప్రస్తుత ఒడుదొడుకుల్లో లాభాలను ఆర్జించే వీలుంది. అవేంటో వివరంగా తెలుసుకుందాం.
రిస్క్ తక్కువున్న స్టాక్‌లలో పెట్టుబడి..
బ్లూ చిప్ కంపెనీలు ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కువ స్థిరంగా ఉండి.. దీర్ఘకాలంలో మంచి ఫలితాలను ఇస్తాయి. మదుపరులు ఒడుదొడుకుల సమయాల్లో పెట్టుబడి పెట్టి సంపాందించాలనుకుంటే మాత్రం బ్లూచిప్, లార్జ్ క్యాప్ స్టాక్‌లలో పెట్టుబడి పెట్టడం మంచిది. వీటిలో రిస్క్ తక్కువగా ఉంటుంది. ఇలాంటి షేర్లు ఒడుదొడుకుల సమయంలో కుంగినా తిరిగి నెమ్మదిగా కోలుకుంటాయి.
స్మాల్, మిడ్ క్యాప్ షేర్లు మాత్రం ఇందుకు విరుద్ధంగా ఉంటాయి. తక్కువ సమయంలో ఈ షేర్లు భారీ హెచ్చుతగ్గులను నమోదు చేస్తాయి. ఈ కారణంగా చాలా మంది ఇలాంటి షేర్లకు ఆకర్షితులవుతారు. అయితే అలాంటి షేర్లు ఎప్పుడు ఎలా ఉంటాయో అంచనా వేయడం కష్టం. అలాంటి షేర్లలో పెట్టుబడి అధిక రిస్క్‌తో కూడుకుని ఉంటాయి.
బాటం ఫిషింగ్ వద్దు..
స్టాక్ మార్కెట్ల పతనంపై ఇంతవరకే ఉండొచ్చు అని అంచనాలు వేయడాన్నే బాటం ఫిషింగ్ అంటారు. మార్కెట్లపై ఎప్పుడు కూడా ఇలాంటి అంచనాలు వేయొద్దని నిపుణులు పదేపదే చెబుతుంటారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి అంచనాలు అస్సలు వద్దని సూచిస్తున్నారు. ప్రస్తుత సంక్షోభ సమయంలో మార్కెట్ల స్పందన ఎలా ఉంటుందో చెప్పలేం. ప్రభుత్వాల నిర్ణయాలతో సూచీలు పుంజుకునే అవకాశాలు లేకపోలేవు. అందుకే తప్పుడు అంచనాలతో పెట్టుబడులు పెట్టకూడదు.
పెట్టుబడుల విభజన..
స్టాక్ మార్కెట్లలో పెట్టుబడి పెట్టాలనుకుంటే మొత్తం ఒకే దగ్గర ఇన్వెస్ట్ చేయొద్దు. వివిధ రంగాలు, వివిధ కంపెనీలకు పెట్టుబడులను విభజించాలి. అన్నింటిలో కొంత మొత్తంలో పెట్టుబడి పెట్టాలి. దీని వల్ల రిస్క్ తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఏదైనా సంక్షోభం వస్తే అన్ని రకాల షేర్లు ఒకే సారి ప్రభావితం కావు. ఒక రంగంలో నష్టాలు వచ్చినా.. వేరే రంగంలో లాభాలు వాటిని భర్తీ చేసే వీలుంటుంది.
రిస్క్ స్థాయి నిర్ణయించుకోండి..
ఏదైనా పెట్టుబడి పెట్టే మందు మీరు భరించగలిగే రిస్క్ స్థాయిని ముందే నిర్ణయించుకోవాలి. ఏదైనా అనుకోని పరిస్థితుల్లో రిస్క్ స్థాయికి మీ పెట్టుబడి విలువ పడిపోతే వెంటనే స్పందించాలి. వీలైనంత త్వరగా ఆ స్టాక్స్ నుంచి పెట్టుబడులను ఉపసంహరించుకోవాలి. ఏదో అద్భుతం జరగొచ్చని ఆశించడం కన్నా ముందస్తు జాగ్రత్తతో వ్యవహరించడం మేలు.
లాభాల స్వీకరణ..
పెట్టుబడుల్లో లాభాల స్వీకరణ అనేది ముఖ్యమైన అంశం. సరైన సమయాల్లో లాభాలను తీసుకోవాలి. ఇంకా ఎక్కువగా లాభాలు రావచ్చనే అత్యాశ వద్దు. ముఖ్యంగా ప్రస్తుతమున్న పరిస్థితుల్లో అలాంటి నిర్ణయం తీసుకోవద్దు. సరైన సమయాల్లో లాభాలను సొమ్ము చేసుకోవాలి. తిరిగి వాటిని మళ్లీ ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఇంకాస్త సంపాదించే వీలుంది.
(రచయిత-నేహా గోయల్, ప్రముఖ బిజినెస్ జర్నలిస్ట్ -దిల్లీ)
గమనిక: పైన తెలిపిన పెట్టుబడి సలహాలు, సూచనలు నిపుణుల నుంచి సేకరించినవి మాత్రమే. ఈటీవీ భారత్‌కు గానీ, సంస్థ యాజమాన్యానికి వీటితో సంబంధం లేదు. ఈ సూచనలతో పెట్టుబడి పెట్టాలనుకునే వారు మరోసారి నిపుణులను ప్రత్యక్షంగా కలిసి అభిప్రాయం తీసుకున్న తర్వాతే తదుపరి నిర్ణయానికి వెళ్లాలని ఈటీవీ భారత్ సలహా.