యూకే నియంత్రణ సంస్థ నుంచి అనుమతులు లభించిన వెంటనే ఆక్స్ఫర్డ్ టీకా అత్యవసర వినియోగానికి(ఈయూఏ) డీసీజీఐ అనుమతిస్తుందని ఆశిస్తున్నట్లు బయోకాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్పర్సన్ కిరణ్ మజుందర్ షా పేర్కొన్నారు. జనవరి నాటికి పది కోట్ల డోసులను సిద్ధం చేయనున్నట్లు సీరం ఇన్స్టిట్యూట్ సీఈఓ అదర్ పూనావాలా ప్రకటించిన నేపథ్యంలో.. డిసెంబర్లోనే వ్యాక్సిన్‌కు అనుమతులు వస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. భారత్‌లో వ్యాక్సినేషన్ ప్రారంభించడం ఇప్పుడు ఎంతో అవసరమని అభిప్రాయపడ్డారు.
ఇప్పటికే తమ వద్ద 4కోట్ల డోసులు సిద్ధంగా ఉన్నాయని పూనావాలా సోమవారం వెల్లడించారు. జనవరి నాటికి 10 కోట్ల డోసులు అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు. ఆక్స్ఫర్డ్ టీకా 70 శాతం సమర్థంగా పనిచేస్తుందన్న ప్రకటనపై హర్షం వ్యక్తం చేశారు.
ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ-ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా అభివృద్ధి చేసిన టీకా ట్రయల్స్‌ను భారత్‌లో నిర్వహిస్తోంది సీరం సంస్థ.
ఆస్ట్రాజెనెకా సైతం వ్యాక్సిన్ డోసులను భారీగా ఉత్పత్తి చేసేందుకు కసరత్తులు చేస్తోంది. అనుమతులు లభించిన వెంటనే 2021లో 300 కోట్ల డోసులు ఉత్పత్తి చేస్తామని తెలిపింది. ఈ టీకాను సాధారణ రిఫ్రిజిరేటర్లలో ఆరు నెలల వరకు నిల్వ చేసుకోవచ్చని వెల్లడించింది.
ఇదీ చదవండి- పెట్రో ధరల స్పీడుకు బ్రేకులు పడవా!